తెలుగు సినిమా వరకూ ఇదో సంధి యుగం. రోజు రోజుకూ సినిమా మారుతోంది. థియోటర్ లో ఆడే సినిమాలు, ఓటిటిలో వర్కవుట్ అయ్యే సినిమాలు అని రెండు విభాగాలుగా విడిపోయింది. ప్రేక్షకులు చాలా క్లారిటిగా ఉంటున్నారు. ఎక్కడ చూడాల్సిన కంటెంట్ అక్కడే చూస్తున్నారు. ఈ క్రమంలో చాలావరకు థియోటర్స్ ఖాళీగా ఉంటున్నాయి. థియోటర్ కు రప్పించే సత్తా ఉండే సినిమాలు కొన్నే ఉంటున్నాయి. ఈ క్రమంలో కామెడీ- యాక్షన్ ప్యాకేజీగా ‘పక్కా కమర్షియల్’ రిలీజైంది. గోపిచంద్ కు హిట్ ఖచ్చితంగా అవసరమైన టైమ్ లో వస్తున్న సినిమా ఇది. టైటిల్‌కు తగ్గట్టు కమర్షియల్ హంగులు ఈ సినిమాలో పక్కాగా ఉన్నట్టు ప్రమోషన్స్ చూస్తే అనిపిస్తోంది. ఈ సినిమాలో అసలు ఏముంది..కథేంటి...గోపీచంద్, రాశీఖన్నా లాయర్లుగా మెప్పించారా? మారుతి మ్యాజిక్ వర్కవుట్ అయ్యిందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
Pakka Commercial
కథేంటి
జడ్జి సూర్య నారాయణ (సత్యరాజ్) తను ఇచ్చిన ఓ తీర్పుతో ఓ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవటం జీర్ణించుకోలేకపోతాడు. దాంతో వృత్తిని వదిలేసి పచారి కొట్టు పెట్టుకుని సాధారణ జీవితం గడుపుతూంటాడు. ఆయన కొడుకు లక్కీ (గోపిచంద్) లాయిర్. నీతి, నిజాయితి, విలువలు వంటివి పెట్టుకుంటే మిగిలిపోతాయని వాటికి తిలోదాలిచ్చేసి పక్కా కమర్షియల్ లాయిర్ గా చెలరేగిపోతూంటాడు. తన దగ్గరకు వచ్చిన ప్రతీ కేసుని ఏదో విధంగా ,అవసరమైతే అడ్డంగా పనిచేసైనా గెలిచేస్తూంటాడు. అయితే తండ్రి దగ్గర మాత్రం మంచి మారు పేరులా నటిస్తూంటాడు. అయితే అన్ని రోజులూ ఒకేలా ఉండవు కదా..ఓ రోజు అతను ఆడుతున్న మంచివాడు అనే నాటకం తండ్రి దగ్గర బయిటపడుతుంది. క్రమంలో తండ్రికి, కొడుక్కి క్లాష్ వస్తుంది.
అలాగే ఏ కేసు అయితే తన తండ్రి వృత్తిని ప్రక్కన పెట్టేలా చేసిందో ..అందుకు సంభందించిన వివేక్ (రావు రమేష్) దగ్గర లక్కీ డబ్బులు తీసుకుంటూ అతని కేసులు వాదిస్తున్నాడని తెలుస్తుంది. అది ఆ తండ్రికి మండిపోతుంది. తన కొడుకుకి ఎదురు తిరిగుతాడు.ఛాలెంజ్ చేస్తాడు. తను వదిలేసిన నల్ల కోటు మళ్లీ తీసి వేసుకుని కొడుకు వాదించే విలన్ వివేక్ కేసుకు ఎదురు వాదిస్తాడు. తండ్రి, కొడుకుల్లో ఎవరు గెలిచారు..లక్కీ పక్కా కమర్షియల్ గా మారటం వెనక ఉన్న రహస్య ఎజెండా ఏమిటి... ..తండ్రి,కొడుకులు ఒకటి అయ్యారా.. టీవి సీరియల్ సీనియర్ ఆర్టిస్ట్ ఝాన్సి (రాశిఖన్నా) కథేంటి... . ఆమె ఎందుకు టీవి సీరియల్స్ ని ప్రక్కన పెట్టి, లక్కీ దగ్గర అసెస్టెంట్ గా జాయిన్ అవ్వాల్సి వస్తుంది. చివరకు, ఏమైంది? అనేది సినిమా.
