బిగ్ బాస్ షోతో పాపులర్ అయ్యింది దివి వాద్త్యా. నాల్గో సీజన్‌లో ఆమె సందడి చేసింది. గ్రాండ్ ఫినాలే రోజు చిరంజీవి మనసులో పడి మరింతగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత నెమ్మదిగా అవకాశాలను అందుకుంటూ రాణిస్తుంది. ఇటీవల అడపాదడపా మెరుస్తుంది. స్పెషల్ సాంగ్‌లు కూడా చేస్తుంది. తాజాగా ఆమె హీరోయిన్‌గా మారింది. `లంబసింగి` అనే చిత్రంలో నటించింది. లంబసింగి అత్యంత కూల్ ఏరియాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే పేరుతో, అక్కడ జరిగిన ఘటనలతో ఈ మూవీని రూపొందించారు. భరత్ రాజ్ ఆమెకి జోడీగా మెయిన్ లీడ్‌గా నటించారు. నవీన్ గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల నిర్మాణంలోకి అడుగుపెట్టారు. ఆయన కాన్సెప్ట్ ఫిల్మ్స్ పతాకంపై ఆనంద్ టీ ఈ మూవీని నిర్మించారు. సినిమా ప్రమోషన్స్ లో బిగ్ స్టార్స్ ఇన్‌వాల్వ్ అయి ఈ మూవీకి సపోర్ట్ చేశారు. శుక్రవారం (మార్చి 15న) ఈ మూవీ విడుదలైంది. మరి సినిమా ఆకట్టుకుందా? దివి అలరించిందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథః
లంబసింగి అనే ప్రాంతంలో పోలీస్ స్టేషన్ పరిధిలో నక్సల్స్ ప్రభావం ఎక్కువ. వారిలో కొందరు నక్సల్స్ పోలీసులకు లొంగిపోయి సాధారణ జీవితం గడుపుతుంటారు. కానీ రెగ్యూలర్‌గా పోలీస్ స్టేషన్‌లో సంతకం పెట్టాలని ఎస్పీ రూల్ పెడతారు. అది కొనసాగుతుంది. కట్ చేస్తే వీరబాబు(భరత్ రాజ్) కొత్తగా అదే పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరతాడు. అయితే అతను వస్తూ వస్తూ సంతలో ఓ అందమైన అమ్మాయిని చూస్తాడు. ఆమెకి తొలిచూపులోనే పడిపోతాడు. పోలీస్ ఉద్యోగం చేస్తూనే ఎప్పుడు ఆమె ద్యాసలోనే ఉంటాడు. ఓ రోజు మాజీ నక్సల్ కోనప్ప ఇంటికి సంతకం కోసం వెళ్లినప్పుడు ఆ ఇంట్లోనే తాను ప్రేమించే అమ్మాయి ఉంటుంది. పేరు హరిత(దివి వాద్త్యా). కోనప్ప కూతురు. స్థానిక ఆసుపత్రిలో నర్స్ గా పనిచేస్తుంది. ఆమెని చూసి మరింత ఫిదా అవుతాడు. దీంతో కోనప్ప సంతకం కోసం రోజూ వాళ్లింటికి వెళ్తాడు. ఆమెకి మరింతగా దగ్గరయ్యే ప్రయత్నం చేస్తాడు. ఊర్లో ఓ వ్యక్తి అనారోగ్యానికి గురైతే వీరబాబు సపోర్ట్ చేస్తాడు. ఆ సమయంలో ఆమె వీరబాబు చేసిన పనికి ఇంప్రెస్ అవుతుంది. కానీ స్థానిక ఎమ్మెల్యే కారణంగా ఆ వ్యక్తి చనిపోతాడు. దీంతో ఎమ్మెల్యేపై కోపం పెంచుకుంటుంది. కట్ చేస్తే ఓ రిసార్ట్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యేని నక్సల్స్ మందుపాతర పెట్టి చంపేస్తారు. అది రాష్ట్రవ్యాప్తంగా సెన్సేషన్ కావడంతో పైనుంచి పోలీసులకు ప్రెజర్ ఉంటుంది. దీన్ని ఎస్పీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాడు. ఈ ఘటనకు కారకులు ఎవరని ఆరా తీస్తే కోనప్ప అని తెలుస్తుంది. ఈ ఘటనతో ఊర్లో నక్సల్స్ గా అనుమానితులందరిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అదే సమయంలో పట్నం నుంచి భారీగా ఆయుధాలు పోలీస్ స్టేషన్‌కి వస్తాయి. ఓ రోజు రాత్రి నక్సల్స్ పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి తుపాకులను ఎత్తుకెల్లిపోతారు. ఆ సమయంలో అక్కడ వీరబాబునే డ్యూటీ చేస్తాడు. కానీ ఏం చేయలేకపోతాడు. ఆ సమయంలో ఓ షాకింగ్ విషయాన్ని వీరబాబు చూస్తాడు. ఆయన చూసిన విషయం ఏంటి? కోనప్ప ఎలా మిస్ అయ్యాడు? హరిత బ్యాక్ గ్రౌండ్ ఏంటి? తన ప్రేమని ఆమె యాక్సెప్ట్ చేసిందా? ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగిలిన కథ.
