#Yatra2review: ఈవెంట్‌ బేస్డ్‌ బయోపిక్ ''యాత్ర 2'' రివ్యూ

First Published | Feb 8, 2024, 2:22 PM IST

వైఎస్సార్‌ మరణం (2009) తర్వాత ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలు.. తండ్రి ఆశయాలను నెరవేర్చడం కోసం వైఎస్‌ జగన్‌ చేపట్టిన పాదయాత్ర

Yatra 2 Movie Review


ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విడుదలైన యాత్ర 1 సైలెంట్ గా వచ్చి మంచి సక్సెస్ అయ్యింది. అలాగే పార్టీ ప్రచారానికి సైతం ఉపకరించింది. అయితే ఆ చిత్రానికి సీక్వెల్ గా రెడీ అయ్యిన  ''యాత్ర 2'' మాత్రం ఆ స్దాయి బజ్ ని క్రియేట్ చేయలేకపోయింది. అందుకు కారణం ప్రతిపక్షంలో ఉన్నప్పుటి సానుభూతి, ఆసక్తి సినిమాపై రిప్లెక్ట్ అయ్యింది. అయితే ఇప్పుడు పాలక పక్షంలో అదే సీన్  రిపీట్ కావాలంటే కష్టమే. ఎందుకంటే ఆల్రెడీ అధికారంలో ఉన్నారు కాబట్టి భజన చిత్రంగా భావించే అవకాసం ఉంది. దాన్ని ఈ చిత్ర దర్శకుడు దాటగలిగాడా...సినిమా ఎలా ఉంది. .యాత్ర1 నాటి మ్యాజిక్ రిపీట్ అవుతుందా వంటి వివరాలు రివ్యూలో చూద్దాం.

Yatra 2 Review

స్టోరీ లైన్

రెండో సారి ముఖ్యమంత్రి అయిన వైయస్సార్  (మమ్ముట్టి)  తన కుమారుడు జగన్ మోహన్ రెడ్డి (జీవా)ని ఎన్నికల ప్రచారంలో ప్రజలకు పరిచయం చేస్తారు. అనుకోని విధంగా హెలికాఫ్టర్ ప్రమాదంలో వైయస్సార్ మరణిస్తారు. ఆ తర్వాత  జగన్ ముఖ్యమంత్రి కావాలని 150 మంది ఎమ్మెల్యేలు సంతకం చేస్తారు.  కానీ ప్రోగ్రెస్ పార్టీ హైకమాండ్, మేడమ్ (సుజానే బెర్నెర్ట్) రోశయ్యను సిఎం చేస్తారు.  ఈ లోగా తన  తండ్రి మరణవార్త విని ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను నిర్ణయించుకుంటాడు జగన్. వాళ్లను  కలవడానికి ఓదార్పు యాత్ర చేపడతారు . ఆ యాత్ర చేస్తే రాజకీయంగా ఇబ్బంది అని ఆపేయమని మేడమ్ నుంచి ఆదేశాలు వస్తాయి. వాటిని లెక్కచేయకుండా  జగన్... తాను   రాజశేఖర్ రెడ్డి కుమారుడిని అని, యాత్ర చేస్తానని చెప్పి ముందుకు వెళ్తారు. అంతే కాదు ప్రోగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్‌సీపీ పార్టీ స్థాపిస్తారు.  ఇదిలా ఉంటే తెలుగునాడు పార్టీ అధినేత చంద్రబాబు (మహేష్ మంజ్రేకర్) నుంచి జగన్ పార్టీకి సమస్యలు ఎదురౌతాయి..అవేమిటి,చివరికి ఏమైంది? అనేది మీకు తెలియకపోతే సినిమా చూసి తెలుసుకోవాలి.


Yatra 2 Review


 ఏముంది సినిమాలో ...

