
సముద్రఖని ఓ వైపు పెద్ద సినిమాల్లో క్యారెక్టర్స్ తో మెప్పిస్తూనే, మరోవైపు తనే మెయిన్ లీడ్‌గా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఆయన `కార్మేని సెల్వం` అనే చిత్రంలో నటించారు. లక్ష్మీ ప్రియా ఆయనకు జోడీగా చేసింది. గౌతమ్ మీనన్, అభినయ కీలక పాత్రలు పోషించారు. పాత్ వే ప్రొడక్షన్స్ పతాకంపై అరుణ్ రంగరాజులు నిర్మించిన ఈ చిత్రానికి రామ్ చక్రి దర్శకత్వం వహించారు. ఈ మూవీ తమిళంతోపాటు తెలుగులో నేడు శుక్రవారం(ఏప్రిల్ 3)న విడుదలైంది. మరి ఇందులో సముద్రఖని అప్పుల విషయంలో చెప్పిన జీవిత పాఠం ఏంటి? సినిమా ఎలా ఉందనేది చూద్దాం.
సెల్వం(సముద్రఖని).. బిజినెస్ మ్యాన్ సంపత్ సార్(గౌతమ్ మీనన్) వద్ద కార్ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. ఆయన భార్య శాంతి(లక్ష్మీ ప్రియా) టిఫిన్ సెంటర్ నడిపిస్తుంటుంది. వీరికి కొడుకు బాలు ఉంటాడు. చిన్న ఫ్యామిలీ అయినా పెద్ద ఆశలతో బతుకుతుంది. సొంతంగా కారు కొనాలి, ఇళ్లు కట్టుకోవాలి, అందరిలో గొప్పగా ఉండాలి అని భార్య ఎంతో ఆశపడుతుంది. అందుకోసం రోజువారి సంపాదనలో కొంత దాచిపెడుతుంది. అయితే సంపత్, తన భార్య దేవి(అభినయ)తో కలిసి టూర్ వెళ్తారు. దీంతో ఆ కారుని టాక్సీగా మార్చి డబ్బులు సంపాదించాలని ప్లాన్ చేస్తాడు సెల్వం. క్యాబ్ నడిపిస్తాడు. ఈ క్రమంలో చాలా మంది కస్టమర్లు కలుస్తారు. రకారకాల డబ్బులు సంపాదించే ఐడియాలు చెబుతారు. అప్పులు చేసి, డబ్బులు సంపాదించాలని, క్రికెడ్ కార్డ్ వాడకం, ప్లాట్ కొనాలని, ఆన్‌లైన్ షాపింగ్, బెట్టింగ్ ఇలా రకరకాలుగా అలవాటు అవుతాయి, లగ్జరీగా లైఫ్‌ని లీడ్ చేసే క్రమంలో బాగా అప్పులు చేస్తాడు సెల్వం. ఇంట్లో భార్యకి టైమ్ ఇవ్వలేడు, దీంతో ఆమె గొడవ చేస్తుంది. అప్పులు చేయడం వల్ల చికాకులు ఎక్కువవుతాయి. అదే సమయంలో కారు యాక్సిడెంట్ అవుతుంది? ఆ తర్వాత సెల్వంలో వచ్చిన మార్పేంటి? ఆయన షార్జాకి ఎందుకు వెళ్లాడు? అక్కడ సెల్వం ఏం కోల్పోయాడు? ఆయన చేసిన తప్పేంటి? సంపత్ సార్ ఇచ్చిన సర్ ప్రైజ్ ఏంటి? సెల్వం జీవితం చెప్పిన సందేశం ఏంటనేది మిగిలిన సినిమా.
