లోకల్ భాషకు,యాసకు, వేషానికి ఎప్పుడూ ఓ గుర్తింపు ప్రత్యేకత ఉంటుంది. అలాంటిదే హైదరాబాదీ గల్లీ కుర్రాళ్ల స్పెషల్ అప్పీరియన్స్..లైఫ్ స్టైయిల్. అక్కడ కనిపించే చిచ్చోరా పోరగాళ్ల కథలు పెద్దగా మనకు తెరకెక్కలా. అయితే ఈ మధ్యకాలంలో తెలంగాణా యాసలో వచ్చే సినిమాలు, దక్కన్ సినిమాలు సైతం అందరి ఆమోదం పెద్ది పెద్ద ఎత్తున విజయవంతం అవుతూండటంతో డిజే టిల్లూ ధైర్యం చేసాడు. హైదరాబాద్ లోకల్ ని నరనరాల్లో నింపుకున్న క్యారక్టర్ తో మన ముందుకు వచ్చాడు. అయితే ఆ పాత్రకు సరైన ఆర్క్, మార్క్ వేయటంలో తడబడ్డాడు... ఇంతకీ ఈ టిల్లు ఎవరు...వాడి కథేంటి?
కథ
డీజే టిల్లు(సిద్ధూ జొన్నలగడ్డ)లోకల్ గా ఫేమస్. ఏ పెళ్లిలో,పేరంటంలో అయినా అతని డిజే కొట్టాల్సిందే. అయితే టిల్లు కు ఓ తీరని కోరిక...ఓవర్ నైట్ ఓ పెద్ద మ్యూజిక్ డైరక్టర్ అయ్యివాలని. ఈలోగా సింగర్ రాధిక (నేహాశెట్టి)తో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటాడు. అయితే ఆమెకు ఆల్రెడీ ఓ బోయ్ ప్రెండ్ ఉన్నాడు. ఆ బోయ్ ప్రెండ్ మరో అమ్మాయితో క్లోజ్ గా ఉంటాడు. దాంతో రాధిక నేనేం తక్కువ తిన్నానా అన్నట్లు మన టిల్లుకు దగ్గరవుతుంది. ఇది తెలిసిన ఆ బోయ్ ప్రెండ్ డైరక్ట్ యుద్దం ప్రకటించేస్తాడు. ఫైనల్ గా రాధిక చేతిలో చనిపోతాడు. ఈ మర్డర్ కేసులో టిల్లు కూడా ఇరుక్కునే సిట్యువేషన్ క్రియేట్ అవుతుంది.సరే జరిగిందేదో జరిగిందని ఆ శవాన్ని ఇద్దరు కలిసి మాయం చేద్దామంటే.... ఓ బ్లాక్ మెయిలర్, పోలీస్ లు వెంటనబడతారు. అప్పుడు టిల్లు ఏం చేసాడు. మర్డర్ కేసు నుంచి ఎలా బయిటపడ్డారు. అందుకు ఏం ప్లాన్ చేసారు. చివరకు ఏమైంది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎనాలసిస్ ...
క్యారక్టర్ నడిపించే కథనం ఇది. మొదట క్యారక్టర్ డిజైన్ చేసుకుని అందులోంచి పుట్టే సమస్యలను ఫన్ గా డీల్ చేస్తూ ముందుకు వెళ్లే క్రైమ్ కామెడీగా తీర్చిదిద్దాలనుకున్నారు. సాధారణంగా ఈ క్యారక్టర్ డ్రైవరన్ కథల్లో మెయిన్ ఫోకస్ అంతా క్యారక్టర్ ఆలోచలు, ఆహార్యం, ఆర్క్, ఇంటర్నెల్ ఛేంజ్ లు వంటివాటి చుట్టూ ఉంటాయి. అంతేకానీ ఈవెంట్స్ ఉండవు. అయితే డీజే టిల్లులో అటువంటిదేమీ కనపడదు. ఓ టపోరి క్యారక్టర్ అనుకున్నారు. దాన్ని ముందుకు బాగానే తీసుకెళ్ళారు. సమస్యలో పడేసారు. అయితే ఆ సమస్య నుంచి బయిటపడే మార్గం మాత్రం కనుక్కోలేకపోయారు. దాంతో సెకండాఫ్ మొత్తం ఎటునుంచి ఎటు వెళ్తోందో అర్దం కానట్లు తయారైంది. ఫస్టాఫ్ లో వచ్చిన ఫన్ అంతా సెకండాఫ్ లో తగ్గిపోయి డౌన్ అయ్యిపోయింది .
కాకపోతే క్యారక్టర్ డ్రైవన్ కథలతో ఓ సుఖం ఉంటుంది. అవి పట్టాయా తెగ నచ్చేస్తాయి. పెద్దగా లోపాలను హైలెట్ కానివ్వవు. ఆ క్యారక్టర్ లోకి చూసేవాడు పరకాయ ప్రవేశం చేసే అవకాసం ఇస్తాయి. చూసేవాళ్లు స్వయంగా ఎక్సపీరియన్స్ చేయలగుతారు. టిల్లు కొంతవరకూ ఆ విషయంలో సక్సెస్ అయ్యింది. అయితే ఈ కథలో హిరోకు వచ్చే స్ట్రగుల్స్ చాలా సిల్లీగా అనిపిస్తాయి. అలాగే ఈ సినిమాలో క్యారక్టర్ ఆర్క్ కూడా లేకపోవటం, ప్రారంభంలో ఎలా ఉన్న పాత్ర చివరకు వచ్చేసరికీ అలాగే ఉండటంతో ఏమీ జరిగినట్లు అనిపించదు. ముఖ్యంగా క్లైమాక్స్ ఏదో ముగించాలి కాబట్టి ముగించేసారు అనిపిస్తుంది. కాకపోతే జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఓ విషయం అర్దమవుతుంది. సిద్దు కూడా విఙయదేవరకొండ, విష్వక్ సేన్, నవీన్ పోలిశెట్టి తరహాలో తనకంటూ ఓ స్టెయిల్ ని ఏర్పాటు చేసే పనిలో ఉన్నాడు. అందులోంచి పుట్టిన వాడే డిజే సిద్దు అని. ఆ యాంగిల్ లో చూస్తే సిద్దు సక్సెస్ అయ్యాడనిపిస్తుంది.
ఫెరఫార్మెన్స్
ఇది సంపూర్తిగా సిద్దు జొన్నలగడ్డ సినిమా. అతను నటన, క్యారక్టరైజేషన్, డైలాగులే సినిమాకు ప్రాణం. . నేహాశెట్టి రొమాన్స్ బాగా పండించింది. బ్రహ్మాఙీ, నర్రా శ్రీను వంటి క్యారక్టర్ ఆర్టిస్ట్ లు ఎప్పటిలా చేసుకుంటూ పోయారు. కామెడీ మాత్రం పండించలేకపోయారు.
టెక్నికల్ గా...
డైరక్టర్ గా ఇలాంటి కథలు డైరక్ట్ చేయటం అంటే మాటలు కాదు. విమల్ కృష్ణ కొత్తవాడైనా గట్టివాడే అనిపించుకున్నాడు. క్యారక్టరైజేషన్, డైలాగులు, లోకల్ నేటివిటిపై దృష్టి పెట్టాడు. సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల పాసైపోయాడు. అతను పాటలు డిసెంట్ హిట్. ముఖ్యంగా టైటిల్ సాంగ్ అయితే మామూలుగా లేదు. సాంగ్స్ మేకింగ్ కూడా బాగుంది. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. కానీ అఖంఢ స్దాయిలో హోరెత్తించేయటం ఇబ్బందిగా ఉంది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
హైలెట్స్
సిద్దు జొన్నల గడ్డ యాక్టింగ్
టిల్లు క్యారక్టరైజేషన్
డైలాగ్స్,
ఫస్టాఫ్
మైనస్ లు
సెకండాఫ్
ఎటెటో వెళ్లిపోయే స్క్రీన్ ప్లే
క్లైమాక్స్
DJ Tillu
ఫైనల్ థాట్
కథ,స్క్రీన్ ప్లే వంటివి పెట్టుకోకుండా కేవలం హీరో క్యారక్టరైజేషన్ తో సినిమా నడిపించేయాలనుకోవటం మాత్రం సాహసమే.
---సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:2.5
DJ Tillu Review
తెర వెనక..ముందు
నటీనటులు: సిద్ధూ జొన్నలగడ్డ, నేహా శెట్టి, ప్రిన్స్, బ్రహ్మాజీ, ప్రగతి, తదితరులు;
సినిమాటోగ్రఫీ: సాయిప్రకాశ్;
ఎడిటర్: నవీన్ నూలీ;
నేపథ్య సంగీతం: తమన్;
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ;
సంస్థ: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్;
కథ, రచన: విమల్ కృష్ణ, సిద్ధూ జొన్నలగడ్డ;
దర్శకత్వం: విమల్ కృష్ణ;
విడుదల తేదీ: 12-02-2022