
Brahma Anandam Movie Review: హాస్య బ్రహ్మా బ్రహ్మానందం చాలా కాలం తర్వాత మళ్లీ మెయిన్ లీడ్‌గా చేసిన మూవీ `బ్రహ్మా ఆనందం`. ఇందులో తన కొడుకు రాజా గౌతమ్ హీరోగా నటించారు. ఆర్‌వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించిన ఈ మూవీని స్వధరమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్కా నిర్మించారు.
ఇందులో వెన్నెల కిశోర్ మరో కీలక పాత్ర పోషించగా, ప్రియా వడ్లమాని హీరోయిన్‌గా, సంపత్ రాజ్, రాజీవ్ కనకాల, ప్రభాకర్, రఘుబాబు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మూవీ వాలెంటైన్స్ డే సందర్భంగా నేడు శుక్రవారం(ఫిబ్రవరి 14)ని విడుదలైంది. మరి బ్రహ్మానందం చాలా గ్యాప్ తర్వాత మెయిన్ లీడ్‌గా చేసి మెప్పించాడా? కమ్ బ్యాక్ అనిపించుకున్నాడా? ఇంతకి సినిమా ఎలా ఉంది? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథః
బ్రహ్మా(రాజా గౌతమ్) థియేటర్ ఆర్టిస్ట్. మంచి థియేటర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందాలని ప్రయత్నిస్తుంటాడు. తొమ్మిదేళ్లుగా ప్రయత్నాలు చేసినా బ్రేక్ రాదు, అయినా బ్రేక్ వస్తుంది ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. ఈ క్రమంలో తన జీవనం గడవడం కోసం అందరి వద్ద అప్పులు చేస్తాడు. తార(ప్రియా వడ్లమాని) తో లవ్‌లో కూడా ఉంటాడు. తన అవసరాల కోసం ఆమెని కూడా వాడుకుంటాడు.
కానీ నిజమైన ప్రేమ చూపించలేక ఆమె ప్రేమని కోల్పోతాడు. ఈ క్రమంలో తన గురువు(తనికెళ్ల భరణి) ఢిల్లీ మహోత్సవ్‌లో నీ ప్లే ప్రదర్శిస్తే మంచి గుర్తింపు వస్తుందని, అక్కడి నిర్వాహకులతో మాట్లాడతాడు. కానీ అతని 6 లక్షలు డిమాండ్ చేస్తాడు. దీంతో ఎవరిని అడిగినా డబ్బులు ఇవ్వరు. చివరికి తార కూడా హ్యాండిస్తుంది. ఈ క్రమంలోనే ఆనంద మూర్తి(బ్రహ్మానందం) బ్రహ్మాకి ఉన్న అవసరం గురించి తెలిసి తన ఊర్లో ఆరు ఎకరాలు ల్యాండ్ ఉంది, దాన్ని అమ్మి డబ్బులు తీసుకోమని, అందుకు కొన్ని కండీషన్లు పెడతాడు.
ఆ కండీషన్స్ ఒప్పుకుని ఆనంద మూర్తితో వాళ్ల ఊరికి వెళ్లిపోతాడు? మరి అక్కడికి వెళ్లాక అసలేం జరిగింది? ఆనంద మూర్తి పొలం అమ్మి తన ప్లే ప్రదర్శించాడా? ఇంతకి ఆనంద మూర్తి ఎవరు? ఆయన లవ్ ట్రాక్ ఏంటి? ఆ ఊర్లో సర్పంచ్, వారి ఫ్యామిలీ గొడవలేంటి? ఇందులో సంపత్ రాజ్ పాత్ర ఏంటి? అనంతరం కథ ఎలాంటి మలుపులు తీసుకుందనేది మిగిలిన సినిమా.
విశ్లేషణః
దాదాపు నాలుగు దశాబ్దాలపాటు తనదైన హాస్యంతో నవ్వులు పూయించారు బ్రహ్మానందం. ఆయన చేయని కామెడీ అంటూ లేదు. ఎక్స్ ప్రెషన్స్ తోనే కామెడీని పుట్టించడం ఆయన ప్రత్యేకత. ఆయన తెరపై కనిపిస్తే చాలు ఆటోమెటిక్‌గా నవ్వులు పూస్తాయి. అంతగా విలక్షణ నటనతో నవ్వించారు. ఇటీవల కాలంలో కొంత గ్యాప్ వస్తుంది. ఆయన రేంజ్ పాత్రలు పడటం లేదు.
కొత్త తరం వస్తున్న నేపథ్యంలో, తాను ఇప్పటికే అన్ని రకాలు కామెడీ పాత్రలు పోషించిన నేపథ్యంలో కొత్త తరహా పాత్రలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు, అందుకే రొటీన్‌రోల్స్ చేయడం ఇష్టం లేదని, కొత్త పాత్రలు వస్తేనే చేస్తానని తెలిపారు. ఈ క్రమంలోనే ఆ మధ్య `రంగమార్తాండ`లో సీరియస్ రోల్ చేసి కన్నీళ్లు పెట్టించారు.
