అల్లు శిరీష్‌ `బడ్డీ` మూవీ రివ్యూ, రేటింగ్‌

First Published | Aug 3, 2024, 11:14 AM IST

అల్లు శిరీష్‌ హీరోగా రూపొందిన చిత్రం `బడ్డీ`. టెడ్డీ బేర్‌ ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. మరి సినిమా అలరించిందా అనేది రివ్యూలో తెలుసుకుందాం. 
 

అల్లు వారి హీరో అల్లు శిరీష్‌ ప్రారంభం నుంచి చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తున్నారు. మాస్ కమర్షియల్‌ మూవీస్‌కి దూరంగా ఉంటూ కంటెంట్, కాన్సెప్ట్ చిత్రాలతో వస్తూ తనకంటూ తన ప్రత్యేకతని చాటుకుంటున్నాడు. అయితే ఈ క్రమంలో ఆయన హీరోగా ఇంకా నిలబడలేకపోయాడు. స్టార్‌ ఇమేజ్‌ని అందుకోలేకపోతున్నారు. కెరీర్ పరంగా బిగ్‌ బ్రేక్‌ ఇప్పటి వరకు పడలేదు. అల్లు అరవింద్‌, అల్లు అర్జున్‌ వంటి వారు ఆయన వెనకాల ఉన్నా, ఇంకా స్ట్రగుల్‌ అవుతూనే ఉన్నాడు శిరీష్‌. అదే సమయంలో చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు `బడ్డీ` అనే చిత్రంతో ఆయన ఈ శుక్రవారం ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ఇది టెడ్డీ బేర్‌ ప్రధానంగా సాగే మూవీ. ఇందులో గాయత్రి భరద్వాజ్‌ హీరోయిన్‌గా నటించింది. శామ్‌ ఆంటోన్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా టికెట్ రేట్లు కూడా తగ్గించారు. తాజాగా విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 
 

కథః
పైలట్‌గా పనిచేసే ఆదిత్య(అల్లు శిరీష్‌) కి.. పల్లవి(గాయత్రి భరద్వాజ్‌)తో ఫోన్‌ కాల్ పరిచయం. ఆమె ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ రూమ్‌లో పనిచేస్తుంది. ఫ్లైట్‌ని కంట్రోల్‌ చేయడానికి పల్లవి ఆదేశాలిస్తుంటుంది. అలా వీరి మధ్య పరిచయం. ఈ ఇద్దరు ఎప్పుడూ డైరెక్ట్ గా కలవలేదు. కానీ ఆదిత్య పల్లవికి తెలుసు. పల్లవిని ఆదిత్య చూడలేదు. ఈ ఫ్లైట్‌ కంట్రోల్‌ ప్రేమ కథ మరింత ముదురుతుంది. ఈ క్రమంలో పల్లవి కారణంగా ఆదిత్య సస్పెండ్ అవుతాడు. అనంతరం ఇద్దరు కలవాలనుకుంటారు. తనవల్లే జాబ్‌ పోయిందని భావించిన గాయత్రి ఆదిత్యని కలిసి సారీ చెప్పాలనుకుంటుంది. కానీ ఇంతలోనే ఆమె కిడ్నాప్ కి గురవుతుంది. ఆమెని దుండగులు కొట్టడంతో బాగా గాయపడి కోమాలోకి వెళ్తుంది. ఆ కోమాలోనుంచి ఆత్మ బయటకు వస్తుంది. ఓ టెడ్డీ బేర్‌లోకి వెళ్తుంది. ఆ టెడ్డీ బేర్‌.. ఆదిత్యని కలుస్తుంది. తనకు హెల్ప్ చేయాలని చెబుతుంది. ఆర్గాన్‌ ట్రాఫికింగ్‌ మాఫియా బాగోతం బయటపెడుతుంది. మరి ఆర్గాన్‌ ట్రాఫికింగ్‌ మాఫియాకి పల్లవి ఆత్మకి సంబంధమేంటి? టెడ్డీ బేర్‌ కోసం ఆదిత్య ఏం చేశాడు? ఆర్గాన్‌ ట్రాఫికింగ్‌ మాఫియా వెనకాల ఉన్నదెవరు? పల్లవి, ఆదిత్య కలుసుకున్నారా? చివరికి ఏం జరిగిందనేది కథ. 
 


