
ఆ కాలంలో నవలల ఆధారంగా ఎక్కువగా సినిమాలు తెరకెక్కించేవారు. నవలా హాక్కులు సాధించి.. వాటిని సినిమా కథలకు సరిపోయేలా మార్చి.. వెండితెరపై పండించేవారు. అలా రూపొందించిన సినిమాలలో డాక్టర్ చక్రవర్తి కూడా ఒకటి. కోడూరి కౌసల్యాదేవి రచించిన "చక్రభ్రమణం" నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అక్కినేని నాగేశ్వారావు, జగ్గయ్య, సావిత్రి, కృష్ణ కుమారి, షావుకారు జానకి, గీతాంజలి, సూర్యకాంతం, గుమ్మడి లాంటి స్టార్స్ నటించి మెప్పించిన ఈసినిమాను ఆదుర్తి సుబ్బారావు డైరెక్ట్ చేశారు. 1964లో డాక్టర్ చక్రవర్తి సినిమా విడుదల అయ్యింది.
డాక్టర్ చక్రవర్తి (అక్కినేని నాగేశ్వరరావు), డాక్టర్ శ్రీదేవి (కృష్ణకుమారి) గతంలో ప్రేమించుకుంటారు, పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. కానీ చక్రవర్తి చెల్లెలు అయిన సుధ (గీతాంజలి) క్యాన్సర్ వ్యాధి వల్ల మరణిస్తూ.. నిర్మల (షావుకారు జానకి) ను పెళ్ళిచేసుకోవలసిందిగా అన్న దగ్గర మాట తీసుకుంటుంది. చెల్లెలు చివరి కోరికను మన్నించిన చక్రవర్తి నిర్మలను పెళ్ళి చేసుకుంటాడు.
చక్రవర్తికి ఆప్తమిత్రుడు రవీంద్ర (జగ్గయ్య). అతని భార్య మాధవి (సావిత్రి) రచయిత్రి. వారిద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. కలిసి మెలిసి జీవిస్తుంటారు. వీరి అనుకూల దాంపత్యంలో సూర్యకాంతం పాత్ర ఎలాగైనా గొడవలు పెట్టాలని ప్రయత్నిస్తుంటుంది. ఈక్రమంలో మరణించిన తన చెల్లెలు సుధను మాధవిలో చూసుకుంటాడు చక్రవర్తి. ఈ విషయాన్ని చిలవలు పలవలు చేసి.. ఉన్నవి లేనివి అన్నీ కల్పించి.. సుర్యకాంతం వారి కాపురాల్లో చిచ్చు పెడుతుంది.
చక్రవర్తి, మాధవిలపై లేనిపోని అనుమానాలు రగిలిస్తుంది. ఫలితంగా రవీంద్ర తన మిత్రుడు చక్రవర్తిని అనుమానించి అవమానిస్తాడు. మాధవి కూడా ఎన్నో ఇబ్బందులు పడుతుంది. అప్పటికే గర్భవతిగా ఉన్న మాధవి.. డాక్టర్ శ్రీదేవి, చక్రవర్తిల సహాయంతో పండంటి బిడ్డకు జన్మనిస్తుంది. చివరకు రవీంద్ర నిజం తెలుసుకుంటాడా? మాధవిని ఏలుకుంటాడా లేదా అనేది సినిమా క్లైమాక్స్.
ఈ సినిమాకు గొప్ప గొప్ప వాళ్లు పనిచేశారు. అప్పట్లో ఎక్కువగా ప్రజాదరణ పొందిన కోడూరి కౌసల్యాదేవి నవల చక్రభ్రమణం ఆధారంగా సినిమా తీయాలని అక్కినేని భావించారు. ఈక్రమంలో ఆ నవల హక్కులను అన్నపూర్ణ వారు కొన్నారు. గతంలో విశ్వనాథ్ కు ఇచ్చిన మాట ప్రకారం.. ఈసినిమాతో ఆయన్ను దర్శకుడిగా పరిచయం చేయాలి అనుకున్నారు అక్కినేని. కానీ తనకు ఇంకా ఆ స్థాయి రాలేదని కే విశ్వనాథ్ తప్పుకోవడంతో.. డాక్టర్ చక్రవర్తికి దర్శకత్వ బాధ్యతలు ఆదుర్తి సుబ్బారావుకే వచ్చింది.
