అల్లరి నరేష్ ‘ఆ ఒక్కటీ అడక్కు’రివ్యూ

First Published | May 3, 2024, 12:40 PM IST

అల్లరి నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా  చేసిన ఫన్  ఎంటర్‌టైనర్ 'ఆ ఒక్కటీ అడక్కు'. మగవాళ్ల పెళ్లిళ్లు లేటు అవుతన్న  నేపథ్యంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ  ఏ మేరకు ఆకట్టుకుందంటే?

Aa Okkati Adakku movie Review

గత కొంతకాలంగా అల్లరి నరేష్  తన కామెడీ రూటు మార్చి  ‘నాంది’తో మొదలెట్టి  సీరియస్ సినిమాలు చేస్తున్నారు. అయితే అవీ సీరియస్ గా వర్కవుట్ కాకపోవటం వలనో మరేమో కానీ ఇప్పుడు ‘ఆ ఒక్కటీ అడక్కు’తో మళ్ళీ తన  జోన్ లోకి వచ్చారు. అయితే ఈ కామెడీ సినిమా వర్కవుట్ అయితే ఖచ్చితంగా ఏడాదికి ఒకటి అయినా ఇలాంటిది ఇవ్వటానికి ట్రై చేస్తాడు అన్నది నిజం. కాకపోతే మళ్లీ సీరియస్ గా సీరియస్ సినిమాల ప్రపంచంలోకి వెళ్లిపోతాడు. ఓ రకంగా ఇది నరేష్ కన్నా కూడా నరేష్ కామెడీ ని ఇష్టపడే ప్రేక్షకులకు  పరీక్ష సమయం.పెళ్లి చుట్టూ నడిచే ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా కథ ఏంటి..నరేష్ కు మళ్లీ కామెడీ సినిమాలు చేసే దైర్యం ఈ సినిమా ఇస్తుందా లేదా అన్నది చూద్దాం.

Aa Okkati Adakku Review


కథేంటి

సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు ఉద్యోగి గణ అలియాస్ గణపతి (అల్లరి నరేష్) వయస్సు వెళ్లిపోతున్నా పెళ్లి కాదు. చాలా సంభందాలు చూస్తూంటారు కానీ ఏదీ సెట్ కాదు. మరో ప్రక్క ఇంట్లో తన  తమ్ముడు (విరూపాక్ష ఫేమ్ రవికృష్ణ)కి, మేనమామ కూతురు దేవి (జేమీ లివర్)కి పెళ్లి అయ్యిపోవటం కూడా ఓ సమస్యగా మారుతుంది. ఎక్కడకి వెళ్లినా పప్పు అన్నం ఎప్పుడు పెడతారు  అని అడుగుతూంటే సిగ్గుతో చచ్చిపోతుంటాడు. ఆ పెళ్లి ప్రయత్నాల్లో భాగంగా హ్యాపీ  మ్యాట్రిమోనీ ని సంప్రదిస్తాడు. 
 


Aa Okkati Adakku Review


అక్కడ వాళ్లు ప్రీమియం ఫీజు కట్టించుకుని పది సంభందాలు పంపుతారు. అక్కడ పెళ్లికూతురుగా పరిచయం అవుతుంది సిద్ధి (ఫరియా అబ్దుల్లా). ఆమెతో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. అయితే ఆమె మాత్రం .. 'నేను మీకు కరెక్ట్ కాదు' అని చెప్పి   తిరస్కరించి వెళ్లిపోతుంది.  ఆ తర్వాత కొంతకాలానికి  ఆమె ఫేక్ పెళ్ళి కూతురుని, తనలాంటి వారిని మోసం చేయటానికి  మ్యాట్రిమోనీ సంస్దవాళ్లు ఏర్పాటు చేసిన అమ్మాయి అని తెలుసుకుంటాడు. అప్పుడు గణ ఏం చేస్తాడు. సిద్ది అసలు అలాంటి మోసం పెళ్లి కూతురుగా ఎందుకు జాబ్ చేస్తోంది. ఆమె నేపధ్యం ఏమిటి..చివరకు గణ పెళ్లి అయ్యిందా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

Aa Okkati Adakku Review


ఎలా ఉంది

కామెడీ సినిమా అదీ అల్లరి నరేష్ ఉన్నాడంటే మనం సాధారణంగా నవ్వుకోవటానికి వెళ్తాం. అందులో చిన్న మెసేజ్ ఉన్నా సమస్య ఏమీ లేదు. అయితే  మ్యాట్రిమోనీ సంస్దలు మోసం చేస్తున్నాయనే మెసేజ్ చెప్పటానికే అన్నట్లు సీరియస్ గా కథ నడిపితే ఎలా . అల్లరి నరేష్ ..ఈ మధ్యకాలంలో సీరియస్ సినిమా బాట తొక్కాడని తెలుసు. కానీ ఈ సినిమా వింటేజ్ నరేష్ వచ్చి కామెడీ చేస్తాడనుకుంటే సీరియస్ డ్రామిడీ చేసేసి షాక్ ఇచ్చేసి వెళ్లిపోతాడు. 
 

