
సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా `జైలర్ 2` చిత్రంలో హీరోగా నటించారు. దీనికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించగా ఇందులో రమ్యకృష్ణ ఆయనకు జోడీగా నటించింది. అలాగే ఎస్ జే సూర్య, విద్యాబాలన్, మిథున్ చక్రవర్తి, మిర్నా వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్, హృతిక్ రోషన్ గెస్ట్ రోల్స్ చేశారు. నిర్మాత కళానిధి మారన్ తన సన్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ మూవీ నేడు గురువారం (ఈ నెల 15న) విడుదలయ్యింది. మూడేళ్ల క్రితం వచ్చిన `జైలర్` మూవీ పెద్ద హిట్ కావడంతో ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వస్తున్న `జైలర్ 2`పై భారీ అంచనాలున్నాయి. భారీ కాస్టింగ్, భారీ అంచనాల మధ్య ఆడియెన్స్ ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆకట్టుకుందా? ముత్తువేల్ పాండియన్‌గా రజనీకాంత్ విశ్వరూపం చూపించారా? ట్విస్ట్ లు, సర్ప్రైజ్లు ఆకట్టుకున్నాయా అనేది రివ్యూలో తెలుసుకుందాం.
టైగర్ ముత్తువేల్ పాండియన్ (రజనీకాంత్) కొడుకుని మొదటి పార్ట్ లో చంపేసిన నేపథ్యంలో అతని జ్ఞాపకాల్లో వారి ఫ్యామిలీ బతుకుతుంటారు. ఇంకా ఆ బాధలోనే ఉంటారు. ఇంతలో స్మగ్లర్ వర్మని చంపింది ఎవరో కనిపెట్టమని మెయిన్ స్మగ్లర్ బోధి కల్పక్(ఎస్ జే సూర్య) తన అనుచరులకు ఆదేశిస్తాడు. ఆ పని దిలీప్(సూరజ్) మనుషులు డీల్ చేస్తుంటారు. ముత్తువేల్.. స్థానికంగా ఒక సూపర్‌మార్కెట్ లో పనిచేస్తుంటారు. కానీ మూర్తి(నమో నారాయణ) అనే చిన్నపాటి రౌడీ ద్వారా దిలీప్ని కలుస్తాడు. అతని ద్వారా కల్పక్ని వేసేయాలని ప్లాన్ చేస్తాడు ముత్తువేల్.
మొదటి పార్ట్ తో తన కొడుకు ఈ స్మగ్లింగ్ మాఫియాలో భాగమైన విషయం తెలిసిందే. పాత విగ్రహాల అక్రమ రవాణా వీరి వ్యాపారం. తనని చంపేస్తే, ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్లని తట్టుకోవడం కష్టమని ముత్తువేల్ కి చెప్పి మరణిస్తాడు ఆయన కొడుకు. దీంతో దీని వెనకాల ఉన్న వాళ్లని అంతం చేయడమే ముత్తువేల్ టార్గెట్. ఆ సమయంలోనే కల్పక్ కి చెందిన మూడు విగ్రహాల కంటైనర్లని ముత్తువేల్ స్వాధీనం చేసుకొని దాచి పెడతాడు. ఆ కంటైనర్లు ఇవ్వాలని బెదిరిస్తాడు బోధి కల్పక్. కానీ ముత్తువేల్ వినడు.
దీంతో తన ఫ్రెండ్ నరసింహ(శివరాజ్ కుమార్)పై ఎటాక్ చేసి వాళ్ల ఫ్యామిలీని కిడ్నాప్ చేస్తాడు. వాళ్ల కోసం కల్పక్ కోటకు వెళ్తాడు ముత్తువేల్. కానీ తమ కంటైనర్లు అప్పగిస్తేనే వారిని వదిలేస్తామని వార్నింగ్ ఇస్తారు. అది కల్పక్ నాన్న చక్రి కల్పక్(మిథున్ చక్రవర్తి)కి బర్త్ డే గిఫ్ట్ గా ఇవ్వాలని ఆయన కూతురు కాంత(విద్యాబాలన్) చెబుతుంది. ఆ కంటైనర్లతో వచ్చిన ముత్తువేల్.. తన రియాలిటీ ఏంటో చూపిస్తాడు. బాంబ్‌లతో బెదిరించి చక్రి కల్పక్ని తీసుకెళ్లిపోతాడు.