ఎలా ఉంది సినిమా అనే దాని కన్నా ఇలాంటి  సినిమాలలో ఏముంది అనేదే ఆసక్తికరమైన అంశం. ఈ సినిమా ఎందుకోసం తీసారో ..పర్పస్ ఏమిటో తెలిసుకుని, ఆ యాంగిల్ లో చూస్తేనే ఆ విషయంలో ఏ మేరకు సక్సెస్ అయ్యారో అంచనా వేయగలుగుతాం. ముఖ్యంగా అందరికీ తెలిసిన కథ అవ్వటం తో కథ మీద పెద్దగా ఆసక్తి ఏమీ ఉండదు. 
 2009 నుంచి 2014 వరకు ఏపీలో జరిగిన రాజకీయ పరిణామాలలతో కూడిన .సంఘటనలు కూర్పుతో అల్లుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం అనంతరం రాష్ట్రంలో,రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలు, ఆ క్రమంలో ఆయన కుమారుడు జగన్ చేసిన ఓదార్పు యాత్ర ని బేస్ చేసుకున్నారు. ఓదార్పు యాత్రలో జగన్ కు ఎదురైన ఎక్సపీరియన్స్ లు, అనుభవాలు, అనుభూతులు, వాటిని ఆయన మనస్సులోకి తీసుకుని ఏం చేసారు... తండ్రి ఆశయాలు నెరవేర్చటానికి ఓ కొడుకు గా జగన్ ఏం చేసారు..రాజకీయ కుట్రలు మధ్య నాయకుడుగా ఎలా ఎదిగి, ప్రజామన్ననలు పొందారన్నదే కథ. 
 

Yatra 2 Review


ఇవి ఇలాగే చెప్తే బోర్ కొడుతుందని తెలిసి.. దర్శకుడు  ఈ సినిమా  రాజకీయ ప్రచారం లాగ కాకుండా  ఎమోషన్స్ పైనే ఎక్కవ ఆధారపడ్డారు.  వేరే పార్టీపై ఎటాక్ లు  రెచ్చగొట్టే ధోరణి చూపెట్టుకోలేదు.  పొలిటికల్ బయోపిక్ అయినా  ఎమోషనల్ గా కథనం నడిపించటం కొంతవరకూ కలిసొచ్చింది. అయితే యాత్ర 1 కు కూడా ఆయన ఎంచుకున్న పంధా అదే. ఇక్కడ అదే రిపీట్ చేసారు, డైలాగులు కూడా చాలా సహజంగా,ఎఫెక్టివ్ గా.జగన్ వ్యూ పాయింట్ ని, ఐడియాలజీ ఇది చెప్పే విధంగా మలిచారు. ఆ వ్యూ పాయింట్ కరెక్టా కాదా..అనే డిస్కషన్ కు తావివ్వలేదు. ఎక్కువ సీన్లలో స్ట్రాంగ్ గా ఎమోషన్స్ ని రైజ్ చేయటానికి ప్రయత్నించారు. క్యారక్టర్స్ ని ఉదాత్తంగా చూపించారు. ఈ  సినిమాని ఓ సినిమాగా ఎలా తీసారు..అని చూస్తే ఏ ఇబ్బంది ఉండదు. అలా కాకుండా  నిజ జీవిత పాత్రలను బేరేజు చేసుకోవటం మొదలెడితే మాత్రం దెబ్బతింటాం. తెలుసున్న విషయంతో  బోర్ వచ్చేస్తుంది. 

Yatra 2 Review

ఈ సినిమాలో ఎక్కువ శాతం   వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి వ్యక్తిత్వం ఏంటి? పర్శనల్ ఎజెండా లేకుండా తన తండ్రి ఆశయాలను నెరవేర్చడం కోసమే  జెండా మోసారని చెప్పటం జరుగుతుంది. ఆ క్రమంలో ఆయన కష్టాలుని చూపించారు. ఆ సీన్స్ లో ఎమోషన్ , సానుభూతి వర్కవుట్ చేసేందుకు ప్రయత్నించారు.   వైఎస్సార్‌సీపీ పార్టీ స్థాపించడానికి గల కారణాన్ని చెప్పుకొచ్చారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా భయపడకుండా నిలబడి, ప్రజా నాయకుడిగా  ఎదగగలిగాడు అని చెప్పటమే యాత్ర 2 ఉద్దేశ్శం. కథగా చెప్పుకోవటానికి  పెద్ద కాంప్లిక్ట్స్ కు అవకాసం లేనిది. ఎందుకంటే విజయ గాధ ఇది. యాత్ర 1 లో విజయం కోసం సాధన ఉంది. ఇక్కడ విజయం ఆల్రెడీ సాధించారనే విషయం చూసే వాళ్లకు తెలుసు. కాబట్టి జగన్ ని ఇష్టపడే వాళ్లకు నచ్చేలా, మిగతావాళ్లకు ఇబ్బందిగా అనిపిస్తుంది. 

