Valimai Review :అజిత్ 'వలిమై' రివ్యూ

First Published | Feb 24, 2022, 3:14 PM IST


ఇలాంటి సినిమాల నుంచి ఆశించే థ్రిల్లిగ్ సీన్స్ కు ప్రయారిటీ ఇవ్వకుండా సెకండాఫ్ మొత్తం సెంటిమెంట్ కే కట్టబెట్టి..చూసేవాడిని చూసింది చాలు కట్టి పెట్టి పో అన్నట్లు చేసారు.  


ఏ మాత్రం బాగున్నా  యాక్షన్ సినిమాలకు మనవాళ్లు బాగానే పట్టం కడతారు. అలాగే మన బి,సి సెంటర్లలలో యాక్షన్ సినిమాలకు ప్రత్యేకమైన మార్కెట్ ఉంది. అయితే ఆ యాక్షన్ తగ్గ రియాక్షన్, ఎమోషన్ ఉంటేనే బాగుందంటారు. ఉత్తినే తెరపై కొట్టేసుకుంటే ప్రక్కన పెట్టేస్తారు. అలాగే అజిత్ సినిమాలు గత కొంతకాలంగా మన తెరపైకి వస్తున్నాయి. వెళ్తున్నాయి. తమిళంలో ఆడిన సినిమాలు సైతం తెలుగులో జెండా ఎత్తేస్తున్నాయి. ఈ నేపధ్యంలో అజిత్ ప్రతిష్టాత్మకంగా భావించి చేసిన   'వలిమై' మన ముందుకు వచ్చింది. తెలుగు మార్కెట్ కోసం అన్నట్లుగా తెలుగు హీరో కార్తికేయను నెగిటివ్ రోల్ లో తీసుకున్నారు. ట్రైలర్స్ బాగున్నాయని పేరు తెచ్చుకున్నాయి. ఈ నేపధ్యంలో రిలీజైన ఈ చిత్రం ఏ మేరకు అంచనాలు రీచ్ అయ్యింది. తెలుగు వాళ్లకు నచ్చే అంశాలు ఉన్నాయా. అసలు కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.


కథేంటి

విశాఖ మొత్తం మర్డర్స్, చైన్ స్నాచింగ్స్, డ్రగ్స్ తో నిండిపోతుంది. మీడియా మొత్తం ఇదే టాపిక్. జనం గోలెత్తిపోతూంటారు. కుర్రాళ్లు డ్రగ్స్ కు బానిసలైపోతూంటారు. హఠాత్తుగా ప్రశాంతంగా ఉండే వైజాగ్ పిశాచ నగరంగా మారిపోయింది. దీని వెనక బైక్ (సైతాన్ స్లేవ్స్) గ్యాంగ్ ఉందని తెలుస్తుంది. ఈ అరాచకాలను కంట్రోలు చేసేవారే లేరా అన్న పరిస్దితుల్లో  ఏసీ అర్జున్ కుమార్ (అజిత్ కుమార్) సిటీకు ట్రాన్సఫరై వస్తాడు. అతనో సూపర్ కాప్. ఈ క్రైమ్స్ చేసే గ్యాంగ్స్ వెనక ఉన్న మాస్టర్ మైండ్ కోసం ఇన్విస్టిగేట్ చేస్తాడు.  ఆ క్రమంలో ఆ గ్యాంగ్ లీడర్ నరేన్ (కార్తికేయ) గురించి తెలుసుకుంటాడు. టెక్నాలజీ సాయంతో ఇదంతా అతనే  చేస్తున్నట్లు తెలుస్తుంది. జాబ్ లు లేని యూత్ ను ఒక చోట చేర్చి నరేన్ ఇదంతా చేయిస్తుంటాడు.అతన్ని పట్టుకోవటానికి అర్జున్ వల వేస్తాడు. కానీ రివర్స్ లో  పోలీస్ లు క్రిమినల్స్ వెనక పడటం మానేసి  అర్జున్ వెనక పడతాడు.అతన్ని చంపటానికి చూస్తారు...అసలేం జరిగింది. చివరికి ఏసీపీ అర్జున్, కార్తికేయ క్రైమ్స్ ను ఎలా బయటపెట్టాడు. ఈ కేసుని ఎలా సాల్వ్ చేసాడు అన్నది మిగతా కథ.

Latest Videos



విష్లేషణ

జాకీ ఛాన్ New Police Story బేస్ చేసుకుని తీసిన ఈ సినిమా యాక్షన్ పరంగా హై గా ఉన్నా స్క్రిప్టు పరంగా బాగా లోగా ఉంది. ఫస్టాఫ్ బాగున్నా..సెకండాఫ్ నీరసమైపోయింది. ఇంట్రవెల్ అయితే చాలా పెద్దది..కొంత ట్రిమ్ చేస్తే బాగుండేది.ఏ మాత్రం ఆదమరుపుగా ఉన్నా సినిమా అయ్యిపోయిందేమో అనుకుని జేబులో చేతులు పెట్టుకుని బయిటకు వచ్చి బండి తీస్తాము.