ఇప్పుడు `బ్రహ్మా ఆనందం`లో సీరియస్, ఎమోషనల్ రోల్ చేశారు. తనదైన కామెడీ మేళవింపుతో ఈ మూవీని తెరకెక్కించడం విశేషం. ఇందులో తన కొడుకు రాజా గౌతమ్ హీరోగా నటించడం మరో విశేషమైతే, తండ్రీ కొడుకులు కలిసి, తాతా మనవడు పాత్రలు చేయడం ఇంకో విశేషం. ఫన్, ఎమోషన్స్ ప్రధానంగా తెరకెక్కిన ఈ మూవీ బ్రహ్మీ రేంజ్ కామెడీని పంచడంలో పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదు, కానీ చాలా చోట్ల సహజమైన కామెడీతో నవ్వులు పూయించింది.
బ్రహ్మానందం పాత్ర ఇందులో ఆద్యంతం కామెడీగా సాగుతుంది. అదే సమయంలో అంతర్లీనంగా ఆయన పాత్రలో ఓ ఎమోషన్ ఉంటుంది. తాను ఒంటరి అనే ఫీలింగ్ కలిగిస్తుంది, ఫ్యామిలీ దూరం పెట్టడంతో ఒంటరితనం ఫేస్ చేస్తూ అనాథాశ్రమంలో చేరిన స్థితి కాస్త ఎమోషనల్‌గా ఉంటుంది. సినిమా ఆసాంతం ఇలానే సాగుతుంది. నవ్విస్తూనే పరోక్షంగా హృదయాన్ని కదిలిస్తుంది. ఆలోచింప చేస్తుంటుంది.
మొదటిభాగం కాస్త రెగ్యూలర్‌గానే అనిపిస్తుంది. కానీ అటు రాజా గౌతమ్, వెన్నెల కిశోర్ కాంబినేషన్ నవ్విస్తుంది. సెకండాఫ్‌లో బ్రహ్మానందం, రాజా గౌతమ్, వెన్నెల కిశోర్ కలిసి రచ్చ చేశారు. వీరి ముగ్గురు కాంబినేషన్‌లో ఫన్ బాగా వర్కౌట్ అయ్యింది. విలేజ్‌లో సంపత్ రాజ్ పాత్ర కామెడీగా కూడా ఆకట్టుకుంటుంది. ఓ వైపు థియేటర్ నటుడిగా గౌతమ్ పడే బాధ, ఆయన స్ట్రగుల్స్ హత్తుకుంటాయి.
అదే సమయంలో సెకండాఫ్‌లో తన ఫ్రస్టేషన్ నవ్వులు పూయిస్తుంది. రాజా గౌతమ్ బాధలు ఆడియెన్స్ కి ఫన్నీగా ఉంటాయి. బ్రహ్మీ చేసే ఓవరాక్షన్ మరింతగా నవ్విస్తుంటుంది. ఫన్ పరంగా సినిమా చాలా చోట్ల బాగానే వర్కౌట్ అయ్యింది. కానీ కథ పరంగా క్లారిటీ లేదు. ఒక దారిలో ప్రారంభమై, మరో దారిలో వెళ్లిపోయినట్టుగా ఉంది. ఫస్టాఫ్ ఒకలా, సెకండాఫ్ మరోలా ఉంటుంది.
ఫస్టాఫ్ అంతా సిటీలో నడుస్తుంది. సెకండాఫ్ అంతా విలేజ్‌లో సాగుతుంది. చాలా చోట్ల కామెడీ బాగానే వర్కౌట్ అయినా చాలా వరకు రొటీన్ ఫీలింగ్‌ని తెప్పిస్తుంది. సినిమాస్లోగా సాగుతుంది. లాగ్ ఉంది. అది కొంత మైనస్‌గా చెప్పొచ్చు. ద్వితీయార్థంలోనూ కొంత వరకు ఫన్నీగా ఉన్నా, ఆ తర్వాత ఆ ఫన్ మిస్ ఫైర్ అనిపిస్తుంది.
సెకండాఫ్ చాలా వరకు ఎమోషనల్ సీన్లతో హృదయాన్ని బరువెక్కించారు. సీరియస్‌గా సాగే కథలో ఫన్ జనరేట్ చేయడం చాలా కష్టం, రెండింటిని బ్యాలెన్స్ చేయడం మరింత కష్టం. కానీ ఈ చిత్ర దర్శకుడు ఆ విషయంలో సక్సెస్ అయ్యారు. అయితే కథ, కథనంలో క్లారిటీ లేకపోవడం, కామెడీ కూడా అన్ని చోట్లు వర్కౌట్ కాకపోవడం మైనస్‌గా చెప్పొచ్చు.