విశ్లేషణః
`లంబసింగి`.. స్టోరీ సింపుల్‌గా చెప్పాలంటే పోలీస్, నక్సల్ మధ్య లవ్ స్టోరీ. పోలీసుల వద్ద, నక్సల్స్ వల్ల ఈ ప్రేమ జంట ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేసిందనేది కథ. అయితే నక్సల్స్ పోరాటాల నేపథ్యంలో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. అందులో కొన్ని ఆదరణ పొందాయి. అయితే ఇటీవల కాలంలో నక్సల్స్ బ్యాక్ డ్రాప్ సినిమాలు పెద్దగా ఆదరణ పొందడం లేదు. అంతగా రక్తికట్టించేలా మేకర్స్ తెరకెక్కించలేకపోవడం, ఇప్పటి జనరేషన్ వాటిని ఎంకరేజ్ చేయలేకపోవడంతో ఆయా సినిమాలు ఆదరణకు నోచుకోవడం లేదు. అయితే ఇలాంటి కాన్సెప్ట్ చిత్రాలను కమర్షియాలిటీతో బ్యాలెన్స్ చేస్తే అంతో ఇంతో ఆడే అవకాశం ఉంటుంది. ఈ కోణంలోనే `లంబసింగి` చిత్రాన్ని కమర్షియల్ అంశాలతో రూపొందించే ప్రయత్నం చేశాడు దర్శకుడు నవీన్ గాంధీ. లవ్ స్టోరీని మెయిన్‌గా తీసుకున్నాడు. దాని చుట్టూ మిగిలిన అంశాలను అల్లుకున్నాడు. ఇక్కడ సేఫ్ గేమ్ ఆడాడు.
సినిమా మొదటి భాగం మొత్తం హీరోహీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ చూపించారు. అమ్మాయి వెంట పోలీస్ పడటం కొత్తగా ఉంటుంది. ఈ బ్యాక్ డ్రాప్ కూడా కొత్త ఫీలింగ్ అనిపిస్తుంది. అదే సమయంలో లంబసింగి అందాలపైనా ఫోకస్ చేశాడు దర్శకుడు. ఓ వైపు ప్రేమ కథ, మరోవైపు అక్కడి అందాలను అంతే కలర్‌ఫుల్‌గా, అందంగా చిత్రీకరించడంతో ఒక మంచి అనుభూతి కలుగుతుంది. అలా ఆడియెన్స్ కి డబుల్ ట్రీట్ ఇచ్చారని చెప్పొచ్చు. అయితే ఇందులో మొదటి భాగం మొత్తం వన్ సైడ్ లవ్ ఉంటుంది. ఆ విషయంలో ఇంకాస్త డెప్త్ గా లవ్ ఎపిసోడ్లని పెట్టి ఉంటే బాగుండనిపిస్తుంది. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ సినిమాకి మెయిన్ హైలైట్‌గా నిలుస్తుంది. అప్పటి వరకు సరదాగా సాగిన సినిమాని సీరియస్ టర్న్ తీసుకునేలా చేస్తుంది. ఎమ్మెల్యేపై బాంబ్ బ్లాస్ట్ తోనే సినిమా కథలో వేగం ప్రారంభమవుతుంది. అది ఇంటర్వెల్ ట్విస్ట్ తో మరింత రక్తికట్టించేలా మారింది.
సెకండాఫ్‌లో మొత్తం ఫారెస్ట్ లోనే కథ నడుస్తుంది. అక్కడ ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ మరింత ఊపందుకుంటుంది. అక్కడి నుంచి మధ్య మధ్యలో ఎమోషనల్ టచ్ ఇస్తూ, ఫీల్ గుడ్ అంశాలను చూపిస్తూ సినిమా సాగుతుంది. మరోవైపు పోలీసుల ఎటాక్‌లు జరుగుతుంటాయి. ఈ క్రమంలో వచ్చే ఉత్కంఠభరిత సన్నివేశాలు, లవ్ ఎపిసోడ్ సీన్లు ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంటాయి. హీరోయిన్ కోసం పడే పాట్లు ఫన్నీగా నవ్వించేలా ఉంటాయి. అయితే ఆ కామెడీ డోస్ మరింత పెంచాల్సింది. అయితే క్లైమాక్స్ వరకు వెళ్లేసరికి సినిమా మరింత ఎమోషనల్‌గా మారిపోతుంది. చివర్లో వచ్చే ట్విస్ట్ హృదయాన్ని బరువెక్కిస్తుంది. అయితే క్లైమాక్స్ విషయంలో దర్శకుడు మరోలా చేసి ఉంటే బాగుండేదనిపిస్తుంది. మరో క్లైమాక్స్ రాసుకుంటే ఫలితం ఇంకా బెటర్‌గా ఉండేది. దీంతోపాటు ఇందులో నక్సల్ బ్యాక్ డ్రాప్ కూడా ఇరికించినట్టు ఉంటుంది. దాన్ని తగ్గించి లవ్ ట్రాక్‌ని పెంచి మరింత ఎంటర్‌టైనింగ్‌గా తెరకెక్కిస్తే సినిమా వేరే లెవల్‌లో ఉండేది.