ఆ తర్వాత మంత్రి రాజీకుదిర్చి ఎవరిని వాళ్లకి అప్పగిస్తారు. అయినా తనని హింసించిన ముత్తువేల్ని వదిలేది లేదని పంతం పట్టుకుంటారు కల్పక్ ఫ్యామిలీ. మరి అందుకు ముత్తువేల్ని ఎలా ఇబ్బంది పెట్టారు. వారిని ముత్తువేల్ ఎలా ఎదుర్కొన్నాడు? సొంత కొడుకుని తానే చంపాననే నిజం తెలిశాక ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి? మళ్లీ మాథ్యూ(మోహన్‌లాల్), నరసింహ ఎలా ఎంట్రీ ఇచ్చారు? కొత్తగా రాడీ(హృతిక్ రోషన్) ఎందుకు రావాల్సి వచ్చింది? క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటి? అనేది మిగిలిన సినిమా.
మూడేళ్ల క్రితం వచ్చిన `జైలర్` మూవీకిది సీక్వెల్. అందులో రౌడీలకు దగ్గరై నేరాలకు పాల్పడుతున్న సొంత కొడుకునే చంపేస్తాడు రజనీకాంత్. ఆ సమయంలో మరణించిన విలన్ వర్మకి పైన ఉన్నవాళ్లు హీరో కోసం వెతుకుతుంటారు. ముత్తువేల్ని అంతం చేయాలని ప్లాన్ చేస్తుంటారు. హీరో స్వాధీనం చేసుకున్న కోట్ల విలువ చేసే విగ్రహాలను తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అందుకు హీరోని ఎలా ఇబ్బంది పెట్టారు? ఆ స్మగ్లింగ్ మాఫియా ఆటలను ముత్తువేల్ ఎలా ఆట కట్టించాడనేది సింపుల్‌గా ఈ మూవీ కథ. జైలర్ తరహాలోనే సినిమా సాగుతుంది.
ప్రారంభంలో సరదాగా, కామెడీగా వెళ్తుంది. అందుకు ఫ్రూట్ బిజినెస్ చేస్తూ చిన్నపాటి రౌడీయిజం చేసే మూర్తి పాత్ర చుట్టూ కామెడీ ట్రాక్‌ని అల్లుకొని సినిమాని నడిపించారు. ఆ పాత్రలోని ఫన్, దానికి యోగిబాబు తోడు కావడంతో బాగా వర్కౌట్ అయ్యింది. ఇందులో హీరో ఎవరికీ తెలియనట్టుగా సైలెంట్‌గా ఉంటూ, అవసరం వచ్చినప్పుడు తానేంటో చూపించడం, ఈ క్రమంలో వచ్చే యాక్షన్ సీన్లు వాహ్ అనిపిస్తాయి. మెయిన్‌గా రజనీకాంత్ ఎలివేషన్లు, యాక్షన్‌ని బేస్ చేసుకొని సినిమాని నడిపించారు. ఎలివేషన్లు, అదిరిపోయే యాక్షన్ సీన్లు పూనకాలు తెప్పిస్తాయి. అవి బాగా వర్కౌట్ అవుతాయి.
డ్రామా, కామెడీ, యాక్షన్, ఎలివేషన్లని పర్ఫెక్ట్ గా రాసుకొని మూవీని నడిపించారు. ఇంటర్వెల్ వరకు రేసీగా మూవీ సాగుతుంది. ఎక్కడా డౌన్ లేకుండా వెళ్తుంది. అయితే సెకండాఫ్‌కి కథని ఎస్టాబ్లిష్ చేసేలా నడుస్తుంది. ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం అదిరిపోయింది. యాక్షన్ సీన్లలోనూ ట్విస్ట్ లు వాహ్ ఫ్యాక్టర్ని ఇస్తాయి.
