అవీ.. ఇవీ కావు.. ఈ జ్యూస్ లు తాగండి.. చెడు కొలెస్ట్రాల్ ఇట్టే కరిగిపోతుంది..

First Published Sep 22, 2022, 10:50 AM IST

జీవన శైలి, ఆహారంలో కొన్ని మార్పులను చేసుకుంటే శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ఫాస్ట్ గా కరిగిపోతుంది. 
 

High Cholesterol

రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోవడం వల్ల గుండెపోటు, స్ట్రోక్ లతో సహా మరణానికి దారితీసే ఎన్నో రోగాలకు  కారణమవుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతే ఛాతిలో నొప్పి, తిమ్మిరి, మైకము,  అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతి భారంగా అనిపించడం, మాట్లాడటానికి రాకపోవడం, రక్తపోటు పెరగడం, కళ్లు మసకబారడం, కాలు దిగువ భాగంలో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. 

కొన్ని రకాల ఆహారాలను తీసుకుంటూ.. జీవన శైలిని మెరుగ్గా ఉంచుకుంటే శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తొందరగా కరిగిపోతుంది. కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ఎలాంటి పానీయాలు సహాయపడతాయో తెలుసుకుందాం పదండి. 

ఆపిల్ జ్యూస్

రోజుకో ఆపిల్ ను తింటే ఎలాంటి రోగాలు రావన్నముచ్చట చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే ఈ పండ్ల జ్యూస్ తో శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవచ్చు. ఈ జ్యూస్ లో పెక్టిన్ ఫైబర్, పాలీఫెనాల్ యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎల్ డి ఎల్ కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి. ఆపిల్స్ రక్త నాళాలు గట్టిపడటాన్ని నివారించడానికి కూడా సహాయపడతాయి. కాబట్టి ఆపిల్ జ్యూస్ ను తప్పక మీ డైట్ లో చేర్చుకోండి.

టొమాటో జ్యూస్

టొమాటో జ్యూస్ లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. టమోటాల్లో ఉండే లైకోపీన్ సమ్మేళనాలు లిపిడ్ స్థాయిలను మెరుగుపరుస్తాయి. అలాగే చెడు కొలెస్ట్రాల్ స్థాయిని కూడా తగ్గిస్తాయి. అంతేకాకుండా టమోటా జ్యూస్ లో ఉండే పీచు, నియాసిన్ కొలెస్ట్రాల్ ను నియంత్రించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. 

సిట్రస్ పండ్ల జ్యూస్

నారింజ, నిమ్మ, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ పండ్లు ఇమ్యూనిటీ పవర్ ను పెంచడమే కాదు.. కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గిస్తాయి. అందుకే ఈ పండ్ల రసాలను తాగుతూ ఉండండి. వీటిలో ఉండే పెక్టిన్ ఫైబర్, లిమోనాయిడ్ సమ్మేళనాలు రక్తనాళాలు గట్టిపడకుండా నిరోధిస్తాయి. దీతో ఎల్డిఎల్ స్థాయిలు తగ్గుతాయి. సిట్రస్ పండ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్లు గుండెపోటు,స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. కాబట్టి నిమ్మరసం, ఆరెంజ్ జ్యూస్, ద్రాక్ష రసాలను మీ ఆహారంలో చేర్చుకోండి. 

బొప్పాయి జ్యూస్

బొప్పాయి జ్యూస్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటునే కాదు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది. అందుకే బొప్పాయి జ్యూస్ ను కూడా మీ డైట్ లో చేర్చుకోండి. 

సోయా పాలు

సోయా పాలు కూడా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి. ఈ పాలలో సంతృప్త కొవ్వు తక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ చాలా వరకు తగ్గిపోతుంది.  గుండె సమస్యలు ఉన్నవారికి సోయా పాలు చాలా మంచివి. 
 

గ్రీన్ టీ

గ్రీన్ టీ బరువును తగ్గించడానికి  సహాయపడతుందని చాలా మందికి తెలుసు. అయితే ఈ గ్రీన్ టీ కొలెస్ట్రాల్ లెవెల్స్ ను కూడా తగ్గించడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే కాటెచిన్స్, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. గ్రీన్ టీ ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి కూడా సహాయపడుతుంది. 

click me!