నటీనటులుః
దివి ఫస్ట్ టైమ్ హీరోయిన్‌గా చేసింది. కానీ చాలా బాగా నటించింది. అనుభవం ఉన్న నటిలా మెప్పించింది. అందంగానూ కనిపించింది. పల్లెటూరి పిల్లగా ఒదిగిపోయింది. డిఫరెంట్ షేడ్స్ చూపిస్తూ ఆకట్టుకుంది. ఇక వీరబాబు పాత్రలో భరత్ రాజు అదరగొట్టాడు. చాలా ఈజ్‌తో చేశాడు. తొలి సినిమా అయినా బాగా చేశాడు. ఎక్స్ ప్రెషన్స్ బాగా పలికించాడు. నటుడిగా మంచి భవిష్యత్ ఉంది. ఈ సినిమాతో ఈ ఇద్దరికి మంచి ఆఫర్లు వస్తాయని చెప్పొచ్చు. ఇక మిగిలిన పాత్రల్లో వంశీ రాజ్, కిట్టయ్య, నిఖిల్ రాజ్, జనార్దన్, అనురాధ, మాధవి, నవీన్ రాజ్, ప్రమోద్, రమణ, పరమేష్ తమ పాత్రల మేరకు బాగానే నటించారు.
టెక్నీషియన్లుః
సినిమాకి సంగీతం ప్రాణం పోసింది. ఆర్‌ఆర్ ధ్రువన్ సంగీతం చాలా బాగుంది. చిన్న సినిమా అనే ఫీలింగ్ ఎక్కడా అనిపించదు. ఇంకా చెప్పాలంటే ఓ పెద్ద రేంజ్ సినిమా లెవల్‌లో మ్యూజిక్ ఇచ్చారు. పాటలన్నీ చాలా బాగున్నాయి. ఆకట్టుకునేలా ఉన్నాయి. బీజీఎం సైతం అంతే బాగుంది. చాలా వరకు లోగా ఉన్న సీన్లని కూడా బీజీఎం ఎలివేట్ చేసింది. రక్తికట్టేలా చేసింది. మ్యూజిక్ డైరక్టర్‌కి మంచి లైఫ్ ఉందని చెప్పొచ్చు. ఇక కె బుజ్జి కెమెరా వర్క్ సైతం రిచ్‌గా, అందంగా ఉంది. ప్రతి ఫ్రేముని ఎంతో అందంగా చూపించారు. గ్రీనరీ,పల్లెటూర్లని మరింత అందంగా చూపించాడు. కె విజయ్ వర్థన్ ఎడిటింగ్ ఫర్వాలేదు, ఇంకాస్త కేర్ తీసుకుంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. చిన్న సినిమా అయినా చాలా పెద్దగా అనిపిస్తుంది. ఇక దర్శకుడు నవీన్ గాంధీ డైరెక్షన్ ఓకే. కథ బాగుంది. కానీ దాన్ని తెరకెక్కించడంలో కన్ ఫ్యూజ్ అయ్యాడు. క్లైమాక్స్ సరిగా రాసుకోలేదు. మొదటి భాగాన్ని బాగా డిజైన్ చేసుకోవాల్సింది. నక్సల్ ఫ్లాట్ విషయంలోనూ జాగ్రత్త పడితే సినిమా ఫలితం బాగుండేది.
ఫైనల్‌గాః `లంబసింగి`.. కొత్త బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ. టైమ్ పాస్ మూవీ.
రేటింగ్‌ః 2.5
నటీనటులు:
భరత్ రాజ్, దివి, వంశీ రాజ్, కిట్టయ్య, నిఖిల్ రాజ్, జనార్దన్, అనురాధ, మాధవి, నవీన్ రాజ్, ప్రమోద్, రమణ, పరమేష్ తదితరులు.
సాంకేతిక నిపుణులు:
సమర్పణ: కళ్యాణ్ కృష్ణ కూరసాల
కథ, మాటలు ,స్క్రీన్ ప్లే ,దర్శకత్వం: నవీన్ గాంధీ
నిర్మాత: ఆనంద్.టి
బ్యానర్: కాన్సెప్ట్ ఫిలింస్
కెమెరామెన్: కె.బుజ్జి
సంగీతం: ఆర్ఆర్.ధ్రువన్
ఎడిటర్: కె.విజయ్ వర్ధన్
లిరిక్స్: కాసర్ల శ్యామ్