టాలీవుడ్ టాప్ యాంకర్ సుమ కనకాల, నటుడు రాజీవ్ కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా ఎంట్రీ ఇస్తూ `బబుల్ గమ్` చిత్రంలో నటించాడు. మానస చౌదరి హీరోయిన్‌గా చేసిన ఈ మూవీకి `క్షణం` ఫేమ్ రవికాంత్ పేరెపు దర్శకత్వం వహించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరీ మూవీస్ పతాకంపై ఈ మూవీ తెరకెక్కించింది. మరి యాంకర్‌గా స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకుని, తెలుగులోనే నెంబర్‌వన్ యాంకర్‌గా నిలిచిన సుమ.. తన కొడుకుని హీరోగా నిలబెట్టడంలో సక్సెస్ అయ్యిందా? తొలి సినిమాతోనే ట్రోల్స్ కికారణమై హాట్ టాపిక్ గా నిలిచిన రోషన్ హీరోగా ఆకట్టుకున్నాడా? టీజర్, ట్రైలర్‌లో బోల్డ్ కంటెంట్ ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసిన `బబుల్ గమ్` సినిమాగా అలరించిందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథః
ఆది(రోషన్ కనకాల) డీజేలో సక్సెస్ కావాలని, ర్యాపర్‌గా ఎదగాలని కలలు కంటుంటాడు. అందుకోసం పబ్‌లో డీజే వద్ద అసిస్టెంట్ గా పనిచేస్తుంటాడు. తండ్రి చికెన్ షాప్ నడిపిస్తుంటాడు. రోజూ డబ్బుల కోసం తిప్పలు తప్పవు. ఎప్పటికైనా తన దైన మ్యూజిక్‌తో ఆకట్టుకోవాలని, గొప్పగా ఎదగాలనుకుంటాడు. అవకాశం కోసం ఎదురుచూస్తుంటాడు. కానీ డీజీ హోనర్ తనకు అవకాశం ఇవ్వడు. ఓ రోజు అతన్ని మాయ చేసి పబ్‌లో తన మ్యూజిక్ ప్లే చేస్తాడు. దానికి రిచ్ గర్ల్ జాన్వీ(మానస చౌదరీ) ఫిదా అవుతుంది. అంతేకాదు తన స్టయిల్ మార్చమని చెబుతుంది. దీంతో తొలిచూపులోనే ఆమెకి ఫిదా అయిపోతాడు ఆది. ఆమెనే ఫాలో చేస్తుంటాడు. మరోసారి ఈ ఇద్దరు కలుస్తారు. ఆమె క్లోజ్‌గా మూవ్ కావడంతో కాఫీకి వెళ్తుంటారు. టైమ్ తీసుకోకుండానే ఆమెకి లవ్ ప్రపోజ్ చేస్తాడు. అయితే అంతకు ముందే జాన్వీ.. టర్కీ వెళ్లిపోవాలని ప్లాన్ చేసుకుంటుంది. ఆరు నెలలో ఇద్దరు ముగ్గురుని బకరా చేయాలని అనుకుంటుంది. మొదట్లో టైమ్ పాస్‌లాగానే ఆమె అనుకుంటుంది. ఆది యాటిట్యూడ్, డేర్‌నెస్ కి ఫిదా అవుతుంది. ఇద్దరు కలిసి తిరుగుతారు. శారీరకంగానూ కలుస్తారు. ఈ క్రమంలో జాన్వీ బర్త్ డే రోజు.. ఆమె ఎక్స్ బాయ్ ఫ్రెండ్ జాన్వీతో క్లోజ్‌గా మూవ్ కావడాన్ని చూసి ఆది తట్టుకోలేదు. ఆ ఫ్రస్టేషన్‌లో, కోపంలో ఉండగా జాన్వీ ఫ్రెండ్ అతన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ మూడ్‌లో ఆదికి లిప్ కిస్ ఇస్తుంది. ఇది చూసి కోపంతో రగిలిపోయిన జాన్వీ.. ఆదికి బ్రేకప్ చెబుతుంది. అంతేకాదు అతను వేసుకున్న ప్రతిదీ తాను కోనిచ్చిందే అని బట్టలన్నీ ఇప్పదీసి పంపిస్తుంది. ఆ అవమానంతోనే ఇంటికి వెళ్తాడు ఆది. మరి అంతటి అవమానం, లవ్ బ్రేకప్‌తో రగిలిపోయిన ఆది ఏం చేశాడు? జాన్వీని వదిలేశా? వాస్తవం తెలిసిన జాన్వీ ఏం చేసింది? మళ్లీ కలవాలని ఆమె చేసే ప్రయత్నం ఫలించిందా? ఈ జంట ఒక్కటయ్యారా? వీరి ప్రేమ ఏ తీరం చేరింది అనేది మిగిలిన కథ.