చక్రభ్రమణం నవలను సినిమాకు అనుగుణంగా మలిచి, స్క్రిప్ట్ ని గొల్లపూడి మారుతీరావు, రావూరి వెంకట సత్యనారాయణరావు తయారుచేశారు. గొల్లపూడి మారుతీరావు ఈసినిమాతోనే మొదటి సారి సినిమా రంగంలోకి అడుగు పెట్టారు. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించిన అన్నపూర్ణ వారి మూడు సినిమాలకు వరుసగా అసోసియేట్ గా పనిచేశారు విశ్వనాథ్. సినిమాకు కూడా విశ్వనాథ్ పనిచేశారు.
ఈ సినిమా ద్వారా.. నవల చదివితే ఎంత ఫీల్ ఉంటుందో.. అంతకు మించి ఫీల్ ను అందించారు. సావిత్రి ఎప్పుడూ.. ఏఎన్నార్, ఎన్టీఆర్ జంటగా మాత్రమే కనిపించేవారు. ఈసినిమాలో సావిత్రిని చెల్లులుగా భావించడం.. ఆడియన్స్ కు వింత అనుభవమే అయ్యింది.
ఈమూవీలో సావిత్రి అసలు అన్నగా గుమ్మడి నటించగా.. మరణించిన తన చెల్లెలిని.. సావిత్రిలో చూసుకునే పాత్రలో అక్కినేని అభినయం అద్భుతం. ప్రేమ విఫలం అయ్యి, చెల్లెలు మరణించి, స్నేహితుడితో మాటలు పడుతూ.. హీరో పాత్ర పడే స్ట్రగుల్ ప్రేక్షకుల మనసుని కరిగిస్తుంది.
మరో వైపు సావిత్రి పడుతున్న కష్టాలు కంటతడి పెట్టిస్తాయి. అయినా తన కాపురం గురించి, భర్త పరువు గురించి ఆలోచించే ఇల్లాలుగా సావిత్రి కనబరచిన అభినయం సినిమాకు ప్రధానాకర్షణగా నిలచింది. గుమ్మడి పాత్ర నిడివి ఇందులో చాలా తక్కువే అయినా కనిపించిన కొన్ని సీన్స్ లోనూ తనదైన బాణీ పలికించారు.
కథను మలుపులు తిరగడానికి సూర్యకాంతం విలనిజం ప్రధాన పాత్ర పోషించింది. ఆమె నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కృష్ణ కుమారి, షావుకారు జానకి, గీతాంజలి తమ పాత్రల పరిది మేరకు నటించి మెప్పించారు.
డాక్టర్ చక్రవర్తి సినిమాల పాటలు చాలాప్రత్యేకం. ఈ సినిమా పాటలు ఇప్పటికీ శ్రోతలు మర్చిపోలేరు.. మోలోడీ మాల అల్లినట్టుగా.. సాలూరి వారి గీతాలు.. చెవులకు ఇంపుగా వినిపిస్తుంటాయి. మరీ ముఖ్యంగా ... ఈ మౌనం ఈ బిడియం ఇదేనా ఇదేనా చెలియ కానుకా, నీవు లేక వీణ పలుకలేనన్నది నీవు రాక రాధ నిలువలేనన్నది, పాడమని నన్నడగవలెనా పరవశించి పాడనా, మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము వంటి పాటలు దశాబ్దాలుగా సినిమా సంగీత ప్రియులను అలరించాయి. ఈసినిమా విజయంలో పాటల పాత్ర ప్రత్యేకం.
డాక్టర్ చక్రవర్తి సినిమా మొదటి సారి నంది అవార్డు అందుకున్న సినిమాగా ఘనత సాధించింది. ఈ సినిమా టైమ్ లోనే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ అవార్డులను ప్రవేశ పెట్టింది. ఇక ఈ సినిమాతో మొదటిసారి అక్కినేని నాగేశ్వరరావు ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా సాధించడం విశేషం. ఈ సినిమాకు నంది అవార్డు ద్వార వచ్చిన 50,000 రూపాయల పెట్టుబడితో అక్కినేని-ఆదుర్తి 'చక్రవర్తి చిత్ర' పతాకంపై సుడిగుండాలు, మరో ప్రపంచం అనే ప్రయోజనాత్మక చిత్రాల్ని నిర్మించారు. ఇలా డాక్టర చక్రవర్తి సినిమా చేసిన అద్భుతాలెన్నో. ఈ మూవీ చూడాలి అనుకునేవారికి యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.