సెకండాఫ్‌లో ట్విస్ట్ లు, విలన్ బ్యాక్ డ్రాప్, వారి పవర్‌ని చూపించేలా వెళ్తుంది. తండ్రినే కొడుకుని చంపాడనే నిజం తెలియడంతో ఫ్యామిలీ రియాక్షన్ ఎమోషనల్‌గా ఉంటుంది. సెకండాఫ్‌ని ఎమోషనల్‌గా ప్లాన్ చేశారు. ఫ్యామిలీ డ్రామా చుట్టూ తిరుగుతుంది. దీంతో కొంత స్లో అవుతుంది. విలన్లకి సంబంధించిన బ్యాక్ డ్రాప్ ప్రారంభంలో వాహ్ అనిపించినా, ఆ తర్వాత తేలిపోయిన ఫీలింగ్ కలుగుతుంది.
హృతిక్ రోషన్ ఎంట్రీ బాగుంది, కానీ వాహ్ ఫీలింగ్ ఇవ్వలేదు. మాస్ ఆడియెన్స్ కి పూనకాలు తెప్పిస్తుంది. ఈ క్రమంలో హీరో, విలన్ల మధ్య టామ్ అండ్ జెర్రీ స్టయిల్ కనిపిస్తుంది. కథ ట్రాక్ తప్పినట్టుగా అనిపిస్తుంది. ఆ తర్వాత వరుసగా హీరోల ఎంట్రీ ఇవ్వడం, రజనీకాంత్ చేసే యాక్షన్ మైండ్ బ్లోయింగ్ అని చెప్పొచ్చు. క్లైమాక్స్ ని కూడా అదిరిపోయేలా ప్లాన్ చేశారు. కాకపోతే ఆశించిన స్థాయిలో లేదు. హృతిక్ పాత్రకి కన్‌క్లూజన్ మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. ఎండ్ ట్విస్ట్ వాహ్ అనిపిస్తుంది.
గెస్ట్ అప్పీయరెన్స్ లు ఇందులో అంతగా పేలలేదు. కొన్ని మైనస్‌లు పక్కన పెడితే మాస్ ఎలిమెంట్లు, కొంత ఫ్యామిలీ సెంటిమెంట్, కామెడీ డ్రామాని పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేసి సినిమాని నడిపించిన తీరు బాగుంది. ఓవరాల్‌గా మాస్ ఆడియెన్స్ కి, రజనీ అభిమానులకు మంచి ఫీస్ట్ లాంటి మూవీ అవుతుంది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రికార్డుల వేట పక్కా అని చెప్పొచ్చు.
ఎప్పటిలాగే ముత్తువేల్ పాండియన్‌గా రజనీకాంత్ నిలబడి పూనకాలు తెప్పించారు. విశ్వరూపం చూపించారు. యాక్షన్‌తో అదరగొట్టారు. ఎలివేషన్లలో ఆయన్ని చూస్తే విజిల్స్ వేయాల్సింది. సింపుల్‌గా అలా నిలబడి, నడుస్తూ, డైలాగ్స్ చెబుతూ సినిమాని నడిపించారు. తన అభిమానులకు ట్రీట్ ఇచ్చారు. ఆయన భార్యగా రమ్యకృష్ణ ఎప్పటిలాగే ఆకట్టుకుంది. కోడలిగా మిర్నా మెప్పించారు. ఇక విలన్ బోధి కల్పక్గా ఎస్ జే సూర్య ఇరగదీశాడు. అతని నటన అదిరిపోయింది. సినిమాకి ప్లస్‌గా నిలుస్తుంది. మూర్తిగా నటించిన నమో నారాయణ అదరగొట్టాడు. ఈ సినిమాతో ఆయన ఫేమస్ అయిపోతాడు.
