Veerasimhareddy Review
బాలయ్య సినిమా అంటే ఓ లెక్క ఉంటుంది. పవర్ ఫుల్ డైలాగులు, అందులో పొలిటికల్ కంటెంట్...ఊర మాస్ యాక్షన్ సీన్స్, ఊగిపోయేలా పాటలు, డ్యూయిల్ రోల్...ఇదో ప్యాకేజీ. ఈ ప్యాకేజీని ఫెరఫెక్ట్ గా ఫాలో అవుతూ హిట్స్ కొడుతున్నారు. ప్రతీ సారి అదే మాస ఫార్మెటా అని అభిమానులు అనుకోరు...మాస్ కు అదే ట్రీట్ అంటారు. అయితే ఫార్మెట్ కు నిండుతనం తెచ్చేది ఫ్యాక్షన్ నేపధ్యం. ఇవన్నీ దర్శకుడు గోపిచంద్ మలినేని గమనించాడు. వీటిన్నటితో కథ చేసుకున్నారు. ఈ సినిమా మాస్ ని అలరించిందా..అభిమానులకే పరిమితం అయ్యిందా.... ఈ లెక్కలు ...భాక్సాఫీస్ రెక్కలు విప్పుకుని ఎగిరేలా చేసాయా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
Veerasimhareddy Review
కథాంశం
వీరసింహా రెడ్డి(బాలకృష్ణ)కు తన చెల్లి భానుమతి(వరలక్ష్మీ శరత్‌కుమార్) అంటే ప్రాణం. ఆమె మాత్రం అన్నగారిని అదే పనిగా ద్వేషిస్తూంటుంది. ఆమె భర్త ప్రతాప్ రెడ్డి (దునియా విజయ్) తో కలిసి పగ సాధించే ప్రయత్నాల్లో ఉంటుంది. అయితే చెల్లెలు తనను ఎంత ద్వేషించినా ప్రతి ఏడాది ఆమెకు పంపాల్సిన సారె పంపుతూనే ఉంటాడు వీరసింహారెడ్డి. అంతేకాక తన బావ ప్రతాప్ రెడ్డి తనను చంపడానికి ప్రయత్నించినప్పటికీ.. చెల్లెలిపై ప్రేమ కారణంగా అతన్ని క్షమించి వదిలేస్తుంటాడు. ఇది గత 30 ఏళ్లుగా జరుగుతూనే ఉంటుంది. ఇదిలా నడుస్తూంటే..మరో ప్రక్క ...వీరసింహారెడ్డికి భార్య మీనాక్షి (హనీ రోజ్), కొడుకు జై సింహారెడ్డి (బాలకృష్ణ) వీటిన్నటికి దూరంగా ఇస్తాంబుల్‌లో జీవిస్తూంటారు. మీనాక్షి ఓ రెస్టారెంట్ నడుపూతూంటే, జై సింహా రెడ్డి ఓ కాలర్ డీలర్ షిప్ తీసుకుంటాడు.
Veerasimhareddy Review
అలాగే ఇషా (శృతీహాసన్)తో ప్రేమ వ్యవహారాలు నడిపిస్తూంటాడు. ఆమె తండ్రి...జై ని మీ నాన్నగారు పెళ్లి మాటలు మాట్లాడటానికి రమ్మనమని అంటాడు. అప్పుడు వీరసింహా రెడ్డి టర్కీలో దిగుతాడు. అక్కడే కథ అనుకోని మలుపు తిరుగుపతుంది. వీరసింహా రెడ్డి గతం వెంటాడుతుంది. వీరసింహారెడ్డిని టార్గెట్ చేసి భానుమతి, ప్రతాప్ రెడ్డి దాడి చేస్తారు. అసలు వీళ్లు ఇంతదూరం ఎందుకు వచ్చేసారు. అంతలా అన్నగారిపై చెల్లికి పగకు కారణం ఏమిటి..అసలు ఏమి జరిగింది..చివరకు ఆ పగ చల్లారిందా...ఇషా తో జై సింహా రెడ్డి వివాహం జరిగిందా...వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Veerasimhareddy Review
విశ్లేషణ
మొదటే చెప్పుకున్నట్లు ఇది ఫక్తు ఫార్ములా కథ. అయితే దర్శకుడు గోపిచంద్ మలినేని ఇందులో ఇమిడే మసాలాలు తూకం ప్రకారం మొత్తం వేసాడు. అయితే కథ విషయంలోనే పకడ్బందీగా రాసుకోలేకపోయారు. ఫస్టాఫ్ ని సెటప్ సీన్స్ ని స్క్రీన్ ప్లే చేసి, అటు ది ఇటు ..ఇటుది ఇటు చేసి స్పీడుగా లాగగలిగాడు. అయితే సెకండాఫ్ కు వచ్చేసరికి ఆ మ్యాజిక్ మిస్సైపోయింది. ఇంటర్వెల్ దగ్గర ఇచ్చిన ట్విస్ట్...ఏదో పెద్ద బాంబ్ లా పేలుతుందనుకుంటే చాలా సాదాసీదాగా రివీల్ అయ్యింది. ఎప్పుడైతే చెల్లికి, అన్నకు ఫలానా గొడవ అని తెలిసిందో...అక్కడే విలన్ పాత్ర కూడా డౌన్ అయ్యింది. ఎత్తుగడకు దగ్గ రెజల్యూషన్ కాదు. దాంతో ఎంతో కీలకంగా నిలిచి సినిమాని నిలబెట్టాల్సిన సెకండాఫ్ చాలా డల్ గా సాగదీస్తూ సాగింది.