విశ్లేషణ
తండ్రి,కొడుకులు ఛాలెంజ్ కథలు మనకు ఏమీ కొత్త కాదు. అయితే కొత్త కథ చెప్తానని మారుతి హామీ ఇవ్వలేదు కాబట్టి దాని గురించి మాట్లాడటం అనవసరం. ఆ కథ ను ఎంత ప్రేక్షకామోదయోగ్యంగా చెప్పాడు అనేది అవసరం. ఓ లీగల్ పాయింట్ ని తీసుకుని మారుతి తనదైన ఫన్ ట్రీట్మెంట్ , ఎమోషన్ తో నెట్టుకెళ్లే ప్రయత్నం చేసారు. అయితే ఈ క్రమంలో కొంతనాటుగా,మోటుగానే స్క్రీన్ ప్లేని రొటీన్ గా డీల్ చేసారు. అది ఆయన కమర్షియల్ అనుకోవచ్చు. ఎలైగైనా గోపిచంద్ కు తనదైన స్టైల్ లో హిట్ ఇవ్వాలని తాపత్రయం తో సీన్స్ డిజైన్ చేసి ఉండవచ్చు. అయితే గోపిచంద్ కు కామెడీ కొత్తేమీ కాదు. ఇంతకు ముందు యాక్షన్ కామెడీలుతో హిట్స్ కొట్టాడు. కాబట్టి గోపిచంద్ ఫన్ ని తన బాడీ లాంగ్వేజ్ లో మెర్జ్ చేసుకుని మోసుకుంటూ వెళ్లిపోయాడు.
అయితే గోపిచంద్ ఇమేజ్ మాయలో పడి మారుతి తన బ్రాండ్ ఫన్ ని మర్చిపోయారు. కామెడీ సీన్స్ వస్తూంటాయి. వెళ్తూంటాయి. కానీ అంతలా నవ్వించవు. దానికి తోడు మామూలు కథలో ఫార్స్ ని తీసుకొచ్చి కలిపారు. దాంతో అదో కిచిడిలా తయారైంది. అలాగే కథలో మెయిన్ కాంప్లిక్ట్స్ ని చాలా ప్లాట్ గా డీల్ చేసారు. ఎక్కడా విలన్ కు ..ఫలానా వాడు తనను దెబ్బ తీయటానికి ప్రయత్నిస్తున్నాడు అని తెలియదు. దాంతో హీరో పాత్ర చాలా ప్యాసివ్ గా వన్ సైడ్ గా నడుస్తుంది. తెలిసేసరికి స్క్రీన్ టైమ్ అయ్యిపోతుంది. అలాగే ఇది తండ్రి కొడులు కథ మెయిన్ ప్లాటా..లేక విలన్ ,హీరోది మెయిన్ ప్లాటా క్లారిటీ దొరకదు. దాంతో ఏది ఫాలో అవ్వాలని కాసేపు కన్ఫూజ్ అయ్యి చివరకు తండ్రి,కొడుకుల ఎమోషన్ వైపే మ్రొగ్గు చూపుతాము. ఇక ఈ క్రమంలో స్టోరీ ప్లాట్ గా మారింది.
సాధారణంగా ప్రతీ సినిమా కథ ఫలానా జానర్, వారికి ఓ టార్గెట్ ఆడియెన్స్ అని ఫిక్సై రాసుకుంటారు. కానీ ఈ కథ అందరికీ నచ్చాలనే ప్రయత్నంతో అందులో హ్యూమర్, లవ్, యాక్షన్, కాసేపు ఫార్స్, మరికాసేపు సెటైర్ వంటి అంశాల్ని జోడించారు. అవన్నీ స్టోరీ లైన్ సరిగ్గా విస్తరణ జరగనప్పుడు ఆ కథల్లో ఇమడని అంశాలని సినిమా ముందుకు సాగేకొద్దీ అర్థమవుతుంది. అన్ని కావాలనుకున్నాక పాటలు కూడా ఉంటాయి కదా. అవన్నీ ఈ కథా వేగానికి బ్రేక్‌లు వేసే ప్రయత్నమే చేసాయి. కథలో కావల్సిననన్ని పంచ్ లు, ఫైట్ లు, మలుపులున్నా అవి చూసేవారికి పెద్దగా కిక్‌నివ్వవు. క్రైమ్ అంశం కథలో ఉన్నప్పుడు తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠని పెంచాలి తప్ప,ఇంటెన్సిటీ మాయమై సన్నివేశాలు చప్పగా మార్చేసే పోగ్రామ్ లు పెట్టుకోకూడదు. ఈ సినిమా విషయంలో అదే జరిగింది. అటూ ఇటూ కాకుండా పాసైపోతుంది, అనుకునే కథ రెంటికి చెడ్డ రేవడిలా మారిపోయింది. అంతెందుకు ఇంటర్వల్ ట్విస్ట్ కథా గమనాన్నే మార్చేస్తుంది,. కథలో అప్పటిదాకా లేని మరో కోణాన్ని ఆవిష్కరిస్తుందని ఆశిస్తాం..కానీ సెకండాఫ్ కూడా అదే జరుగుతూంటుంది. అయితే కామెడీ కొంతవరకూ మోసేసింది. ఫస్టాఫ్ లో సిల్లీగా ఉన్నా సెకండాఫ్ లో ప్యారిడీలతో లాగినా ఓ వర్గానికి ఓకే అనిపిస్తుంది.
