Bobbili Puli Movie Review: ఎన్టీఆర్ సినిమా కోసం రోడ్లెక్కి నిరాహార దీక్షలు చేసిన జనం, బొబ్బిలి పులి రివ్యూ..

Published : Nov 08, 2026, 08:42 AM IST

Bobbili Puli Movie Review: తెలుగు సినిమా చరిత్రలో కొన్ని సినిమాలు కేవలం వినోదంకోసం కాకుండా సమాజానికి ఒక మంచి సందేశాన్ని కూడా ఇస్తాయి. అలాంటి వాటిలో నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్), శ్రీదేవి జంటగా నటించిన 'బొబ్బిలి పులి' ఒకటి.

PREV
14
బొబ్బిలి పులి సినిమా రివ్యూ..

1982 జూలై 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన బొబ్బిలి పులి సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ చెప్పిన పవర్‌ఫుల్ డైలాగులు, ఆయన తెరపై ప్రదర్శించిన గంభీరమైన నటన, దాసరి నారాయణరావు అద్భుతమైన స్క్రీన్ ప్లే.. ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టాయి. దశాబ్దాలు గడిచినా ఈ సినిమా గురించి చర్చించుకుంటున్నారంటే అందులోని బలమైన ఎమోషన్స్ త పాటు .. సామాజిక సందేశం ఎంత ప్రభావం చూపాయో అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడమే కాకుండా, ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశానికి ఒక బలమైన పునాదిగా మారింది.

24
బొబ్బిలి పులి సినిమా కథ ఏమిటి?

దేశ సరిహద్దుల్లో శత్రువులతో పోరాడుతూ, తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దేశ రక్షణ కోసం పనిచేసే సైనికుడే మేజర్ చక్రధర్(ఎన్టీఆర్). దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఈ సైనికుడు తన వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబ అనుబంధాలను సైతం పక్కనపెట్టి దేశం కోసం, సైనికుడిగా తన ఉద్యోగానికే ఇంపార్టెన్స్ ఇస్తాడు.

అయితే దేశం కోసం పోరాడుతున్న ఒక సైనికుడికి తన సొంత దేశంలోనే మరో రకమైన శత్రువులు ఉన్నారని తెలిసినప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. సైనిక బాధ్యతలు ముగించుకుని తన ఊరికి తిరిగి వచ్చిన చక్రధర్‌కు అక్కడి పరిస్థితులు తీవ్ర నిరాశను కలిగిస్తాయి. సొంత ఊరికి తిరిగొచ్చిన చక్రధర్ కు సమాజంలో వేళ్లూనుకున్న అవినీతి, అక్రమాలు, కల్తీ వ్యాపారాలు, స్వార్థ రాజకీయాలు స్వాగతం పలుకుతాయి.

ఆ దారుణమైన వాతావరణంలో చక్రధర్ చెల్లెలు, ఆమె భర్త దారుణ హత్యకు గురవుతారు. చివరకు తన కన్నతల్లి (పుష్పలత) కూడా ఈ కల్తీ కోరలకే బలైపోతుంది. న్యాయస్థానాలు, పోలీసులు కూడా సమాజంలోని ధనవంతుల, రాజకీయనాయకుల అండతో ఉన్న అక్రమార్కులను ఏమీ చేయలేకపోవడం చూసి చక్రధర్ ఆవేశంతో రగిలిపోతాడు.

సమాజంలో అవినీతి, అక్రమాలు, దోపిడీలు, అన్యాయాలు పెరిగిపోవడం అతడిని కలచివేస్తాయి. ప్రజలను కాపాడాల్సిన కొందరు వ్యక్తులే తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తుంటారు. చట్టాన్ని గౌరవించాల్సిన వ్యక్తులే చట్టాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటుంటారు.

ఇలాంటి పరిస్థితుల్లో మేజర్ చక్రధర్ మౌనంగా ఉండలేకపోతాడు. దేశం కోసం సరిహద్దుల్లో పోరాడిన తాను, దేశంలో జరుగుతున్న అన్యాయాలను కూడా ఎదిరించాల్సిన బాధ్యత ఉందని భావిస్తాడు. అక్కడి నుంచే అతడి పోరాటం మొదలవుతుంది. అన్యాయాన్ని ప్రశ్నిస్తూ, అవినీతిపరులను ఎదుర్కొంటూ ప్రజల పక్షాన నిలబడతాడు.

ఈ క్రమంలో అతడికి ఎదురయ్యే సమస్యలు, వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకునే పరిణామాలు, అధికార వ్యవస్థతో జరిగే సంఘర్షణ కథను ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్తాయి. ఒక సైనికుడి పోరాటం చివరకు ఎలాంటి మలుపు తిరిగింది? సమాజంలోని దుర్మార్గులను ఎదిరించిన చక్రధర్‌కు ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? న్యాయం కోసం అతడు చేసిన పోరాటం ఎక్కడ ముగిసింది? అనేదే సినిమా ప్రధాన కథ.