యోగిబాబు కూడా ఆకట్టుకున్నారు. కాకపోతే ఆయన పాత్ర అంతగా పేలలేదు. స్మగ్లర్ దిలీప్‌గా సూరజ్ ఫస్టాఫ్‌లో దుమ్ములేపాడు. కాంతగా విద్యాబాలన్ మెప్పించింది. తనలోని మరో షేడ్‌ని చూడొచ్చు. చక్రి కల్పక్గా మిథున్ చక్రవర్తి ఉన్నంతసేపు మెప్పించారు. స్పెషల్ రోల్స్ లో శివరాజ్ కుమార్, మోహన్‌లాల్ అదరగొట్టారు. సినిమాకి ప్లస్ అయ్యారు. మరో ట్విస్ట్ అయిన హృతిక్ రోషన్ ఎంట్రీ అదిరిపోయింది. కాసేపు అలా మెరిసిపోయారు. మిగిలిన పాత్రధారులు ఓకే అనిపించారు. ఇందులో ప్రతి పాత్రకి ఇంపార్టెన్స్ ఉంది.
సినిమాకి బ్యాక్ బోన్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్. బీజీఎంతో సినిమాని నడిపించాడు. రజనీకాంత్ ఎలివేషన్లకి తగ్గట్టుగా అదిరిపోయే ఆర్ఆర్ అందించి సినిమాని నిలబెట్టాడు. అనిరుధ్ తప్ప ఈ మూవీకి ఎవరు ఆర్ఆర్ చేసినా అంతగా వర్కౌట్ కాదు. కాకపోతే సాంగ్స్ వర్కౌట్ కాలేదు. ఇక విజయ్ కార్తిక్ కన్నన్ విజువల్స్ అదిరిపోయాయి. ఫ్రేమ్స్ కొత్తగా ఉన్నాయి. ఆర్ నిర్మల్ ఎడిటింగ్ చాలా షార్ప్ గా ఉంది. ఆర్ట్ వర్క్ బాగుంది. నిర్మాణ విలువలకు కొదవలేదు. రిచ్‌గా, రాజీ లేకుండా నిర్మించారు. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ సినిమాని చాలా గ్రిప్పింగ్‌గా రాసుకున్నారు. పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశారు. రజనీకాంత్‌ని నిలబెట్టి సినిమాని నడిపించాడు. అంత బాగా రాసుకున్నారు.
ముఖ్యంగా మొదటి భాగాన్ని బాగా డీల్ చేశాడు. మూర్తి పాత్రతో ఫస్టాఫ్‌ని అల్లాడించాడు. కామెడీ, యాక్షన్‌ని పర్ఫెక్ట్ గా మిక్స్ చేసి మూవీని నడిపించాడు. సెకండాఫ్‌లో కొంత తడబాటు కనిపించినా, యాక్షన్‌తో, హీరోల ఎంట్రీతో బ్యాలెన్స్ చేశాడు. క్లైమాక్స్ కూడా బాగుంది. కాకపోతే సెకండాఫ్‌ని ఇంకా బాగా డీల్ చేయాల్సింది. హృతిక్ పాత్రని ఇంకా బాగా సెట్ చేయాల్సింది. ఇలాంటి చిన్న చిన్న మైనస్‌లు తప్పితే మూవీని మాత్రం ఈ పండక్కి బాక్సాఫీసుకి పూనకాలు తెప్పించే చిత్రవుతుందని చెప్పొచ్చు. ఇంత యాక్షన్ మూవీ అయినా ఇందులో ఫ్యామిలీ డ్రామానే మెయిన్. అది ఫ్యామిలీ ఆడియెన్స్ కి కనెక్ట్ చేస్తుందని చెప్పొచ్చు.
ప్లస్ లు
రజనీకాంత్,
కామెడీ
యాక్షన్, ఎలివేషన్లు
ఫస్టాఫ్
ఎస్ జే సూర్య
మైనస్ లు
అనిరుధ్ బీజీఎం
సెకండాఫ్
గెస్ట్ రోల్స్ పెద్దగా వర్కౌల్ కాలేదు
ఎమోషనల్స్ అంతగా పండలేదు
జైలర్ కి పర్ఫెక్ట్ సీక్వెల్. కమర్షియల్ సినిమాకి కావాల్సిన అన్ని హంగులు అద్ది, మాస్ ఆడియెన్స్ కావాల్సిన అన్ని అంశాలు మేళవించి రూపొందించిన చిత్రమిది. కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, ట్విస్ట్ లతో అల్లడించే మూవీ అవుతుంది. బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే.
రేటింగ్: 3