Aa Okkati Adakku Review


కామెడీ సినిమాల్లో ఓపెన్ డ్రామా ఉంటేనే పండుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రను ముందే ఓపెన్ చేసి, అలాంటి పెళ్లి పేరు చెప్పి మోసం చేసే అమ్మాయికి, పెళ్లి కోసం డెస్పరేట్ గా ఉన్న అబ్బాయి ..ప్రేమలో పడి..ఎలా ఒకటి అవుతారనే యాంగిల్ లో నడిపితే ఖచ్చితంగా ఫన్ పండేది. అలా కాకుండా హీరోయిన్ పాత్రను ట్విస్ట్ కోసం దాచి ఉంచారు. కామెడీలో సస్పెన్స్ ఇమడదు అని మన సినిమా పెద్దలు మిస్సమ్మ టైమ్ నాటి నుంచే చెప్తూనే ఉన్నారు. 

Aa Okkati Adakku Review


నిజానికి ఇది చాలా చాలా కాంటపరెరీ సబ్జెక్ట్. మన సొసైటిలో చాలా మంది యువతీ యువకులు ఫేస్ చేసే కరెంట్ ఇష్యూ..  పెళ్లి సంబంధం కోసం మ్యాట్రిమోనీ సైట్లను ఆశ్రయించడం. పెళ్లైన అమ్మాయిల నంబర్లను మ్యాట్రిమోనీ సైట్లు అబ్బాయిలకు ఇవ్వడం, మ్యాట్రిమోనీ సైట్లలో మోసాలు అన్నీ బయిట జరుగుతన్నవే చూపించారు. అయితే అందులోంచి ఫన్ ని మాత్రం పండించలేకపోయారు. జోక్ లు అక్కడక్కడా పేలాయి కానీ కంటిన్యూ లాఫ్స్ లేవు. పగలబడి నవ్వే సీన్స్ అయితే అసలే లేవు. ఫస్టాఫ్ సోసోగా వెళ్లిపోయినా సెకండాఫ్ ఆ మాత్రం కూడా నవ్వించలేకపోయారు. ఈ సినిమాతో పోలిస్తే ఏడాది క్రితం వచ్చిన అన్నపూర్ణ ఫొటో స్టూడియో సినిమా వెయ్యిరెట్లు బెస్ట్. ఆ సినిమాలోనూ హీరో పెళ్లికాని ప్రసాదే. కానీ నవ్విస్తాడు చాలా చోట్ల. 

Aa Okkati Adakku Review


ఏదైమైనా 'ఆ ఒక్కటీ అడక్కు' టైటిల్ వినగానే మనందరికీ  ముందుగా గుర్తుకు వచ్చేది రాజేంద్ర ప్రసాద్ హీరోగా నరేష్ తండ్రి, దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన సినిమా. అది క్లాసిక్ అయ్యింది. ఆ పేరుతో నరేష్ సినిమా చేస్తుండటం, అదీ పెళ్లి సమస్య నేపథ్యంలో కావడంతో అంచనాలు పెరిగాయి.  ఆ అంచనాలను రీచ్ అయ్యారా అంటే లేదనే చెప్పాలి. అయితే  ప్యారిడీలకు పెద్దగా ప్రయారిటీ ఇవ్వకపోవటం కలిసొచ్చిన అంశం. కామెడీ రైటింగ్ లో ఓ ట్రెడిషన్ చూస్తూంటాం. పాతుకుపోయిన సామాజిక  సాంప్రదయాలను, ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను, నమ్మకాలను వ్యంగ్య థోరణిలో చెప్పుతూ ఉంటాం. అలాగే ఇప్పుడు సమాజంలో దాదాపు మిడిల్ క్లాస్ జనం ఎదుర్కొంటున్న పెళ్లి కాకపోవటం అనే సమస్య చుట్టూ కథ అల్లటంతో చాలా మందిని ఈ సినిమా వైపుగా ఎట్రాక్ట్ చేయగలిగారు. 
 

Aa Okkati Adakku Review


కామెడీ ,సెంటిమెంట్ కలిపి కొట్టు..హిట్టవ్వకపోతే చెప్పుచ్చుకు కొట్టు అనేవారు ఇవివి సత్యనారాయణగారు. ఆయన సినిమాల్లో ఎంత ఫన్ ఉండేదో అంతే బలంగా ఎమోషనల్ థ్రెడ్ కూడా ఉండేది. అయితే చెప్పుకున్నంత ఈజీ కాదు కామెడీ రాయటం..దాన్ని నిజంగా నవ్వించి మెప్పించటం. కామెడీ సినిమాకు ఫార్స్ తీసుకున్నా సరే  స్ట్రాంగ్ ప్రిమేజ్ , చిత్రమైన క్యారక్టర్స్ అవసరం. అందులోంచి పుట్టే కామెడి సిట్యువేషన్స్ అప్పుడు నవ్విస్తాయి. ప్రిమైజ్ లోనే సమస్య ఉంటే ఎంత జోక్స్ ని వరసపెట్టి పేల్చుకుంటూ వెళ్లినా ఆ క్షణం నవ్వుతాం కానీ ,బయిటకు వచ్చి ఏం చూసామంటే ఒక్క సీన్ గుర్తుకు రాదు. అదే ఈ సినిమాకు జరిగింది. 
 
