పప్పు చారంటే చాలా మందికి ఇష్టం. వారంలో రెండు మూడు సార్లైనా పప్పు చారును చేస్తుంటారు. ముఖ్యంగా ఎండాకాలంలో. అయితే మనం పప్పు కూరకు కందిపప్పు, పెసరపప్పు అంటూ ఎన్నో రకాల పప్పులను ఉపయోగిస్తుంటాం. కానీ వాటిలో ఏది ఆరోగ్యానికి మంచి చేస్తుందని చాలా మందికి డౌట్ వస్తుంటుంది. అసలు ఏ పప్పును తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
కందిపప్పు ప్రయోజనాలు
బరువు పెరగడం
కొంత మంది ఎంత తిన్నా, ఏం తిన్నా బరువు కొంచెం కూడా పెరగరు. దీనివల్ల ఇక ఏం చేసినా బరువు పెరగం అని డిప్రెషన్ కు లోనవుతుంటారు. మీరు ఈజీగా బరువు పెరగాలంటే మాత్రం వారానికి ఒకసారి ఆవు వెన్నతో కందిపప్పును బాగా వేయించి నెయ్యితో కలిపి అన్నం తినండి చాలు. అవును దీనివల్ల మీరు బరువు పెరుగుతాయి. అలాగే ఇది మీ శరీరానికి బలాన్ని ఇవ్వడానికి కూడా సహాయపడుతుంది.
రక్తపోటు
ప్రస్తుత కాలంలో పెద్దలే కాదు పిల్లల, యువత అంటూ ప్రతిఒక్కరూ రక్తపోటు సమస్యలతో బాధపడుతున్నారు. అయితే కందిపప్పులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. కందిపప్పును తింటే రక్తపోటు తగ్గుతుంది. ఇది మీ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. కాబట్టి వారానికి ఒకసారైనా కందిపప్పును మీ రోజువారి ఆహారంలో చేర్చుకోండి.
ఇమ్యూనిటీ
కొంతమందికి ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఉంటుంది. అంటే దగ్గు, జలుబు, జ్వరాలు తరచుగా వస్తుంటాయి. శరీరంలో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నవారికే ఇలా ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తుంటుంది. అందుకే శరీరంలో రోగనిరోధక శక్తి బలంగా ఉండాలి. దీంతో మీకు ఏ వ్యాధి సోకదు. కందిపప్పులోని విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీన్ని తింటే శరీరంలో తెల్ల రక్త కణాల ఉత్పత్తి పెరిగి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.
శెనగపప్పు
కందిపప్పు మాదిరిగానే శెనగ పప్పును కూడా మనం ఎక్కువగా తింటుంటాం. అసలు మనం శెనగపప్పును తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
చర్మ సంరక్షణ
శెనగ పప్పును ఎక్కువగా తినేవారికి ఎలాంటి చర్మ వ్యాధులు రావని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ పప్పు మన చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే గజ్జి, దద్దుర్లు వంటి చర్మ వ్యాధుల నుంచి కూడా రక్షించడానికి సహాయపడుతుంది.
గుండె ఆరోగ్యం
ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మందికి గుండె సంబంధిత సమస్యలు వస్తున్నాయి. అయితే శెనగల్లో ఉండే పొటాషియం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీనిలోని పొటాషియం రక్తపోటును నియంత్రించడానికి బాగా సహాయపడుతుంది.శెనగల్లో ఉండే ఫైబర్ కంటెంట్ శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా నివారిస్తుంది. అలాగే గుండె జబ్బులు రాకుండా కూడా కాపాడుతుంది.
పెసర పప్పు
ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పును మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
జ్వరానికి మందు
పెసరపప్పు ఎన్నో అనారోగ్య సమస్యలు దివ్య ఔషదంలా పనిచేస్తుంది. మశూచి, చికెన్ పాక్స్ తో బాధపడేవారు పెసరపప్పును నానబెట్టిన నీటిని తాగొచ్చు. కలరా, మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలకు కూడా పెసరపప్పు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది
జ్ఞాపకశక్తి తక్కువగా ఉన్నవారికి పెసరపప్పు చాలా మంచిది. పెసర పప్పును వారానికి ఒకసారి బచ్చలికూరతో ఉడికించిన తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.
చర్మ సౌందర్యం
స్నానం చేసేటప్పుడు సబ్బుకు బదులు పెసరపప్పు పిండిని ఉపయోగించొచ్చు. పిండిని ఉపయోగిస్తే చర్మం మృదువుగా, అందంగా తయారవుతుంది. అలాగే చుండ్రు సమస్య ఉన్నవారికి కూడా పెసరపప్పు పిండి బాగా ఉపయోగపడుతుంది. దీన్ని జుట్టుకు పట్టించి స్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది.