
కొత్త జంట ఆన్ష్, వాసవి గణేషన్ జంటగా నటించిన మూవీ `షుషార్ పిట్టలు`. బిక్షు దర్శకత్వంలో పద్మ అమ్మ, బీవీజీ స్టూడియోస్ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్ పతాకంపై వెంకట్ యాదవ్ నిర్మాణంలో ఈ చిత్రం రూపొందింది. ఏసియన్ సురేష్ ఫిల్మ్స్ సంస్థలు విడుదల చేశాయి. ఈ మూవీ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్ట్ 15న విడుదల కాబోతుంది. ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.
మాసినపల్లి రవి(అన్ష్) చదువుల్లో ఫస్ట్ ఉంటాడు. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లోనూ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటాడు. పుట్ట చిట్టి(వాసవి గణేషన్) చదువుల్లో బాగా వీక్, 9వ తరగతి చదువుకుంటుంది. వాళ్ల నాన్న ఆమెని గారాబం చేస్తాడు. ఏ పని చెప్పకుండా బాగా చదవాలని చెబుతుంటాడు. ఆమెని డాక్టర్‌నో, కలెక్టర్ నో చేయాలనుకుంటాడు. అంతలోనే చిట్టి పెద్దమనిషి అవుతుంది. పెద్ద మనిషి అయ్యాక అబ్బాయిలను చూస్తే ఎట్రాక్షన్ కలుగుతుందని నమ్ముతుంది చిట్టి. అయితే పేపర్‌లో మాసినపల్లి రవి ఫస్ట్ ర్యాంక్ రావడం చూసి ఆయన్ని ఇష్టపడుతుంది. మరోవైపు బయటి ప్రపంచం అంటే ఏంటో తెలియని మాసినపల్లి రవిని ఊర్లో ఉండే సీనియర్లు బ్లూ ఫిల్మ్ లు చూపించి చెడగొడతారు. ఆ సమయంలోనే చిట్టి తనని చూసి నవ్వుతుంది. సైగల్ చేస్తుంది. రవి కూడా ఆమెకి రియాక్ట్ అవుతాడు. ఇద్దరు ఎట్రాక్ట్ అవుతారు. తమ ప్రేమని వ్యక్తం చేసుకుంటారు. రవి సిగ్గుపడుతుంటే, చిట్టి మాత్రం రెచ్చిపోతుంది. వాళ్లు, వీళ్లు చెప్పారంటూ అలాంటి పనుల గురించి మాట్లాడుతుంది. అతన్ని రెచ్చగొడుతుంది. మొత్తంగా ఫిజికల్‌గానూ కలుస్తారు. ఇద్దరు పేరెంట్స్ ని మాయ చేసి రెగ్యూలర్‌గా కలుస్తుంటారు. ఈ విషయాన్ని చిట్టి తాత కనిపెడతాడు. అలాగే రవి సీనియర్లకి కూడా తెలుస్తుంది. వాళ్లు ముందుగానే వార్నింగ్ ఇస్తారు. అయినా మనోడు తగ్గడు, దీంతో రెడ్ హ్యాండెడ్‌గా పేరెంట్స్ కి పట్టిస్తాడు చిట్టి తాత. మరి వీరి బాగోతాన్ని చూసిన పేరెంట్స్ రియాక్షన్ ఏంటి? ప్రేమ కోసం రవి, చిట్టి ఎంతపనికి తెగించారు? ఆ తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు. ఫైనల్‌గా ఏం తెలుసుకున్నారు? వారిలో వచ్చిన మార్పేంటి? అనేది మిగిలిన కథ.
`హుషార్ పిట్టలు` మూవీ ప్రతి ఒక్కడి జీవితంలోని టీనేజ్ బయోపిక్ అని చెప్పొచ్చు. అయితే ఒకప్పుడు చూపులు, నవ్వులు, మహా అయితే మాటలకే పరిమితం ఉండేది, కొందరు మాత్రమే బార్డర్స్ బ్రేక్ చేసేవారు. కానీ ఇటీవల కాలంలో మాత్రం చాలా ఫాస్ట్ గా ఉంటున్నారు. హైస్కూల్ స్టేజ్‌లోనే అన్ని విషయాలు తెలుస్తున్నాయి. అన్నీ అయిపోతున్నాయి. ఆ ఎట్రాక్షన్, వ్యామోహంలో పడి చదువుని పక్కన పెడుతున్నారు. పేరెంట్స్ ని మోసం చేసి అలాంటి పనులకు తెగిస్తున్నారు. ఊర్ల నుంచి సీటీ వరకు ఇలాంటి కల్చర్ కనిపిస్తుంది. ఏరియాని బట్టి స్టయిల్ మారుతుంది, కానీ ఎక్కడైనా జరిగేది ఒక్కటే. అదే ఈ సినిమాలో చూపించారు. కాకపోతే ఇందులో చాలా బోల్డ్ గా చూపించాడు దర్శకుడు బిక్షు. ఇంకా చెప్పాలంటే పచ్చిగా చూపించాడు. సీన్ల పరంగా పద్ధతి పాటించారు, కానీ డైలాగ్‌లతోనే అన్ని పనులను కళ్లకి కట్టినట్టు చూపించాడు. డబుల్ మీనింగ్ డైలాగ్‌లతో రచ్చ చేశాడు. ఆ డైలాగ్‌లు మరీ పచ్చిగా పెట్టడం గమనార్హం. అయితే టీనేజ్‌లో అమ్మాయి, అబ్బాయి రియాక్ట్ అయిన తీరు, బ్లూ ఫిల్మ్ లు చూడటం వంటి సీన్లని బోల్డ్ గా పెట్టారు. పోరగాళ్లు ఎలా చెడిపోతున్నారనేది ప్రత్యక్షంగా కళ్లకి కట్టినట్టు చూపించారు. మరోవైపు పేరెంట్స్ ఏమో తమ పిల్లలు చదువుకుంటున్నారనే భ్రమల్లో ఉంటారు, కానీ పిల్లలు మాత్రం చదువుకుంటున్నామని, ఆన్ లైన్ క్లాస్‌లు అని, కంబైన్డ్ స్టడీ అని చెప్పి అమ్మాయిలు, అబ్బాయిలతో కలిసి తిరుగుతుంటారు. వేరే కంబైన్డ్ స్టడీస్ చేస్తున్నారని ఇందులో రియాలిటీకి దగ్గరగా చూపించడం విశేషం. సమాజంలో జరిగే తప్పులన్నింటినీ బోల్డ్ గా చూపించారు. అవి చూస్తుంటే రియల్ లైఫ్ కనిపిస్తుంటుంది. అదే సమయంలో ఆయా సీన్లు యమ క్రేజీగా ఉంటాయి. మ్యూజిక్, ఆర్‌ఆర్‌లతో సహా హింట్ ఇస్తూ చూపించిన తీరు థియేటర్లో అరుపులతో హోరెత్తించేలా చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ వరకు ఎట్రాక్షన్ చూపించారు, సెకండాఫ్‌లో వరుసగా అదే పని అనేలా చూపించారు. ఆ తర్వాత ఎమోషనల్ సైడ్ ఆవిష్కరించారు. టీనేజ్‌లో, అమ్మాయిలు, అబ్బాయిల మధ్య ఉండే ఎట్రాక్షన్ కారణంగా తప్పులు చేయడం, ఆ తర్వాత కెరీర్‌ని పోగొట్టుకోవడం, జీవితాలే పోగొట్టుకొనే పరిస్థితులను ఎదురవుతాయని చెప్పడం బాగుంది. క్లైమాక్స్ ఎమోషనల్‌గా ఉంది.
అయితే కుర్రాళ్లకి, టీనేజర్లకి, కాలేజీ స్టూడెంట్స్ కి నచ్చేలా, వారిని ఎట్రాక్ట్ చేసేలా చాలా వరకు సీన్లు ఉంటాయి. డబుల్ మీనింగ్ డైలాగ్‌లను, లవ్ సీన్లని రియాలిటీకి దగ్గరగా చూపించడంతో కుర్రాళ్లకి అవి బాగా కనెక్ట్ అవుతాయి. దీనికితోడు మ్యూజిక్ బాగుంది. ఆర్‌ఆర్ అదిరిపోయింది. విజువల్స్ పరంగా బాగుంది. అలాగే మంచి సందేశాన్ని అందించారు. పేరెంట్స్ చేసే తప్పులు, పిల్లలు చేసే తప్పులను రియాలిటీగా చూపించడం విశేషం. పిల్లల విషయంలో పేరెంట్స్ కేర్ తీసుకోవాలని, అదే సమయంలో పిల్లల ముందు పేరెంట్స్ కూడా కొన్ని పనులు చేయకూడదని చెప్పిన తీరు బాగుంది. అవి కనువిప్పుగా ఉన్నాయి. ఊర్లో ఉండే కొందరు పోరగాళ్లు ఎలా చెడగొడతారనేది బాగా చూపించారు.
కానీ డబుల్ మీనింగ్ డైలాగ్‌లు మరీ పచ్చిగా ఉన్నాయి. బోల్డ్ గా ఉన్నాయి. కొన్ని సీన్లు కూడా అభ్యంతరకరంగా ఉన్నాయి. ఇలా చేస్తున్నారని చూపించి, ఇలా చేయోద్దని చెప్పడం కన్విన్సింగ్‌గా లేదు. ఎమోషనల్ సీన్లు కూడా బలంగా లేవు. తప్పులు చేశాక జరిగిన నష్టాలను, ఆ పెయిన్‌ని బలంగా చూపించలేదు. కొంత బోల్డ్ నెస్‌ని, డబుల్ మీనింగ్ డైలాగ్‌ల డోస్‌ని తగ్గించాల్సింది. ఈ మూవీ కేవలం కుర్రాళ్లకి మాత్రమే అనేలా ఉంటుంది. ఫ్యామిలీ ఆడియెన్స్ దీన్ని చూడలేరు. చూసినా వాళ్లు ఒంటరిగానే చూడాల్సి ఉంటుంది. ఇది చిత్రం, బస్టాప్, ఈ రోజుల్లో వంటి చిత్రాలను గుర్తు చేస్తుంది.
మాసినపల్లి రవి పాత్రలో అన్ష్ కుర్రాడు బాగా చేశాడు. ఇరగదీశాడు. కొత్త అబ్బాయి అయినా పర్‌ఫెక్ట్ సూట్ అయ్యాడు, అంతే రియాలిటీగా నటించి మెప్పించాడు. మరోవైపు చిట్టిగా వాసవి గణేషన్ అమ్మాయి కూడా యాప్ట్ గా నిలిచింది. అంతే ఎనర్జిటిక్‌గా నటించి మెప్పించింది. ఈ సినిమాకి ఈ అమ్మాయి పాత్రనే హైలైట్‌గా నిలుస్తుందని చెప్పొచ్చు. అమ్మాయి తండ్రిగా గోవర్థన్ రెడ్డి చాలా బాగా నటించాడు. పాత్రలో ఒదిగిపోయాడు. చాలా రోజుల తర్వాత ఆయనకు పేరు తెచ్చే పాత్ర పడిందని చెప్పొచ్చు. అదే సమయంలో అబ్బాయి నాన్న కూడా బాగా చేశాడు. అతనికిది బ్రేక్‌నిచ్చే పాత్ర అవుతుంది. అమ్మగా చేసిన నటి కూడా రెచ్చిపోయి నటించింది. అబ్బాయి తమ్ముడు, అమ్మాయి అక్క, అన్న పాత్రలు చేసిన నటులు సైతం బాగా చేశారు. ఇలా సినిమాలో ప్రతి పాత్రకి ప్రయారిటీ ఉంటుంది. ప్రతిదీ హైలైట్ అవుతుంది.
చరణ్ అర్జున్ అదిరిపోయే మ్యూజిక్ అందించాడు. ఆయన పాటలు బాగున్నాయి. టీనేజర్లని బాగా ఆకట్టుకుంటాయి. ఆర్‌ఆర్ మాత్రం ఇరగదీశాడు. కొన్ని సౌండ్స్ కి స్పెషల్‌గా అభిమానులు ఏర్పడతారని చెప్పొచ్చు. చరణ్ అర్జున్‌కిది మంచి లైఫ్ ఇచ్చే మూవీ అవుతుంది. ఇక విజువల్స్ గా మూవీ గ్రాండియర్‌గా ఉంది. ఎక్కడా చిన్న సినిమా అనే ఫీలింగ్ తీసుకురాలేదు. ఎడిటింగ్ పరంగానూ బాగున్నాయి. కొన్ని సీన్లు కట్ చేసి ఉంటే బాగుండేది. బట్ డీసెంట్‌గానే ఉందని చెప్పొచ్చు. నిర్మాణ విలువలకు కొదవ లేదు. దర్శకుడు బిక్షు టీనేజ్ కుర్రాళ్ల జీవితాన్ని తెరపై ఆవిష్కరించారు. చేయాల్సిందంతా చేయించి, ఇలా చేయడం తప్పు అని చెప్పడం క్రేజీగా ఉంది. అదే విమర్శలకు తావిస్తుంది. కానీ దర్శకుడిగా తన టేకింగ్ బాగుంది. రియాలిటీకి దగ్గరగా ఆయా సీన్లు పెట్టడం బాగుంది. అవి బాగా ఆకట్టుకుంటాయి. డైలాగ్స్ మాత్రం మతిపోయేలా ఉన్నాయి. ఆయన ఇచ్చిన సందేశం కూడా బాగుంది. ఫ్యామిలీ అంతా కలిసి చూడలేని సినిమా కానీ, పేరెంట్స్, పిల్లలు విడిగా చూడాల్సిన మూవీ అని చెప్పొచ్చు.
కుర్రాళ్లు పండగ చేసుకునే మూవీ. అదే సమయంలో బోల్డ్ గా, పచ్చిగా ఉన్నా, అంతిమంగా ఆలోచింప చేసే మూవీ. సందేశం బాగుంది.
రేటింగ్ : 2.75