విశ్లేషణః
ప్రస్తుతం రీమేక్‌ల ట్రెండ్‌ నడవడం లేదు. ఓటీటీలో చూడటం, డైరెక్ట్ గా సినిమా చూడటమో కారణాలేదైనా, రీమేక్‌లకు కాలం చెల్లిందనే చెప్పాలి. ఇలాంటి సమయంలో వచ్చిన రీమేక్‌ చిత్రమే `బడ్డీ`. ఇది తమిళంలో వచ్చిన `టెడ్డీ`ని బేస్ చేసుకుని చేశారు. మూల కథని‌ తీసుకుని, కథనాన్ని మార్చేశారు. మన తెలుగుకి తగ్గట్టుగా మార్పులు చేశారు. టెడ్డీ బేర్ లోకి ఆత్మ రావడమనేది బేసిక్‌ పాయింట్‌. దానిచుట్టూ కొత్త తరహా డ్రామా అల్లారు. అయితే టెడ్డీ బేర్‌లోకి ఆత్మ రావడమే ఇందులో ఇంట్రెస్టింగ్‌ పాయింట్. ఆత్మ ఉన్న టెడ్డీ బేర్‌ ఎలా బిహేవ్‌ చేస్తుందనేది ఆసక్తికరం. దీనికి సమాజంలోని ఓ పాయింట్‌ని తీసుకున్నారు. ఆర్గాన్స్ ట్రాఫికింగ్‌ రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇది అతి పెద్ద వ్యాపారంగా మారింది. ఎంతో మంది అమాయకులు దీనికి బలవుతున్నారు. ఈ బలమైన పాయింట్‌ని ఇందులో చర్చించారు. అయితే సినిమా ప్రారంభం నుంచే మెయిన్‌ కథలోకి వెళ్లినా, హీరోహీరోయిన్ల లవ్‌ ట్రాక్‌తో ఫస్టాఫ్‌ అంతా నడిపించడంతో బోర్‌ ఫీలింగ్‌ తెప్పిస్తుంది. పైగా అందులో ఫీల్‌ లేదు, ఎమోషన్‌ లేదు. చాలా సాధాసీదాగా సాగుతుంది. కనీసం ఫన్‌, కామెడీ తరహా ఎలిమెంట్లపై ఫోకస్‌ చేసినా బాగుండేది. కేవలం లవ్‌ ట్రాక్‌మీదనే నడిపించి బాగా సాగదీశారు. ఇంటర్వెల్‌లో హీరోయిన్‌ కిడ్నాప్‌ ట్విస్ట్ తో సినిమాని సీరియస్‌గా, రక్తికట్టేలా చేశారు. సస్పెన్స్ ని క్రియేట్‌ చేశారు. నెక్ట్స్ ఏం జరగబోతుందో అనే ఉత్కంఠ క్రియేట్‌ చేశారు. 
 

సెకండాఫ్‌ అంతా టెడ్డీ బేర్‌ చుట్టూ తిరుగుతుంది. దానిలోకి హీరోయిన్‌ ఆత్మ రావడం, ఆదిత్యతో కలిసి ట్రావెల్‌ చేసే క్రమంలో టెడ్డీ బేర్‌ వేషాలతో ఫన్‌ క్రియేట్‌ చేసే ప్రయత్నం చేశారు. చిన్నపిల్లలను దృష్టిలో పెట్టుకుని ఆదిత్య, టెడ్డీ బేర్‌ మధ్య ఫన్‌ క్రియేట్‌ చేశారు. ఉన్నంతలో ఫర్వాలేదు. చిన్నపిల్లలకు కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. కానీ పెద్దవాళ్లు ఆ స్థాయిలో ఎంజాయ్‌ చేయలేరు. కామెడీ నుంచి ఎమోషన్‌ సైడ్‌, ఆ తర్వాత థ్రిల్లర్‌ సైడ్‌ కథని తిప్పి యాక్షన్‌తో ముగించారు. ఫ్లైట్‌లో ఫైట్‌ అదిరిపోయింది. అయితే హీరో ఎవరికోసం ఇంత ఫైట్‌ చేస్తున్నాడనేది లాజిక్‌కి అందదు. టెడ్డీ బేర్‌లో ఉన్నది తన ప్రియురాలు అని హీరోకి తెలియదు. అయినా దాని కోసం ప్రాణాలకు తెగించి ఫైట్‌ చేయడమనేది కన్విన్సింగ్‌గా లేదు. ఆ ఎమోషన్‌ కనెక్ట్ అయ్యేలా లేదు. కానీ టెడ్డీ బేర్‌ చేష్టలు, తెలుగు సినిమాల పాటలు, జై బాలయ్య డైలాగ్‌లు వంటివి హిలేరియస్‌గా ఆకట్టుకుంటున్నాయి. బోర్‌ తెప్పించే చోట ఇలాంటివి యాడ్‌ చేసి ఊపు తెచ్చే ప్రయత్నం చేశారు. అవి ఆడియెన్స్ ని, చిన్న పిల్లలను బాగానే ఆకట్టుకుంటాయని చెప్పొచ్చు. సినిమాలో మెయిన్‌ ఎమోషన్‌కి సంబంధించిన బలమైన కారణాలను, దాని పెయిన్‌ని బలంగా చూపించి ఆ ఎమోషన్స్ ని ఆడియెన్స్ కి కనెక్ట్ చేస్తే సినిమా ఫలితం ఇంకా బాగుండేది. 
 