ఈ సినిమా ద్వారా ఏం చెప్పదలుచుకున్నారనేది క్లారిటీ లేదు. కాకపోతే ఫ్యామిలీ అనుబంధాలను కాస్త టచ్ చేశాడు. లేటు వయసులో ఘాటు ప్రేమని, ఫన్నీగా చూపించిన తీరు బాగుంది. హిలేరియస్‌గా అనిపిస్తుంది. చివరికి ఎమోషనల్‌కి గురి చేస్తుంది.
నటీనటులుః
ఆనంద మూర్తి పాత్రలో బ్రహ్మానందం అదరగొట్టారు. సీరియస్‌గా ఉంటూనే కామెడీ పుట్టిస్తూ నవ్వించారు. ఎంత నవ్వించినా, లోలోపల ఏదో తెలియని బాధ ఆయన ఎక్స్ ప్రెషన్స్ లో కనిపించడం విశేషం. సింపుల్‌గానవ్విస్తూనే గుండెబరువెక్కించారు, ఆలోచింపచేశారు బ్రహ్మీ. పెద్ద వాళ్లకు ప్రేమ, మనసు ఉంటాయని చెప్పిన తీరు బాగుంది. ఇక బ్రహ్మాగా రాజా గౌతమ్ అదరగొట్టాడు.
ఇందులో తండ్రి బ్రహ్మీని కూడా ఆయన పాత్ర డామినేట్ చేసేలా ఉంటుంది. ఈ పాత్రలో చాలా మెచ్చూర్డ్ పర్‌ఫర్మెన్స్ ఇచ్చాడు. సినిమాలో ఎక్కువ మార్కులు హీరోకే పడతాయి. రాజా గౌతమ్ తనలోనూ మంచినటుడు ఉన్నాడని నిరూపించుకున్నారు. ఇందులో చాలా ఈజ్‌తో నటించి ఆకట్టుకున్నాడు. వెన్నెల కిశోర్ ఎప్పటిలాగే నవ్వులుపూయిస్తాడు.
ప్రియా వడ్లమాని మధ్య మధ్యలో మెరుస్తుంది. ఆమెకి మరో మంచి పాత్ర అవుతుంది. ఉన్నంతలో మెప్పించింది. మరో హీరోయిన్ ఐశ్వర్య హోలక్కల్ కాసేపు అలరించింది. ఇక సంపత్ రాజ్ పాత్ర సైతం కామెడీని పండిస్తుంది. సెకండాఫ్‌లో ఆయన రోల్ హిలేరియస్‌గా ఉంటుంది. రాజీవ్ కనకాల కూడా ఆకట్టుకుంటారు. ప్రభాకర్, తనకెళ్ల భరణి వంటి వారు బాగా చేశారు. మిగిలిన పాత్రలో ఉన్నంతలో ఫర్వాలేదనిపించారు.
టెక్నీషియన్లుః
సినిమాకి మితేష్ పర్వతనేని కెమెరా వర్క్ బాగుంది. విజువల్స్ పర్‌ఫెక్ట్ కుదిరాయి. ప్రణీత్ కుమార్ ఎడిటింగ్ మరోఅసెట్. సాండిల్య పిసపాటి మ్యూజిక్ కొంత వరకు బాగానే ఉంది. కానీ సినిమా స్థాయిలో అలరించేలా లేదు. మామూలు సన్నివేశాలను హైలైట్ చేయడంలో సక్సెస్ కాలేకపోయింది. మ్యూజిక్ జస్ట్ యావరేజ్ అని చెప్పొచ్చు.
ఇక నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. సినిమా రేంజ్‌ని బట్టి ఖర్చు చేశారు. ఇక దర్శకుడు ఆర్‌వీఎస్ నిఖిల్ డైరెక్షన్ బాగుంది. కానీ కథ, కథనాల విషయంలోనూ మరింత కేర్ తీసుకోవాల్సింది. స్క్రీన్ ప్లే బాగా డీల్ చేయాల్సింది. కాకపోతే చాలా వరకు ఫన్ వర్కౌట్ అయ్యింది. ఎమోషన్స్ కూడా బాగానే కుదిరాయి. కానీ స్లో నరేషన్, ల్యాగులు, కథ ఎంత సేపు ముందుకు సాగకపోవడం కొంత మైనస్‌గా మారాయి.
కానీ చెప్పాలనుకున్న విషయాన్ని మాత్రం బాగా చెప్పారు. కొన్ని ఎపిసోడ్లుగా వాటిని ప్లాన్ చేసుకున్నారు. ఓవరాల్ గా బ్రహ్మానందం, వెన్నెల కిశోర్, రాజా గౌతమ్ కాంబినేషన్‌లో కామెడీ నవ్వులు పూయిస్తుందని చెప్పొచ్చు.
ఫైనల్‌గాః నవ్విస్తూ గుండె బరువెక్కించే `బ్రహ్మా ఆనందం`.
రేటింగ్‌ః 2.75