Veerasimhareddy Review
ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి కానీ ..ఆ ఎమోషన్ రైజ్ అవటానికి గల కారణం బలంగా లేకపోవటంతో అవి తేలిపోయాయి. గవర్నమెంట్ ని టార్గెట్ చేస్తూ కొన్ని డైలాగులు థియోటర్ లో ఓ వర్గం చేత విజిల్ వేయించాయియ అలాగే మాస్ ఎలివేషన్స్ కూడా గట్టిగా ఉన్నాయి. అడుగడుక్కీ యాక్షన్ సీన్స్ ఉన్నా అవి ప్రేక్షకుడు ఇన్ వాల్వ్ అయ్యి చూసినప్పుడే రెస్పాన్స్ బాగుంటుంది. దాంతో కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ చూసేందుకు బాగున్నా...అలా వచ్చి ఇలా వెళ్లిపోయినట్లు అనిపిస్తాయి. స్క్రిప్టు విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుని సెకండాఫ్ ని మరింత టైట్ గా రాసుకుని ఉంటే ఇలా మాట్లాడుకునే పని ఉండేది కాదు. యాక్షన్ సీన్స్ కు ,మాస్ సాంగ్స్ కు తగ్గ కథా నేపధ్యం రెడీ చేయలేకపోయారు. సెకండాఫ్ సోసోగా ఉన్నా క్లైమాక్స్ కేక పుట్టిస్తే ఆ కిక్కే వేరేగా ఉండేది. అదీ జరగలేదు.ఏదైతే జరుగుతుందని ఊహిస్తున్నామో అదే క్లైమాక్స్ లో ప్రత్యక్ష్యమవుతుంది.
Veerasimhareddy Review
టెక్నికల్ గా ...:
గోపీచంద్ మలినేని... స్క్రిప్టు విషయంలో కాస్త జాగ్రత్త పడి ఉంటే ఆయన తీసిన యాక్షన్ సీన్స్ కు, చూపెట్టిన ఎలివేషన్స్ కు క్రాక్ స్దాయి లో ఉండేది. బాలకృష్ణ చనిపోయే సీన్ వంటివి అనుకున్న స్దాయిలో పండలేదు. అలాగే సిస్టర్ సెంటిమెంట్ ను మూల కథగా అయినా అందులో విషయం లేదనిపించింది. ఇక ఈ సినిమాకు పూర్తి స్దాయిలో ప్రాణం పోసింది మాత్రం తమన్. యావరేజ్ సీన్స్ ని తనదైన బ్యాగ్రౌండ్ స్కోర్ తో ఎలివేట్ చేశాడు. ఇక యాక్షన్ సీన్స్ కి తమన్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. “జై బాలయ్యా…” అంటూ సాగే పాట అభిమానులను అలరిస్తుంది. మిగిలిన వాటిలో “సుగుణసుందరీ…”, “మా బావ మనో భావాలు…”, “మాస్ మొగుడు…” అనే పాటలూ మాస్ ను ఆకట్టుకుంటాయి.. ఇక ఈ సినిమాలో ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సింది రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ కంపోజ్ చేసిన యాక్షన్ బ్లాక్స్ గురించే. పెళ్లి పందిరిలో ఫైట్ సీన్స్ & మైన్ లో కుర్చీ ఫైట్ సీన్ సూపర్బ్ అంటాం.