బాగున్నవి
అక్కడక్కడా పేలిన కామెడీ ఎపిసోడ్స్
ఆర్టిస్ట్ ల కామెడీ టైమింగ్
బాగోలేనివి
రొటీన్ ప్లాట్
కథ,కథనం
క్లైమాక్స్
టెక్నికల్ గా ...
దర్శకుడుగా మారుతి రైటింగ్ అనేది రైట్ హ్యాండ్ లాంటిది. అయితే ఈ సారి అది హ్యాండ్ ఇచ్చింది. జేక్స్ బిజాయ్ సంగీతంలో వచ్చిన పాటలు సోసోగా ఉన్నాయి. టైటిల్ సాంగ్ బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సైతం సూపర్ గా లేదు. సినిమాటోగ్రాఫర్ కరమ్ చావ్లా ది బెస్ట్ అనలేం కానీ బాగుంది. ఉద్దవ్ ఎడిటింగ్ జస్ట్ ఓకే. దర్శకుడుగా మారుతి నుంచి ప్రేక్షకులు ఆశించే వినోదంతో పాటు యాక్షన్, కమర్షియల్ హంగులు కూడా సినిమాలో పెద్దగా కనపించలేదు. ఏదో ప్రెజర్ లో సినిమా చేసినట్లు అనిపించింది. డైలాగులు అయితే కొన్నింటికి థియోటర్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘నోట్లో పాన్ వేసుకుని, షర్ట్ మడతపెట్టి దిగితే’అంటూ గోపిచంద్ చెప్పే డైలాగు బాగుంది. అలాగే ‘ఇది నిజం.. జయం.. మై డార్లింగ్ వర్షం’ అంటూ గోపీచంద్ తన పాత సినిమాలను గుర్తు చేసుకోవటం కూడా ఆయా సినిమాల హీరోలకు బాగా నచ్చినట్లుంది. రెస్పాన్స్ అదిరింది. ఫైట్స్ బాగున్నాయి. ఇక బన్ని వాసు ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
నటీనటుల్లో ...
గోపిచంద్ నటన బాగుంది. రాశిఖన్నా ..అందంగా ఉంది .ఓవర్ యాక్షన్ చేస్తూ బాగానే నవ్వించింది. రావు రమేష్, సత్యరాజ్ ఇద్దరూ కీలకమైన పాత్రలు మరోసారి మారుతి సినిమాలో చేసారు. ఉమనైజర్ గా రావు రమేష్ అదరకొట్టారు. సత్యరాజ్ సరేసరి. ప్రవీణ్ ని పెద్దగా వాడుకోలేదు. వరలక్ష్మి శరత్ కుమార్ ఎంట్రీ చూసి చాలా ఎక్సపెక్ట్ చేస్తాం కానీ అంతలేదు. అజయ్ గోష్ ..మారుతి సినిమాలకి యాప్ట్. ఆయన పాత్రను బాగా డిజైన్ చేశారు. మిగతా పాత్రలు ఓకే.
ఫైనల్ థాట్
మాది పక్కా కమర్షియల్ సినిమా అని పదే పదే డైరక్టర్ ప్రక్కనేై కూర్చుని చెప్తున్నట్లు చాలా సీన్స్ ఉండటం ఈ సినిమా ప్రత్యేకత
--సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating: 2.5
Pakka Commercial
నటీనటులు: గోపీచంద్, రాశీ ఖన్నా, సత్యరాజ్, వరలక్ష్మీ శరత్ కుమార్, రావు రమేష్, అజయ్ ఘోష్, ప్రవీణ్, సప్తగిరి, శియ, చిత్రా శుక్లా తదితరులు
సినిమాటోగ్రఫీ: కర్మ్ చావ్లా
సంగీతం: జేక్స్ బిజాయ్
సమర్పణ: అల్లు అరవింద్
నిర్మాత: 'బన్నీ' వాసు
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: మారుతి
విడుదల తేదీ: జూలై 1, 2022