మిడిల్ క్లాస్ జీవితాన్ని ఆవిష్కరించిన మూవీ ఇది. పక్క వాళ్లు కార్లు, బంగ్లాలు, హడావుడి, హంగామాని చూసి మనం కూడా అలా అయిపోవాలని, అలా బతకాలని అప్పులు చేస్తాం. తీరా అవి తీర్చలేని భారంగా మారడంతో జీవితం రోడ్డు మీదకు వస్తుందని చెప్పే చిత్రమిది. బిజీ లైఫ్‌లో ఫ్యామిలీకి టైమ్‌ని కేటాయించాలని చెప్పే చిత్రమిది. మన స్థోమత మేరకు బతకాలని కళ్లకి కట్టినట్టు చూపించారు. ఆద్యంతం ఎమోషనల్ డ్రామా అని చెప్పొచ్చు. సినిమా స్లోగా ప్రారంభమైనా, డ్రామా ప్రధానంగా సాగుతుంది. ఆ తర్వాత ఎమోషనల్ సైడ్ తీసుకుంటుంది. గుండెని బరువెక్కిస్తుంది. మంచి సందేశాన్ని అందించి ఊరటనిస్తుంది. ఇక మూవీగా చూసినప్పుడు సముద్రఖని.. గౌతమ్ మీనన్ వద్ద డ్రైవర్‌గా చేయడం, వారి మధ్య ఉన్న అనుబంధాన్ని ఆవిష్కరించారు. అలాగే సముద్రఖని ఫ్యామిలీ ద్వారా మిడిల్ క్లాస్ ఇన్నోసెంట్ మెంటాల్టీని ఆవిష్కరించారు. పరువు, మర్యాదల కోసం మధ్యతరగతి వాళ్లు ఏం చేస్తారనేది ఇందులో కళ్లకి కట్టినట్టు చూపించారు. బంధువుల ఫంక్షన్లలో పట్టింపులు, అవమానాలను ఆవిష్కరించారు. మంచి జీవితం కోసం, కారు, ఇళ్లు కోసం దాచుకున్న డబ్బుని బంధువుల్లో మర్యాదల కోసం ఖర్చు చేయడం వంటివి మధ్యతరగతి కుటుంబాల పరిస్థితులను ప్రతిబింబిస్తాయి. మొబైల్ వచ్చాక లగ్జరీ అలవాట్లు, బయట డబ్బుల కోసం చాలా మంది ఉచిత సలహాలు విని, వాటిని పాటించడం వల్ల ఎదురయ్యే నష్టాలను ఈ చిత్రంలో చూపించారు. అనవసరమైన వాటికోసం పాకులాడితే, అవసరమైనవి కోల్పోవాల్సి వస్తుందని చెప్పిన డైలాగ్ బాగుంది. సెకండాఫ్‌లో లైఫ్‌ని ప్రాక్టికల్‌గా చూపించే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఫ్యామిలీ మధ్య ఉండే బాండింగ్, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని ఫోన్లు పూడ్చలేవని, దగ్గరుంటేనే ఆ అనుభూతిని పొందగలం అని, అందరు కలిసి ఉంటే చిన్న ఉద్యోగమైనా, తక్కువ సంపాదన ఉన్నా హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేయోచ్చనేది బాగుంది. సినిమా సెకండాఫ్ ఆద్యంతం ఎమోషనల్‌గా సాగుతుంది. క్లైమాక్స్ హార్ట్ టచ్చింగ్‌గా ఉంటుంది. అయితే మూవీ స్లోగా సాగడం మైనస్‌గా చెప్పొచ్చు. ప్రతిదీ డీటెయిలింగ్‌గా చూపించే ప్రయత్నం కొంత సాగదీసినట్టుగా ఉంటుంది. ఇలాంటి కొన్ని సీన్లని కట్ చేస్తే మూవీ మంచి ఎమోషనల్ రైడ్‌లా ఉండేది.
కార్వేని సెల్వంలో సముద్రఖని నటన అదిరిపోయింది. ఆయన మిడిల్ క్లాస్ వ్యక్తి పాత్రలో జీవించాడు. క్యాబ్‌డ్రైవర్‌గా ఆయన జీవితం చాలా మంది రియల్ లైఫ్‌లను ఆవిష్కరిస్తుంది. అద్భుతమైన నటనతో, అంతే అద్భుతమైన ఎమోషన్స్ తో మెప్పించాడు. కట్టిపడేశాడు. భార్య కోరికల విషయంలో సాటిస్పై చేయలేక, డబ్బు సంపాదించలేక తను పడే సంఘర్షణ మెప్పిస్తుంది. ఇక ఆయన భార్య శాంతి పాత్రలో లక్ష్మీ ప్రియా ఒదిగిపోయింది. ఆమె పాత్ర హైలెట్గా నిలుస్తుంది. ఎక్కడా నటిస్తున్నట్టు లేదు, పాత్రలో జీవించింది. అలాగే సంపత్ సార్ పాత్రలో గౌతమ్ మేనన్ కాసేపు మెరిశారు. ఆయన పాత్ర సర్‌ప్రైజ్‌లా ఉంటుంది. ఆయన భార్యగా అభినయ ఉన్నంతసేపు మెప్పించింది. సముద్రఖని కొడుకుగా చేసిన కుర్రాడు చాలా బాగా నటించి మెప్పించాడు.
టెక్నికల్‌గా సినిమా చాలా బాగుంది. కథలో భాగంగా పాటలు ఉంటాయి. కథని ముందుకు నడిపించేలా ఉంటాయి. అలాగే బీజీఎం ఎమోషనల్ సీన్లని బాగా ఎలివేట్ చేసింది. విజువల్ పరంగాను ఆకట్టుకునే లాగా ఉంది. ఎడిటింగ్ పరమైన కొన్ని లోపాలు ఉన్నాయి. ఇంకా కొంచెం ట్రిమ్ చేయాల్సింది. నిర్మాణ విలువలకు కొదవలేదు. దర్శకుడు ఎంచుకున్న కథ బాగుంది. మధ్యతరగతి జీవితాన్ని చాలా బాగా ఆవిష్కరించారు. అయితే దాన్ని మరింత ఎంగేజింగ్‌గా, షార్ప్ గా చెబితే బాగుండేది. మిడిల్ క్లాస్ ఆడియెన్స్ కి బాగా నచ్చే మూవీ అవుతుంది.
మిడిల్ క్లాస్ లైఫ్‌ని ఆవిష్కరించే ఎమోషనల్ రైడ్ `కార్మేని సెల్వం`. మధ్యతరగతి వాళ్లు తప్పక చూడాల్సిన మూవీ.
రేటింగ్ 2.75