నటీనటులుః
అల్లు శిరీష్‌ ఆదిత్య పాత్రలో బాగా ఒదిగిపోయాడు. ఎక్కువ ఎమోషన్స్ ని పండించేందుకు స్కోప్‌ లేదు. సెటిల్డ్ రోల్‌ కాబట్టి ఈజీగానే చేసేశాడు. యాక్షన్‌ సీన్లలో అదరగొట్టాడు. టెడ్డీ బేర్‌తో ఫన్‌ చేసే ప్రయత్నం చేశాడు. ఇక లవ్‌ ట్రాక్‌లోనూ ఫర్వాలేదనిపించాడు. హీరోయిన్‌ గాయత్రి భరద్వాజ్‌ రెగ్యూలర్ హీరోయిన్‌ రోల్. టెడ్డీ బేర్‌ ఎంట్రీతో ఆమె పాత్రకి పెద్దగా స్కోప్‌ లేకుండాపోయింది. కానీ ఉన్నంతలో బాగా చేసింది. అలీ తన స్టయిల్‌లో నవ్వించే ప్రయత్నం చేశాడు. కానీ ఆయన్ని వాడుకోలేకపోయారు. విలన్‌గా అజ్మల్‌ అదరగొట్టాడు. ఇలాంటి పాత్రలు ఆయనకు కొట్టిన పిండే. ప్రిషా సింగ్‌ అలీ, ముకేష్‌ రిషివంటి మిగిలిన పాత్రధారులు ఓకే అనిపించారు. 
 

టెక్నీషియన్లుః
టెక్నీకల్‌గా సినిమా బాగుంది. క్వాలిటీగా ఉంది. కృష్ణన్‌ వసంత్‌ కెమెరా వర్క్ బాగుంది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. లొకేషన్లు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. మ్యూజిక్‌ డైరెక్టర్‌ హిప్‌ హాప్‌ తమిళ మ్యూజిక్‌ ఓకే అనిపిస్తుంది. బీజీఎం బాగుంది. కానీ తన రేంజ్‌ మ్యూజిక్‌ అనిపించుకోలేదు. పాటలు పెద్ద మైనస్‌. నిర్మాణ విలువలు బాగున్నాయి. క్వాలిటీ విషయంలో రాజీపడలేదని చెప్పొచ్చు. దర్శకుడు శామ్‌ ఆంటోన్‌ సినిమాకి ఎంచుకున్న కథ బాగుంది. బలమైన అంశాన్ని ఇందులో చర్చించాడు. కానీ దాన్ని వినోదాత్మకంగా చేయలా? థ్రిల్లర్‌గా చేయాలా? ఎమోషనల్‌గా మార్చాలా? అనే కన్‌ఫ్యూజ్‌ అయినట్టు తెలుస్తుంది. ఎమోషన్స్ విషయంలో ఆయన కేర్‌ తీసుకుంటే బాగుండేది. అన్ని రకాల వనరులు ఉన్నా, వాటిని సరిగ్గా వాడుకోలేకపోయాడు. మెరుపులు లేకుండా మామూలుగా తీయడంతో రెగ్యూలర్‌ మూవీలా మారుతుంది.  

ఫైనల్‌గాః  `బడ్డీ` చిన్న పిల్లలకు నచ్చే మూవీ. 

రేటింగ్‌ః 2.5

నటీనటులు - అల్లు శిరీష్, గాయత్రి భరద్వాజ్, అజ్మల్ అమీర్, ప్రిషా రాజేశ్ సింగ్, ముఖేష్ కుమార్, అలీ తదితరులు.


టెక్నికల్ టీమ్

ఎడిటర్ - రూబెన్
సినిమాటోగ్రఫీ - కృష్ణన్ వసంత్
ఆర్ట్ డైరెక్టర్ - ఆర్ సెంథిల్
మ్యూజిక్ - హిప్ హాప్ తమిళ
బ్యానర్ - స్టూడియో గ్రీన్ ఫిలింస్
పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)
కో ప్రొడ్యూసర్ - నేహా జ్ఞానవేల్ రాజా
ప్రొడ్యూసర్ - కేఈ జ్ఞానవేల్ రాజా, అధన్ జ్ఞానవేల్ రాజా
రచన, దర్శకత్వం - శామ్ ఆంటోన్
 

Latest Videos

click me!