విశ్లేషణః
యూత్‌ఫుల్ మూవీస్ కి సంబంధించి.. ఇటీవల ట్రెండ్ మారింది. బోల్డ్ కంటెంట్‌తో వస్తున్నారు యంగ్ హీరోలు. నేటి యువతలో ఉన్న ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు. అది హిట్ ట్రెండ్‌లా మారింది. `బేబీ` సినిమా ఇలాంటి బోల్డ్ కంటెంట్‌తోనే వచ్చింది. వంద కోట్లు చేసింది. ఈ నేపథ్యంలో `బబుల్‌గమ్`తోనూ యాంకర్ సుమ కొడుకు అలాంటి ప్రయత్నమే చేశాడు. కాస్త బోల్డ్, కాస్త రిచ్ కిడ్స్ లో ఉండే కల్చర్‌ని ప్రతిబింబించేలా `బబుల్ గమ్` చిత్రం చేశాడు. యూత్ టార్గెట్‌గా ఈ మూవీని చేశారు. కానీ కథలో క్లారిటీ లేదు, వారి ప్రేమలో క్లారిటీ లేదు, దర్శకుడి టేకింగ్‌లోనూ క్లారిటీ లేదు. ఇక `బబుల్ గమ్` సినిమాని చూస్తుంటే మనకు చాలా తెలుగు, హిందీ సినిమాలు గుర్తొస్తుంటాయి. `డీజే టిల్లు`, `నువ్వొస్తానండే నేనొద్దంటానా`, `హాయ్ నాన్న` హిందీలో `తమాషా`, `రాక్‌స్టార్` వంటి సినిమాల కలగూర గంపలా ఉంది `బబుల్ గమ్`. `బేబీ`, `అర్జున్ రెడ్డి`లను గుర్తు చేస్తుంది. ముద్దులు, రొమాన్స్, కలవడం, విడిపోవడం ఇదే సింపుల్‌గా సినిమా.
స్టార్టింగ్ స్టారింగ్‌లోనే హైదరాబాదీ ఫ్యామిలీలో లాగా(డీజే టిల్లు) తండ్రి కొడుకుని తిట్టడంతోనే సినిమా స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత సినిమా ప్రారంభమైన పదో నిమిషంలోనే హీరోకి హీరోయిన్ పడిపోతుంది. కలిసి రెండో చూపులతోనే ఇద్దరు లవర్స్ అయిపోతారు. ఈ జనరేషన్ ఇంత ఫాస్ట్ గా ఉందని ఇందులో చూపించారు. కానీ అది ఏమాత్రం పండలేదు. ఆ ఎమోషన్ క్యారీ అవలేదు. ఆ తర్వాత ఏమాత్రం గ్యాప్ లేకుండానే కలిసి తిరగడం, హీరోకి కారు, తన ఏటీఎం కార్డు ఇవ్వడం, లిప్ లాక్‌ల నుంచి రొమాన్స్ వరకు చాలా ఫాస్ట్ గా వెళ్లిపోతారు. మొదటి భాగంలో లెక్కలేనని లిప్ కిస్సులు పెట్టాడు దర్శకుడు. ఇంకా చెప్పాలంటే, లిప్ లాక్‌లు, రొమాన్స్ తప్ప ఇంకేం లేదు. ఆ రొమాన్స్ పీక్‌లోకి వెళ్లిన తర్వాత హీరోయిన్ బర్త్ డే రోజు గొడవ, ఆ వెంటనే బ్రేకప్, బట్టలు లేకుండా హీరోని ఇంటికి పంపిస్తుంది. ఆ అవమానంతో ఆయన కొన్ని రోజులు ఏడుస్తూ ఉండటం. మళ్లీ తాను లైఫ్‌లో ఏడవ కూడదు అనుకుంటాడు. కానీ హీరోయిన్‌కి తన ఫ్రెండ్ నిజం చెప్పడంతో తనదే తప్పు అని అతనికి సారీ చెబుతుంది. ఆయన్ని కూల్ అయ్యేలా చేస్తుంది.