Yatra 2 Review


టెక్నికల్ గా ...

‘జగన్‌ రెడ్డి కడపోడు సార్‌.. శత్రువుపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాకా.. వాళ్లు నాశనమైపోతారు అని తెలిసినా.. శత్రువుకి తలవంచరు సార్‌  , 'మనం తలపడుతున్నది చంద్రబాబుతో, తక్కువ అంచనా వేయకూడదు'  , 'నాయకులకు తెలిసినంత రాజకీయం కార్యకర్తలకు తెలియదు కదా సార్' , 'నాకు భయపడడం రాదయ్యా.. నేనేంటో, నా రాజకీయం ఏంటో మీకు ఇంకా అర్థం కాకపోవచ్చు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి.. నేను వైఎస్సార్‌ కొడుకుని' వంటి డైలాగులుకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక టెక్నికల్ గా మంచి స్టాడర్డ్స్ తో తీసారు.  సంతోష్ నారాయణన్ సంగీతం, మహి వి రాఘవ్ రచన & దర్శకత్వం, శ్రవణ్ కటికనేని ఎడిటింగ్ అన్ని ఫెరఫెక్ట్ గా ఉన్నాయి. అయితే స్క్రీన్ ప్లేలో కొత్త గా చెప్పే సీన్స్ లేకపోవటం, స్లో నేరేషన్ ఇబ్బంది పెడుతుంది.  ఎమోషనల్ సీన్స్ లో BGM, జగన్ పాత్రకి ఎలివేషన్స్ లో ఇచ్చిన BGM హైలెట్.

Yatra 2

నటీనటుల్లో ..

జగన్ గా జీవా అలా అచ్చుగుద్దినట్లు చేసుకుంటూ వెళ్లిపోయారు. అనుకరించటం కాకుండా  జగన్ యాటిట్యూడ్, మేనరిజమ్స్ తో చెలరేగిపోయారు  . వైఎస్ భారతి పాత్రలో కేతకి నారాయణ్, విజయమ్మగా ఆశ్రిత వేముగంటి, చంద్రబాబుగా మహేష్ మంజ్రేకర్ బాగా చేసారు.  తమిళ నటుడు జార్జ్ మరియమ్ సీన్స్ బాగా పండాయి. ఎమోషన్స్ రైజ్ చేసాయి. 

ఫైనల్ థాట్

ఇది జగన్ గెలుపు  కోసం ఓ దర్శకుడు  చేసిన సినీ యాత్ర. ప్రతీ షాట్,సీన్ ఆ దిశగానే మలిచారు. 
Rating:2.75

---సూర్య ప్రకాష్ జోస్యుల

Yatra 2

నటీనటులు: మమ్ముట్టి, జీవా, కేతకి నారాయణ్‌,సుజానే బెర్నెర్ట్, మహేష్ మంజ్రేకర్, శుభలేక సుధాకర్‌ తదితరులు
నిర్మాణ సంస్థ: త్రీ ఆట‌మ్ లీవ్స్‌, వీ సెల్యూలాయిడ్
నిర్మాత: శివ మేక
రచన-దర్శకత్వం: మహి వి. రాఘవ్‌
సంగీతం: సంతోష్ నారాయణన్‌
సినిమాటోగ్రఫీ:మది
విడుదల తేది: ఫిబ్రవరి 8, 2024

Latest Videos

click me!