34
నటీనటుల పనితీరు (Performances)

ఎన్టీఆర్ కెరీర్‌లోనే 'బొబ్బిలి పులి' ఒక మైలురాయి లాంటి పాత్ర. ఆర్మీ ఆఫీసర్‌గా మిలిటరీ డ్రెస్ లో ఆయన చూపించిన గంభీర్యం, కోర్టు బోనులో నిలబడి సమాజంలో జరుగుతున్న అన్యాయాలు ఎండగడుతూ చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను ఇప్పటికీ ఉర్రూతలూగిస్తాయి. ఇక హీరోయిన్ గా శ్రీదేవి నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ విజయ పాత్రలో చక్రధర్ ప్రేయసిగా, నిబద్ధత కలిగిన న్యాయవాదిగా శ్రీదేవి తన పాత్రలో ఒదిగిపోయారు.

ఎన్టీఆర్‌తో ఆమె కెమిస్ట్రీ స్క్రీన్‌పై చాలా బాగుంటుంది. కోర్టు సీన్లలో ఆమె వేసే ప్రశ్నలు, చక్రధర్ ఇచ్చే సమాధానాలు ఉత్కంఠను పెంచుతాయి. ఈ సినిమాకు విలన్లు గా రావు గోపాలరావు, కైకాల సత్యనారాయణ.. ఇతర పాత్రల్లో కొంగర జగ్గయ్య, మురళీమోహన్, అల్లు రామలింగయ్య వంటి దిగ్గజ నటులు తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం (Technical Aspects)

బొబ్బిలి పులి సినిమాకు ప్రాణం పోశారు దాసరి నారాయణరావు. ఆయన కథ మాత్రమే కాదు రాసిన డైలాగ్స్ కూడా ఈ సినిమాకు ఊపిరి పోశాయి. దేశభక్తిని, సమాజంలో ఉన్న కుళ్లును ఎండగడుతూ ఆయన రాసిన డైలాగులు ఎన్టీఆర్ నోటి వెంట వస్తుంటే థియేటర్లలో ఈలలు, కేకలు వినబడేవి. దాసరి స్క్రీన్‌ప్లే సినిమాను ఎక్కడా బోర్ కొట్టకుండా వేగంగా నడిపిస్తుంది.

ఇక దాసరి కథకు తగ్గట్టుగా.. ఎన్టీఆర్ ఇమేజ్ ను డబుల్ చేస్తూ.. జె.వి. రాఘవులు అందించిన పాటలు ఎవర్ గ్రీన్ హిట్స్ గా నిలిచాయి. “జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ” – ఈ పాట తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహత్తర దేశభక్తి గీతం. “తెల్లా తెల్లని చీరలోన” , “అది ఒకటో నంబర్ బస్సు” – మాస్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి.

44
ఎన్టీఆర్ సినిమా కోసం ధర్నాలు చేసిన జనం..

బొబ్బిలి పులి' సినిమా వెనుక చాలా విషయాలు జరిగాయి. 1982 మార్చిలో ఎన్టీఆర్ "తెలుగుదేశం పార్టీ" ని స్థాపించిన కొద్ది నెలలకే (జూలై 1982) ఈ సినిమా విడుదలైంది. చిత్రంలోని రాజకీయ, సామాజిక విమర్శలు ప్రజల్లో పెద్ద ఎత్తున చైతన్యాన్ని తెచ్చి, ఎన్టీఆర్ అధికారంలోకి రావడానికి ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడ్డాయి. ఈ సినిమాలో ప్రభుత్వంపై, వ్యవస్థపై ఉన్న ఘాటైన విమర్శల కారణంగా అప్పటి అధికార కాంగ్రెస్ ప్రభుత్వం సినిమా విడుదలను అడ్డుకోవాలని చూసింది.

దాంతో సినిమాను వెంటనే విడుదల చేయాలని అభిమానులు ఏకంగా నిరాహార దీక్షలు చేశారు. వివాదం పెద్దది అవ్వడంతో.. సెన్సార్ బోర్డు వివాదాల నడుమ కొన్ని కట్స్ ఇచ్చి 'A' సర్టిఫికేట్ జారీ చేసింది. అప్పట్లో 'A' సర్టిఫికేట్ వచ్చిన సినిమాలు ఆడవనే సెంటిమెంట్‌ ఉండేది. కానీ దాన్ని పటాపంచలు చేస్తూ, బొబ్బిలి పులి రూ. 3.5 కోట్లకు పైగా వసూలు చేసి ఆ కాలంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రం 39 కేంద్రాలలో 100 రోజులు, హైదరాబాద్ లో స్వర్ణోత్సవం (50 వారాలు) పూర్తి చేసుకుంది.

ఫైనల్ గా చెప్పాలంటే..

‘బొబ్బిలి పులి’ కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ ను అందించే సినిమా మాత్రమే కాదు... అన్యాయాన్ని ఎదిరించే ఒక పవర్ ఫుల్ సామాజిక ఆయుధం. ఎన్టీఆర్ నటన, దాసరి పవర్‌ఫుల్ డైరెక్షన్ , జె.వి. రాఘవులు సంగీతం ఈ చిత్రాన్ని తెలుగు సినిమా చరిత్రలో ఒక క్లాసిక్‌గా నిలబెట్టాయి. ఈమూవీ చూడాలి అనుకునేవారికి యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories