relationship tips: ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ప్రేమలో పడతారు. ఇక ఆ సమయంలో ప్రేమికుల ఆనందానికి అవదులు ఉండవేమో. ప్రేమ నమ్మకంతోనే ముందుకు నడుస్తోంది. ఏ బంధంలోనైనా.. నమ్మకం, ఒకరిపై ఒకరికి చెప్పలేనంత ప్రేమ ఉండాలి. వారి తప్పులను కూడా స్వీకరించే గుణముండాలి.
కానీ ఈ రోజుల్లో ఏ బంధాలు చాలా కాలం కొనసాగడం లేదు. తక్కువ సమయంలోనే బ్రేకప్ అవుతున్నాయి. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి కొన్నిచెడు అలవాట్లే కారణం. ఒక వేళ మీ భాగస్వామికి ఈ చెడు అలవాట్లుంటే.. మీ లవ్ బలహీనపడటం మొదలవుతుంది. ఇంతకీ అవి ఎలాంటి అలవాట్లో తెలుసుకుందాం పదండి.
భాగస్వామిని కంట్రోల్ లో ఉంచడం.. మీ రిలేషన్ షిప్ లో ఇద్దరూ కలిసి నిర్ణయాలు తీసుకోవడం ఎంతో ఇంపార్టెంట్. అంతేకానీ మీ భాగస్వామిని మీ చెప్ప చేతల్లో ఉంచుకుని.. మీరు చెప్పినట్టే చేయాలి, వినాలి లాంటి నిబంధనలను పెట్టకూడదు. ఈ అలవాటు వల్ల మీ రిలేషన్ షిప్ బలహీనపడటం ప్రారంభమవుతుంది. కొంతమందైతే తమ భాగస్వామి ఏ దుస్తులు వేసుకోవాలి, ఏవి వేసుకోకూడదు, ఎవరితో ఎంత సమయం గడపాలి వంటి ప్రతి విషయంలో వారిని నియంత్రిస్తుంటారు. ఇలా చేస్తే మీ భాగస్వామికి మీపై ఉన్న ఇష్టం కాస్త.. అసహ్యంగా మారి బ్రేకప్ కు దారి తీస్తుంది.
ఒకరిపై ఆధారపడటం.. రిలేషన్ షిప్ అన్నాక అన్నీ పంచుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ మీరు ఏ పని చేయకుండా పూర్తిగా మీ భాగస్వామిపై ఆధారపడితే మాత్రం వారికి మీరు చులకన అవుతారు. వారు లేకుండా మీరు బతకలేరు అనే ఆలోచన వారికి కలుగుతుంది. అంతేకాదు ఈ విషయాన్ని పదేపదే మీకు గుర్తుచేస్తారు. ఇది మీరు విడిపోవడానికి కారణమవుతుంది.
నిఘా ఉంచడం.. భాగస్వామి పట్ల బాధ్యతగా ఉండటంలో ఎలాంటి తప్పూ లేదు. కానీ వారు సోషల్ మీడియాలో ఏం చూస్తున్నారు.. ఎంత సేపు గడుపుతున్నారు.. ఎవరెవరితో మాట్లాడుతున్నారు వంటి వాటిపై కన్నేసి ఉంచడం చెడ్డ అలవాటు. ఇది మీ ప్రేమ బంధాన్ని నాశనం చేస్తుంది.
హింస.. శారీరకంగా, మానసికంగా పెట్టే హింసలు ఏ బంధాన్నైనా ఇట్టే విడగొడతాయి. ఇది చెడ్డ అలవాటు కూడా. మీ భాగస్వామిని మానసికంగా హింసించడం లేదా శారీరకంగా బాధపెట్టడం వల్ల మీ బంధం చాలా తర్వగా ముగిసిపోతుంది.
పదేపదే బెదిరించడం.. కొంతమంది తమ భాగస్వామిని చిన్న చిన్న విషయాలకు కూడా గొడవ పడి.. విడిపోతా చూడు అంటూ బెదిరిస్తూ ఉంటారు. ఇదే మీ బంధాన్ని బలహీనం చేస్తుంది. అందుకే సాధ్యమైనంత వరకు ఇలాంటి బెదిరింపులకు పాల్పడకండి. ఇది ప్రేమ బంధాన్ని విడగొడుతుంది.