సాయిమాధవ్ బుర్రా డైలాగులు కొన్ని చోట్ల బాగా పేలాయి. ముఖ్యంగా పొలిటికల్ పంచ్ డైలాగులకు మాత్రం థియేటర్ రెస్పాన్స్ అదిరింది. “వాళ్ళు ప్రజలు ఎంచుకున్న వెధవలు” వంటి వివాదాస్పద డైలాగులు సైతం ధైర్యంగా రాసారు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ వర్క్ మరో హైలెట్. ప్రొడక్షన్ డిజైన్ బాగుంది. నిర్మాతలు సినిమాకు బాగా ఖర్చుపెట్టారని ప్రతీ ఫ్రేమ్ కనపడుతుంది.
Veerasimhareddy Review
ఎవరెలా చేసారంటే..
తండ్రిగా, కొడుకుగా ద్విపాత్రాభినయంలో బాలకృష్ణ ఎప్పటిలాగే అదరకొట్టారు. జయ సింహా రెడ్డిగా యంగ్ గా కనిపించడానికి కాస్త ఇబ్బందిపడినట్లు అనిపించినా.. వీరసింహారెడ్డిగా మాత్రం వెండితెరపై విశ్వరూపం చూపించేసారు బాలయ్య. వీరసింహారెడ్డిగా బాలయ్య యాక్షన్ సీన్స్ & డైలాగులు తో థియేటర్ హోరెత్తించారు. కొన్ని చోట్ల యాక్షన్ సీక్వెన్స్ కాస్త అతి అనిపించినప్పటికీ.. తన ఫెరఫార్మెన్స్ తో వాటిని హైలెట్ కాకుండా నెట్టుకొచ్చాడు బాలయ్య. భానుమతిగా వరలక్ష్మీ శరత్ కుమార్ కు వంక పెట్టేదేమీ లేదు. మలయాళ నటి హనీ రోజ్ గ్లామర్ పాప. కన్నడ నటుడు దునియా రూపం సెట్ అయినా..ఎక్సప్రెషన్స్ ఇవ్వటంలో ఫిట్ కాలేదు. దాంతో విలనిజం సీన్స్ పండలేదు. శ్రుతిహాసన్ గురించి చెప్పుకునేందుకు హీరోయిన్ అంటే హీరోయిన్ అంతే. గ్లామర్ కొలతలకు పరిమితం అయిపోయింది.
Veerasimhareddy Review
నచ్చినవి
వీరసింహా రెడ్డి గెటప్ ,లుక్, ఆ పాత్రకు రాసిన డైలాగులు
సెకండాఫ్ లో వరలక్ష్మి అభినయం
జై బాలయ్య, మా మనో భావాలు దెబ్బతిన్నాయే సాంగ్స్
నచ్చనవి
పురాతన కాలం నుంచి ఎన్నో సినిమాల్లో పీల్చి పిప్పి చేసిన కాన్సెప్టు
పాతకాలం ప్లాష్ బ్యాక్
ఫన్ చెప్పుకోదగ్గట్లు లేకపోవటం
రన్ టైమ్ ఎక్కువ
రొటీన్ క్లైమాక్స్
ఫైనల్ థాట్
బంగారు కంచానికైనా గోడ చేరువ కావాలి. మాస్ మసాలా, కమర్షియల్ అంశాలకు కూడా కథ,స్క్రీన్ ప్లే అనే బేస్ కావాలి.
---సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating: 2.5
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, శృతిహాసన్, వరలక్ష్మీ శరత్ కుమార్, హానీ రోజ్, దునియా విజయ్, నవీన్ చంద్ర, పీ రవిశంకర్, అజయ్ ఘోష్, మురళీ శర్మ, చంద్రిక రవి, సప్తగిరి తదితరులు
సినిమాటోగ్రఫి: రిషి పంజాబీ
ఎడిటింగ్: నవీన్ నూలి
మ్యూజిక్: ఎస్ థమన్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గోపిచంద్ మలినేని
నిర్మాతలు: నవీన్ యెర్నీని, రవిశంకర్ వై
విడుదల తేదీ :12, జనవరి 2023