
థియేటర్స్ లో రిలీజ్ అయ్యే సినిమాలకు పోటీ ఇచ్చే స్దాయిలో ఓటిటి సినిమాలు ఉంటున్నాయి. అలాగే ఓటీటిలో ఓ గమ్మత్తైన ట్రెండ్ నడుస్తోంది. ఆల్రెడీ తెలుగులో రిలీజైన సినిమాలు చూడటం కన్నా మనవాళ్లు ఎక్కువగా మళయాళం నుంచి వస్తున్న డబ్బింగ్ సినిమాలపై దృష్టి పెడుతున్నారు.
ఆ క్రమంలో తెలుగులో మరో మళయాళ కామెడీ దిగింది. ఆ సినిమానే 'నునాక్కుజి'. దృశ్యం దర్శకుడు జీతూ జోసెఫ్ డైరక్ట్ చేసిన ఈ సినిమా, ఆగస్టు 15వ తేదీన అక్కడి థియేటర్లకు వచ్చింది. మీడియం బడ్జెట్ లో రూపొందిన ఈ సినిమా పాతిక కోట్ల వరకూ రాబట్టి సక్సెస్ అయ్యింది, రీసెంట్ గా ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా ఇప్పుడు ఎలా ఉందనేది చూద్దాం.
స్టోరీ లైన్
ఏబీ జకారియా (బాసిల్ జోసెఫ్) కోటీశ్వరుడు. తన తండ్రి ఆఖరి కోరికను తీర్చడం కోసం రిమీ (నిఖిలా విమల్)ను పెళ్లి చేసుకుంటాడు. తండ్రి మరణంతో, ఇష్టం లేకపోయినా కంపెనీ వ్యవహారాలు చూసుకుంటూ ఉంటాడు. ఇక ఏబీ తన ప్రెవేట్ బెడ్ రూమ్ శృంగారాన్ని రికార్డ్ చేసి ,వీడియోగా తన ల్యాప్ టాప్ లో పెట్టుకుంటాడు .
భార్య ఎంతగా చెప్పిన అతను డిలీట్ చేయడు. రోజూ ఆఫీస్ కు వెళ్లి అక్కడ చూసుకుని మురిసిపోతూంటాడు. అయితే అతని జీవితంలో అదే పెద్ద సమస్యగా మారుతుందని ఊహించడు. ఒక రోజున హఠాత్తుగా ఏబీ జకారియా ఆఫీసుపై రైడ్ చేస్తారు ఇన్ కమ్ టాక్స్ ఆఫీసర్స్.
రైడ్ కు వచ్చిన వాళ్లు రొటీన్ గానే కంపెనిలో ఎక్కౌంట్స్ మొత్తం చెక్ చేస్తూ , పనిలో పనిగా వద్దని మొత్తుకుంటున్నా ఇన్ కమ్ టాక్స్ ఆఫీసర్ (సిద్దిఖి) ఎబీ టేబుల్ పై ఉన్న అతని పర్శనల్ ల్యాప్ టాప్ ని పట్టుకెళ్లిపోతాడు. ఈ విషయం ఎబీ బార్యకు తెలిసి కంగారుపడి, ఆ పై మండిపడుతుంది.
వేరే వాళ్లు తన పర్శనల్ లైఫ్ వీడియో చూసేస్తారని భయపడుతుంది. దాంతో తన భర్తపై విపరీతమైన ప్రెజర్ పెడుతుంది. ఆ వీడియో ఉన్న ల్యాప్ టాప్ తేకపోతే తనతో కటీఫ్ అంటుంది. దాంతో జకాయరా భయపడి ఎట్టి పరిస్దితుల్లోనూ దాన్ని రాత్రికి రాత్రే తేవాలని బయిలుదేరతాడు. అక్కడ నుంచి ఎబీ తిప్పలు మొదలవుతాయి. ఆ క్రమంలో ఇన్ కమ్ టాక్స్ ఆఫీసర్ నెంబర్ , ఎడ్రస్ తీసుకుని ఆ ప్లాట్ కు దొంగతనంగా వెళ్ళి ఎత్తుకొద్దామని గోడ దూకుతాడు.
ఎబి చేసిన అలికిడికి ఆ అపార్టమెంట్ లలో వాళ్లు దొంగ అనుకుని వెతకడం మొదలెడతారు. ఆ కంగారులో పారిపోయి వచ్చి రష్మిత రంజిత్ (గ్రేస్ ఆంటోనీ) అనే ఓ గృహిణి ప్లాట్‌లోకి దూరుతాడు. అయితే అప్పుడే ఆమె ఓ డిప్రెషన్ లో ఉండి మధ్యంలో పురుగుల మందు కలుపుకుని తాగటానికి రెడీ అయ్యి ప్రక్కకు వెళ్తుంది.
అయితే ఆ గదిలోకి వచ్చిన ఎబీ ఆ విషయం తెలియకుండా ఓ పెగ్గు వేస్తే ధైర్యం వస్తుందని గ్లాస్ ఎత్తి తాగేస్తాడు. అక్కడ నుంచి కథ మరో టర్న్ తీసుకుంటుంది. ఎబీకు ప్రాణాపాయం వస్తుంది. ఆ తర్వాత ఏమైంది? అసలు రష్మిత రంజిత్ కు పురుగుల మందు తాగాల్సిన పరిస్దితి ఏమొచ్చింది? ఈ కథలో మరో కీలకమైన పాత్ర డెంటిస్ట్ జయదేవన్ ఎవరు? ఆ వీడియో ఉన్న ల్యాప్ టాప్ ని తిరిగి తెచ్చుకోగలిగాడా వంటి విషయాలు చుట్టూ తిరుగుతుంది మిగతా కథ.