 

Aa Okkati Adakku Review


ప్లస్ లు 

అల్లరి నరేష్ మళ్లీ కామెడీ సినిమా చేయటం

మ్యాట్రిమోనీ సైట్ల మోసాలను స్టోరీ లైన్ గా తీసుకోవటం


మైనస్ లు

స్క్రీన్ ప్లే , డైలాగులు
నవ్వించని కామెడీ సీన్స్ 
విసిగించే పాటలు
 


ఎవరెలా చేసారు

 'నాంది', 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం', 'ఉగ్రం'తో సోలో హీరోగా వరుస విజయాలు అందుకున్న ఆయన... మళ్లీ తన హోమ్ గ్రౌండ్ కామెడీకి వచ్చారు. 'నా సామి రంగ'లో వింటేజ్ నరేష్ సందడి చేశారు. ఇప్పుడు ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్ 'ఆ ఒక్కటీ అడక్కు'తో వేసవిలో వినోదం అందించడానికి వస్తున్నారనగానే ఏదో కామెడీ ఎక్సపెక్ట్ చేస్తాం. అయితే నరేష్ తన తరహా కామెడీ చెయ్యలేదు. సీరియస్ గా చేసుకుంటూ వెళ్లిపోయారు. హీరోయిన్ గా   ఫరియా అబ్దుల్లా జస్ట్ ఓకే. ఆమె నవ్వే బాగుంది. హీరో హీరోయిన్ల పెయిర్ కూడా ఫెరఫెక్ట్. పృథ్వీ, గోపరాజు రమణ, ప్రవీణ్, గౌతమి,మురళి శర్మ  వీళ్ల ఎవరికీ సరైన స్క్రీన్ టైమ్ లేదు. వదిన గా చేసిన జెమీ లివర్ ఎక్స్‌ప్రెషన్స్ బాగున్నా ఎందుకో ఆ సీన్స్ హిలేరియస్ గా పండలేదు. వెన్నెల కిశోర్, హర్ష చెముడు సీన్లు కొన్ని నవ్వించాయి. 

Aa Okkati Adakku Review


టెక్నికల్ గా 

ఈ సినిమాకు అవసరమైన కామెడీ డైలాగులు అందించలేకపోయారు అబ్బూరి రవి. గోపీసుందర్ పాటల్లో రాజా..రాజాధిరాజా పాట మాత్రమే బాగుంది. సినిమాటోగ్రఫీ సూర్య డీసెంట్ గా చేసారు. మిడిల్ క్లాస్ సెటప్ ని సాధ్యమైనంత నాచురుల్ గా చూపించారు. ఎడిటర్ ఛోటా కే ప్రసాద్ ..సెకండాఫ్ లో ల్యాగ్ ని తగ్గిస్తే ధాంక్స్ చెప్పుకుందుము. సినిమా రన్ టైమ్ తక్కువైనా మూడున్నర గంటల సినిమా చూసిన పీల్ వచ్చింది. 

Aa Okkati Adakku movie Review


ఫైనల్ థాట్

అప్పటి  ‘ఆ ఒక్కటీ అడక్కు’కు నవ్వుల్లో కానీ మరే విషయంలోని దగ్గరకు కూడా రాని ఈ సినిమా అక్కడక్కడా వచ్చే మ్యాట్రిమోనీ సైట్లలో జరుగుతున్న మోసాల గురించి తెలుసుకోవటం  కోసం ఓ లుక్కేయచ్చు. ఏదైమైనా పాత హిట్ సినిమాల్లో కంటెంట్ కు  మాత్రమే కాదు...అప్పటి టైటిల్స్ కు కూడా ఫ్యాన్స్ ఉంటారు..ఆ విషయం మర్చిపోకూడదు. 
Rating:2/5

----సూర్య ప్రకాష్ జోశ్యుల

Aa Okkati Adakku Review

బ్యానర్ :చిలకా ప్రొడక్షన్స్ 
నటీనటులు:  అల్లరి నరేష్,  ఫరియా అబ్దుల్లా, వెన్నెల కిషోర్, జామీ లీవర్, హర్ష చెముడు, అరియానా గ్లోరీ, హరితేజ తదితరులు.
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్, 
ఛాయాగ్రహణం: సూర్య, 
రచన: అబ్బూరి రవి, 
సంగీతం: గోపి సుందర్, 
కళా దర్శకుడు: జేకే మూర్తి, 
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అక్షిత అక్కి, 
సహ నిర్మాత: భరత్ లక్ష్మీపతి,
 నిర్మాత: రాజీవ్ చిలక, దర్శకత్వం: మల్లి అంకం.

Latest Videos

click me!