
కామెడీ పాత్రలతో ఆకట్టుకున్న రాగ్ మయూర్ ఇప్పుడు హీరోగా నిలబడుతున్నాడు. `కీడా కోలా`, `పరదా` చిత్రాలతో మెప్పించాడు. ఇప్పుడు ఆయన హీరోగా `అనుమాన పక్షి` మూవీ రూపొందింది. `డీజే టిల్లు` చిత్ర దర్శకుడు విమల్ కృష్ణ రూపొందించిన చిత్రమిది. మెరిన్ ఫిలిప్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో అజయ్, రాశి, ప్రిన్స్, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషించారు. చిలక ప్రొడక్షన్స్ పతాకంపై రాజీవ్ చిలక, రాజేష్ జగ్తియాని, హిరాచంద్ నిర్మించారు. ఈ మూవీ నేడు శుక్రవారం(సెప్టెంబర్ 25న) విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
సన్నీ(రాగ్ మయూర్)ది వైజాగ్. అనుమానపక్షి పేరుతో యూట్యూబ్ నడిపిస్తుంటాడు. తను ప్రతిదీ అనుమానిస్తుంటాడు. వింతగా చేస్తుంటాడు. అతనికి కాశ్మీర్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది. సన్నీ చేసిన పని వల్ల అతను నష్టపోతాడు. దీంతో కాశ్మీర్ రావాలని, లేదంటే తన పేరు రాసి సూసైడ్ చేసుకుంటానని బెదిరిస్తాడు. దీంతో వర్మ(ప్రిన్స్) మరో ఫ్రెండ్‌తో కలిసి కాశ్మీర్ వెళ్తాడు. అక్కడ కన్య(మెరిన్ ఫిలిప్) పరిచయం అవుతుంది. ఇద్దరు ప్రేమలో పడతారు. కానీ ఆమెని కూడా అనుమానిస్తుంటాడు. మార్నింగ్ నీకు సర్‌ప్రైజ్ ఇస్తానని కన్య చెబుతుంది. లేచి చూసేసరికి వర్మ చనిపోయి ఉంటాడు. అది తానే చేశానని గందరగోళానికి గురవుతాడు సన్నీ. ఇంకోవైపు అదే సమయంలో వైజాగ్ పోలీస్ వాసు(అజయ్) తన భార్య సుజాత(రాశి)ని తీసుకొని కాశ్మీర్‌కి వస్తాడు. అక్కడ వీడియోలు చేస్తుంటారు. అనుకోకుండా సన్నీ ఉన్న రిసార్ట్ లోకి వెళ్తారు. అక్కడ వర్మ మరణం వార్త తెలుస్తుంది. మరోవైపు సుజాత ఆత్మల కోసం సెర్చ్ చేస్తుంది. ఇంకోవైపు సన్నీకి ప్రియురాలు హ్యాండిస్తుంది? మరి వర్మ ఎలా చనిపోయాడు? సన్నీ లవర్ ఎందుకు హ్యాండిచ్చింది? వైజాగ్ వాసు ఈ కేసుని ఏం చేశాడు? వీటి నుంచి సన్నీ ఎలా బయటపడ్డాడు? తాను అనుమానాలు తెచ్చిన తంటాలేంటి? సుజాత ఆత్మలను ఎందుకు సెర్చ్ చేస్తుంది? అనేది మిగిలిన కథ.
అనుమానంతో ఎలాంటి చిక్కులు వచ్చాయనేది, హీరో ఎలాంటి గందరగోళం క్రియేట్ చేశాడు, దీని వల్ల ఫన్ క్రియేట్ చేయడమనే కథాంశంతో రూపొందిన చిత్రమిది. సింపుల్‌గా కథ ఇదే. కానీ సందర్భానుసారంగా క్రియేట్ అయ్యే ఫన్‌తో ఈ మూవీని రూపొందించారు. ప్రారంభమే ఫన్‌తో స్టార్ట్ అవుతుంది. హీరో పాత్రని, ఆయన అనుమానాలు ఏ స్థాయిలో ఉన్నాయనేది ఆవిష్కరించారు. అనుమానాలతో తన ఇంటిని ఎలా సెక్యూర్డ్ గా తయారు చేసుకున్నారనే అంశాలతో ఆసక్తికరంగా స్టార్ట్ అవుతుంది. దీంతో సినిమా మొత్తం ఫన్‌తోనే రన్ అవుతుందని భావిస్తాం. కానీ కాసేపటికే ఇందులో కామెడీ లేదని అర్థమవుతుంది. రాగ్ మయూర్ చేసిన రచ్చనే ఉంటుంది తప్ప, ఒక్క సీన్‌లోనూ కామెడీ వర్కౌట్ కాలేదు. నటుడిగా రాగ్ మయూర్ బాగానే కష్టపడ్డా, ఆయన చేసే చేష్టల్లో కామెడీ జనరేట్ కాలేదు. ఇంకా చెప్పాలంటే దర్శకుడు కామెడీని రాబట్టడంలో ఫెయిల్ అయ్యాడు. వైజాగ్ నేపథ్యంలో సినిమా స్టార్ట్ చేసి, కాశ్మీర్‌కి షిఫ్ట్ చేస్తారు. అక్కడ వెళ్లినా కూడా అదే తరహాలో ఉంటుంది. ప్రిన్స్ మరణం తర్వాత క్రైమ్ థ్రిల్లర్ వైపు టర్న్ తీసుకుంటుంది. కానీ ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్లు కూడా తేలిపోయాయి. అజయ్ పాత్ర ఎంట్రీతో అయినా ఫన్ జనరేట్ అవుతుందనుకుంటే అక్కడ కూడా నిరాశనే ఎదురైంది. అలాగే బ్రహ్మాజీ పాత్ర సైతం ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. దీనికితోడు ఇందులో టెర్రరిస్ట్ ల ఎపిసోడ్‌ని కూడా జోడించారు. ఏదీ కూడా నవ్వించలేకపోయాయి. పైగా గందరగోళం క్రియేట్ చేశాయి. మరింత విసిగించాయని చెప్పొచ్చు. అనుమానాలు ఎలాంటి గందరగోళం క్రియేట్ చేస్తుందనే పాయింట్ బాగుంది, కానీ దానికోసం సినిమా తీయాల్సిన అవసరం లేదని ఈ మూవీ చూస్తే అర్థమవుతుంది. ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు ఇది పూర్తిగా నిరాశపరిచింది.
సన్నీగా రాగ్ మయూర్ నటుడిగా మెప్పించాడు. విభిన్నమైన హవాభావాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ తాను చేసింది కామెడీగా టర్న్ కాకపోవడంతో ఓ దశ తర్వాత చిరాకుగా మారుతుంది. వైజాగ్ వాసుగా అజయ్ ఆకట్టుకున్నాడు. ఫర్వాలేదనిపించారు. రాశి పాత్ర పెద్దగా ఇంపాక్ట్ లేదు. బ్రహ్మాజీ కాసేపు మెరిశాడు. కానీ నవ్వించలేకపోయాడు. ప్రిన్స్ పాత్ర అయోమయంగా ఉంటుంది. ఆయన ఓకే అనిపించారు. హీరోయిన్ పాత్రని ఎందుకు పెట్టారో అర్థం కాదు. మిగిలిన పాత్రలు ఓకే అనిపించాయి.
సినిమా విజువల్‌గా బాగుంది. సునీల్ కుమార్ బాగా చిత్రీకరించారు. ఛోటా కే ప్రసాద్ ఎడిటింగ్ ఫర్వాలేదు. షార్ట్ గానే చేశారు. శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ ఏమాత్రం ఇంపాక్ట్ లేదు. సౌండింగ్ కూడా ఆకట్టుకోలేకపోయింది. దర్శకుడు విమల్ కృష్ణ చిన్నపాయింట్‌ని మూవీగా తీయాలనుకున్నారు. కానీ కామెడీని వర్కౌట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. ఈ మూవీ విషయంలో ఆయన ఎన్నో ప్రయత్నాలు చేసినా అన్నీ బెడిసికొట్టాయి. కాకపోతే పాయింట్ ఒక్కటే బాగుంది. నిర్మాతలు రాజీలేకుండా నిర్మించారు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. సినిమాలో ప్లస్ ఏదైనా ఉందంటే అది నిడివి, రెండో ప్రొడక్షన్ వ్యాల్యూస్.
ఏమాత్రం నవ్వించలేకపోయిన అనుమాన పక్షి. సినిమాలో చివర్లో ఒక డైలాగ్ ఉంటుంది. ఈ అనుమాన పక్షికి దూరంగా ఉండాలని. అది కరెక్ట్ గా ఈ సినిమాకి వర్తిస్తుంది. ఈ మూవీకి ఎంత దూరంగా ఉంటే అంత బెటర్.
రేటింగ్ : 1