Maha Shivaratri:ఈ ప్రపంచంలోని అన్నింటినీ తనలో లయం చేసుకుని లయకారుడుగా భక్తులచే నిత్యం పూజలందుకుంటున్నాడు ఆ పరమేశ్వరుడు. మెడలో పాము, చేతిలో ఢమరుకంతో ఉండే ఈశ్వరుడు త్రిముర్తులలో ఒకరు. ఈ పరమేశ్వరుడు నిత్యం పులి చర్మంపైనే ధ్యాన ముగ్దుడౌతుంటారు.
అయితే ఈ భూమ్మిద ఎన్నో జంతువులుండగా అందులో కేవలం శివుడు పులి చర్మాన్నే ఎందుకు మెచ్చాడు? ఎందుకు దానిపైనే ధ్యానం చేస్తుంటారు? పురాణాల ప్రకారం.. ఈ పరమేశ్వరుడు ఏది చేసినా.. అందులో ఏదో అంతర్యం దాగుంటుందని పేర్కొంటున్నాయి. అందులోనూ శివుడి ఒంటిపై ఉండే ప్రతి దానికి ఎంతో అంతర్యం ఉందట. అదేంటో తెలుసుకుందాం పదండి..
ఢమరుకం: శబ్ధ బ్రహ్మ స్వరూపంగా ప్రతిష్టపొందితే, త్రిశూలం.. రజ, తమో, సత్వ గుణాలను తెలియజేస్తాయి. ఇకపోతే శివుడి దేహంపై ఉండే పాములు(సర్పాలు) భగవంతుడి జీవాత్మలుగా చెబుతారు. ఇక ఈశ్వరుని తలపై ఉండే చంద్రవంక గంగాదేవి శాశ్వతత్వానికి, మనో నిగ్రహానికి ప్రతీకలుగా చెబుతుంటారు.
పులిచర్మంపై కూర్చోవడానికి అర్థం.. మృగవాంఛకు దూరంగా ఉండమని. అలాగే ఏనుగు చర్మం ధరించడం వెనకున్న అంతర్యం అహంకారాన్ని వీడమని. ఇకపోతే శివుడి మూడో కన్ను జ్ఞానానికి, నంది ధర్మదేవతలకు, నందీశ్వరుడు సత్సాంగత్యానికి సూచికగా పురాణాలు పేర్కొంటున్నాయి.
పురాణాల ప్రకారం.. పులి చర్మాన్నే శివుడు ఎందుకు ఆసనంగా చేసుకున్నాడనే విషయంపై ఓ కథ కూడా ఉంది. అందేంటంటే.. ఆ పరమ శివుడు దిగంబరుడిగా శ్మశానాలు, అరణ్యాల్లో నిత్యం తిరుగుతూ ఉండేవారు. అయితే అలా ఓ నాడు అరణ్య మార్గం గుండా వెళుతున్న మునికాంతలు ప్రకాశవంతమైన తేజస్సుతో వెలిగిపోతున్న ఈశ్వరుడిని చూసారట. పరమేశ్వరుడి సౌందర్యానికి, తేజస్సును చూసిన ఆ మునికాంతలు నిత్యం అయన్నే చూడాలనే భావించేవారు. అంతేకాదు ఈ పరమేశ్వరుడిని తలచుకునే ఆ మునికాంతలు దైవ కార్యాలు, రోజువారి పనులను చేసేవారట. కాగా మునికాంతల్లో వచ్చిన మార్పుకు అసలు కారణం ఏంటన్న సంగతి ఆ మునులకు శివుడిని చూడగానే అర్థమైందట.
ఆ దిగంబరుడే పరమేశ్వరుడు అన్న సంగతి మర్చిపోయిన మునులు.. తమ భార్యల దృష్టి మార్చాడన్న కోపంతో శివుడిని సంహరించాలన్న ఆలోచన వారికి కలిగింది. అయితే మునులు స్వయంగా హింసకు పాల్పడరు కాబట్టి వారే వారి శక్తితో ఓ పులిని పుట్టించారు. కాగా ఆ పులిని శివుడు నిత్యం నడిచివెళ్లే దారిలో ఓ గొయ్యి తొవ్వి అందులో ఉంచారు. కాగా పరమేశ్వరుడు ఆ దారిలో గుంతకు సమీపంచడంతో ఆ మునులు పులిని శివుడిపైకి పురిగొల్పారు.
తనపై దాడికి ఎగిరిన ఆ పులిని పరమేశ్వరుడు సంహరించాడు. అంతేకాదు ఈ చర్య వెనకున్న మునుల ఆలోచనను గ్రహించి తాను సంహరించిన పులి చర్మాన్ని తన దిగంబర శరీరానికి దస్తువులా చుట్టుకున్నాడు. అయినా ఆ పరమేశ్వరుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని అంటుంటారు మరి ఈ పరమేశ్వరుడి ఆజ్ఞ లేనిదే పులి ఆయన్నెలా సంహరిస్తుంది చెప్పండి.
పులి సంహారకారి, పరాక్రమానికి ప్రతీకగా చెప్పుకుంటాం.అందులోనూ పులి మహా భయంకరి. అలాంటి పులి కూడా పరమేశ్వరుడిని ఏమీ చేయలేకపోయింది. ఏమీ చేయలేదు కూడా. అందులోనూ తన ఎదుట నిలవలేదు. కాలస్వరూనికి ఏదీ ఎదురు నిలవలేదని చెప్పడమే ఈ కథయొక్క సారాంశం.