  ఇక ఇలాంటి సినిమాకు కావాల్సిన రెండు ప్రధాన పాత్రలు ఎంచుకోవటం, వాటికి ప్రోపర్ ఇంట్రడక్షన్ లు, వారి ప్రపంచాన్ని ఆవిష్కరించటం , ఇన్ సైటింగ్ ఇన్సిడెంట్ లు ఏర్పాటు చేయటం ద్వారా బాగానే స్క్రిప్టు నడిచింది. అయితే అక్కడ నుంచి స్టోరీ మూవ్ అవ్వటం మానేసింది. విలన్ Vs హీరో డ్రామా బిల్డ్ కాలేదు. హీరోకు గోల్ సెట్ అయ్యింది కానీ ...ఆ గోల్ ని ఫుల్ ఫుల్ చేసే ప్రాసెస్ లో జరగాల్సిన ఇన్సిడెంట్స్ మాత్రం చోటు చేసుకోలేదు. దాంతో ఫస్టాఫ్ రెండు పాత్రల పరిచయం, సెటప్, సమస్య తో ఫస్టాఫ్ సరిపెట్టేసారు. సెకండాఫ్ లో అసలు కథ మొదలవుతుంది అనుకుంటే....అది జరగలేదు.


 క్యారక్టర్స్  కి కావాల్సిన  conflicts,challenges ఎదురుకాలేదు. దాంతో మెల్లిమెల్లిగా పాత్ర ప్యాసివ్ అవుతూ వచ్చేసి, క్లైమాక్స్ కు వచ్చేసరికి పూర్తిగా కుదేలు అయ్యిపోయింది. కథకు రాసుకున్న ట్రీట్మెంట్ చాలా చోట్ల లాజికల్ గా అనిపించదు. కొన్ని సార్లు అయితే ఈ సీన్ ఇంక అవదా అనేటంత లాగ్ సీన్స్ లాంటి ఎపిసోడ్స్ ఉన్నాయి. కథ కదలకుండా యాక్షన్ ఎపిసోడ్స్ తెరపై జరుగుతూ పోతూ ఉంటే ఎంతసేపని భరించగలం. ఇవన్ని చాలదు అన్నట్లు మధ్య మధ్యలో  మదర్ సెంటిమెంట్. డైరక్టర్.... అజిత్ కోసం కొన్ని సీన్స్ పనిగట్టుకుని అతికించారు. ట్విస్ట్ లు అనుకున్న స్దాయిలో పేలలేదు. ఖాకి తీసిన డైరక్టర్ ఇతనూ ఒకరేనా అనే డౌట్ వచ్చేలా అనిపిస్తుంది.

టెక్నికల్ గా...

డైరక్టర్ హెచ్ వినోద్, అజిత్ కాంబినేషన్ లో  గతంలో నేర్కొండ పార్వై(పింక్ రీమేక్) వచ్చి హిట్టైంది. దాంతో ఈ అవకాసం చేపట్టి...ఈ సారి అజిత్ కు నచ్చే స్టైలిష్ స్టంట్ సీక్వెన్స్ పైన దృష్టి పెట్టారు . కానీ స్క్రిప్టు పై పెట్టలేదు. బైక్ స్టంట్స్ లు చాలా ప్రెష్ గా ఉన్నాయి. స్టంట్స్ గురించి స్పెషల్ గా చెప్పుకోవాలి.  సంగీత దర్శకుడు యవన్ శంకర్ రాజా పాటులు ఓకే అన్నట్లున్నాయి. నాలుగైదు సార్లు వింటే ఎక్కుతాయేమో. అయితే అవి ఈ యాక్షన్ సినిమా నేరేషన్ కు స్పీడు బేకర్స్ గా అనిపిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం ఎక్సలెంట్ అని చెప్పాలి. నీరవ్ షా కెమెరా వర్క్ కూడా అద్బుతమే. కొన్నిసార్లు హాలీవుడ్ యాక్షన్ సినిమా చూస్తున్నామా అనిపిస్తుంది. విజయ్ ఎడిటింగ్ మాత్రం ఆ ఫీల్ ని వెనక్కి లాగేస్తుంది. ఖర్చు కూడా బాగా పెట్టారు. రైటింగ్,ఎడిటింగ్ తప్ప మిగతా శాఖలు హై  స్టాండర్డ్ లో ఉన్నాయి.

నటీనటుల్లో...

అజిత్ ఇలాంటి పోలీస్ పాత్రలు చేయటం కొత్తేమీ కాదు. కానీ అదరకొట్టాడు. పోలీస్ గా హ్యూమా ఖురేషీ డీసెంట్ గా చేసుకుంటూ పోయింది. కార్తికేయ...ని అసలు ఈ పాత్రలో అసలు ఊహించలేం. ప్రీ ఇంట్రవెల్ నుంచి అయితే రెచ్చిపోయారు. గ్యాంగ్ మెంబర్స్ కొందరు బాగా చేసారు. 


ఫైనల్ థాట్

అజిత్ కు తెలుగు మార్కెట్ కావాలంటే ... కథా వలీమై(బలం) కావాలి. లేకుండా జనం ఇలా బలి అవ్వాలి.

---సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:2.5


ఎవరెవరు..
నటీనటులు: అజిత్, కార్తికేయ గుమ్మకొండ, హ్యూమా ఖురేషి తదితరులు
సినిమాటోగ్రఫీ: నిరవ్ షా
నేపథ్య సంగీతం: జిబ్రాన్
స్వరాలు: యువన్ శంకర్ రాజా
నిర్మాత: బోనీ కపూర్
దర్శకత్వం: హెచ్. వినోద్
తెలుగులో విడుదల: ఐవీవై ప్రొడ‌క్ష‌న్స్ (గోపీచంద్ ఇనుమూరి)
విడుదల తేదీ: ఫిబ్రవరి 24, 2022

click me!