కొన్ని ప్రయత్నాల్లో కూల్ అవుతాడు. కానీ కండీషన్ పెడతాడు. తనతో ఉండాలంటే తన లైఫ్‌ని లీడ్ చేయాలని, తమలా ఉండాలని, అడ్జెస్ట్ కావాలని చెబుతాడు. అందుకు ఆమె ఓకే చెబుతుంది. కానీ ఆ తర్వాత మళ్లీ ఈజీగా కలవడం, మళ్లీ విడిపోవడం, మళ్లీ కలవడం ఇదంతా పెద్ద చిరాకు ప్రోగ్రామ్‌లా నడుస్తుంది. బబుల్ గమ్‌ని నోట్లో నుంచి వదిలించుకోలేం అన్నట్టుగానే సినిమా మూడు క్లైమాక్స్ లతో నడుస్తుంది. ఇక అయిపోయిందనుకున్న ఆడియెన్స్ సహనాన్ని పరీక్షించేలా ఉంది. కథలో, కథనంలో క్లారిటీ లేక విసుగు పుట్టిస్తుంది. పాత్రల్లో లాజిక్ లేదు. తాను బాయ్స్ తో ఆడుకోవాలనుకున్న హీరోయిన్ ఎందుకు హీరోతో ప్రేమలో పడిందో క్లారిటీ లేదు. అంతేకాదు ఒక్క ముందుతోనే హీరోకి బ్రేకప్ చెప్పడం కన్విన్సింగ్‌గా లేదు. హీరోయిన్ అవమానం కారణంగా బాధపడి కోలుకున్న హీరో మళ్లీ ఆమెతో ప్రేమలో పడటంలో కన్విన్సింగ్‌గా లేదు. చివరకు ఆయన ఇచ్చే ట్విస్ట్ ఏమాత్రం కనెక్ట్ అయ్యేలా లేదు. ఏదో అనుకుని, ఎక్కడికో తీసుకెళ్లినట్టుగా ఉంది. లవ్‌లో, రొమాన్స్ లో ఏమాత్రం ఎమోషన్ లేదు. కథనంలో సోల్ లేదు. సీన్లు వచ్చి పోతున్నట్టుగానే ఉంటుంది. `ఏ` సర్టిఫికేట్ ఆడియెన్స్ ని, యూత్ ని టార్గెట్గా చేసిన ఈ ప్రయత్నం బెడిసి కొట్టిందని చెప్పొచ్చు.
నటీనటులుః
ఆది పాత్రలో రోషన్ కనకాల బాగా చేశాడు. తొలి సినిమా అయినా చాలా కష్టపడ్డాడు. ఆ కష్టం కనిపిస్తుంది. నటుడిగా మెప్పించాడు. అయితే క్యారెక్టరైజేషన్ ప్రధానంగా సినిమాని చేయాలని అనుకున్నాడు దర్శకుడు. హీరో కొత్త కావడంతో అది కనెక్ట్ కావడం కష్టం. పాత్రని, కథ డామినేట్ చేసేలా ఉంటే బాగుండేది. కానీ రోషన్‌కి నటుడిగా మంచి ఫ్యూచర్ ఉంటుందని మాత్రం చెప్పొచ్చు. జాన్వీ పాత్రలో మానస చౌదరి ఆకట్టుకుంది. మెచ్యూర్డ్ ఎక్స్ ప్రెషన్స్ తో అలరించింది. అందంతో ఫిదా చేసింది. కళ్లతోనే ఆడియెన్స్ ని పడేసింది. హీరో తండ్రి పాత్రలో చైతూ జొన్నలగడ్డ నవ్వించాడు. కానీ తండ్రి పాత్రకి ఆ నటుడు సెట్ కాలేదు. హీరో ఫ్రెండ్స్ గా కిరణ్ మచ్చా, హర్ష చెముడు అలరించారు. హర్షవర్థన్, అను హాసన్ ఓకే అనిపించారు. మిగిలిన పాత్రదారులు జస్ట్ ఓకే.
టెక్నీకల్‌గా..
సురేష్ రగతు విజువల్స్ బాగున్నాయి. సినిమా రియాలిటీ కనిపించేలా కెమెరా వర్క్ ఉంది. శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ బాగుంది. సినిమాలో ఏదైనా బాగుందంటే మ్యూజిక్, బీజీఎం. ఆ తర్వాతే ఏదైనా. మరోసారి శ్రీచరణ్ తన టాలెంట్ చూపించాడు. కానీ సినిమా సక్సెస్ అయితే తన మ్యూజిక్‌కి పేరొస్తుంది. ఎడిటింగ్ పరంగా ఇంకా కట్ చేయాల్సింది. సెకండాఫ్‌లో ల్యాగ్ లు అన్నీ కట్ చేస్తే బాగుండేది. ఇక నిర్మాణ విలువలు ఓకే. క్వాలిటీ కనిపిస్తుంది. ఫైనల్‌గా దర్శకుడు రవికాంత్ పేరెపు మంచి టెక్నీషియన్. తన గత రెండు సినిమాలు మంచి ఆదరణ పొందాయి. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో, ఇంట్రెస్టింగ్ కథతో ఆకట్టుకున్నాయి. కానీ దాన్ని ఇందులో మెయింటేన్ చేయలేకపోయాడు. కథలో దమ్ములేదు, స్క్రీన్‌ప్లే లో క్లారిటీ లేదు. కొత్త హీరోని పట్టుకుని, హీరో క్యారెక్టరైజేషన్‌పై సినిమాని నడపడం, ఆడియెన్స్ కి కన్విన్స్ అయ్యేలా చేయడం పెద్ద సాహసం. ఆ విషయంలో దర్శకుడు మరింత కేర్ తీసుకుని, కంటెంట్‌ని బలంగా రాసుకుంటే బాగుండేది.
ఫైనల్‌గాః `బబుల్ గమ్`ని వదిలించుకోవడానికి తిప్పలు తప్పవు. కొన్ని సీన్లు యూత్, సిటీ కల్చర్ యూత్ కి కనెక్ట్ అవుతాయి.
రేటింగ్‌ః 1.75