ఎలా ఉంది
దృశ్యం, నెరు, 12th మ్యాన్ వంటి సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్స్ ఇచ్చిన దర్శకుడు జీతూ జోసెఫ్ నుంచి ఇలాంటి కామెడీ సినిమా ఊహించం, కానీ 'నునాక్కుజి' (Nuna kkuzhi) తాను ఏ జానర్ అయినా డీల్ చేయగలనని ప్రూవ్ చేసారు. రెగ్యులర్ కామెడీ లా కాకుండా కొన్ని పాత్రలు, చిత్రమైన సిట్యువేషన్స్ క్రియేట్ చేసి ఆడుకున్నారు.
ఈ సినిమాలో కామెడీ ఎక్కువ శాతం పాత్రలు, వాటి బిహేవియర్స్ చుట్టూనే తిరుగుతుంది. చాలా టెన్స్ సిట్యువేషన్ లో అసలు ఏం జరుగుతుందో తెరపై అని ఆసక్తిగా చూస్తున్నప్పుడు ఓ జోక్ పేలుస్తాడీ డైరక్టర్. మిస్ అండర్ స్టాండింగ్ సిట్యువేషన్స్, ప్రాణాపాయంలో పడే పాత్రలే అన్నీ. టెన్షన్ పడుతూనే నవ్వుకునే చిత్రం ఇది.
అలాగని ఇదేమీ హీరో కథ కాదు. హీరోయిజం ఉన్న కథనం అసలే కాదు. క్రైమ్ సన్నివేశంలోకి కొన్ని పాత్రలను తోసి వాళ్ల నుంచి జనరేట్ అయ్యే భయాలు, వాళ్లు ఆడే అబద్దాలు, సమాజ పరిస్దితులు వంటివాటిని బాలెన్స్ చేసుకుంటూ అల్లిన డార్క్ కామెడీ ఇది. అన్ని పాత్రలను బాలెన్స్ చేయటం మామూలు విషయం కాదు.
ఈ సీరియస్ సబ్జెక్ట్ సెన్సార్ హ్యూమర్ తో ముడిపెట్టాలనుకోవటమే కలిసి వచ్చింది. అలాగే ఈ సినిమా మొత్తం ఓ రాత్రిలో జరుగుతుంది. జీతూ జోసెఫ్ ట్విస్ట్ లు కన్నా ఫన్ కే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. అలాగే కోర్ట్ సీన్స్ , అక్కడ వ్యవహారాలు, పోలీసుల ఇంట్రాగేషన్, హీరోల కథలపై జడ్జ్‌మెంట్, ఫ్యాన్స్ వంటివాటని కామెడీ చేసారు. మనకు తెలిసిన విషయాలకు కామెడీ రంగరించటంతో ఫన్ బాగానే పండింది.
ఇక ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే...ఫాస్ట్ పేసెడ్ ఎడిటింగ్ తో కొన్ని ప్యారలల్ ట్రాక్ లు ఒక చోట నుంచి మరో చోటకు మార్చుతూ కథను నడపటం. సీనియర్స్ ,జూనియర్స్ నుంచి కూడా అదే స్దాయి ఫన్ ఫెరఫార్మెన్స్ తీసుకున్నారు. ప్రతీ జోక్ నవ్వు అందరికీ రాకపోవచ్చు. కొన్ని జోక్స్ మాత్రమే బాగా నవ్విస్తాయి. కొన్ని థ్రిల్లర్ ఎలిమెంట్స్ కూడా అక్కడక్కడా వచ్చి పోతూంటాయి. కొన్ని సంభందం లేని ట్రాక్ లను ఇంటర్ లింక్ చేసిన తీరు ముచ్చటేస్తుంది.
మలయాళంలో కృష్ణకుమార్ రాసిన కథ ఇది. తెలుగు అనువాదం కూడా బాగా సెట్ అయింది. నటీనటులలో బసిల్ జోసెఫ్ అదరకొట్టాడు. రష్మిత రంజిత్ గా గ్రేస్ ఆంటోనీ, నిఖిలా విమల్, సిద్దీఖి తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారనే చెప్పాలి. సతీష్ కురుప్ సినిమాటోగ్రఫీ, వి.ఎస్ వినాయక్ ఎడిటింగ్ బాగుంది. విష్ణు శ్యామ్ మ్యూజిక్ జస్ట్ ఓకే. ప్రొడక్షన్ వాల్యూస్ కాస్త లోగానే ఉన్నాయని చెప్పాలి.
చూడచ్చా
ఫ్యామిలీతో కలిసి ఈ సినిమా చూడొచ్చు . అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ప్రారంభం నుంచి చివరివరకూ ఎక్కడా బోర్ అనిపించకుండా కథ పరిగెడుతుంది.
ఎక్కడుంది
జీ5 లో తెలుగులో ఉంది