మణికరణ్‌లోని హాట్ స్ప్రింగ్స్‌లోకి బియ్యాన్ని నేరుగా పోయరు. బియ్యాన్ని ఒక గుడ్డ సంచిలో లేదా పలుచటి వస్త్రంలో కట్టి, ఆ మూటను వేడి నీటిలో ఉంచుతారు. నీటి నుంచి వచ్చే సహజమైన వేడి కారణంగా బియ్యం క్రమంగా ఉడికి అన్నంగా మారుతుంది.
అక్కడ నీళ్లు ఎందుకంత వేడిగా ఉంటాయి?
ఇది ఏ మాయాజాలం కాదు. భూమి లోపల ఉన్న వేడి కారణంగా భూగర్భ జలాలు వేడెక్కి పైకి రావడమే దీనికి కారణం. ఇలాంటి వాటినే geothermal లేదా thermal springs అంటారు. మణికరణ్‌లో ఒకవైపు చల్లటి పార్వతి నది ప్రవహిస్తుంటే.. దాని సమీపంలోనే భూమి నుంచి వేడి నీరు పైకి వస్తుంది. ఈ చల్లటి నది, వేడి నీటి ఊటలు ఒకే ప్రాంతంలో కనిపించడం కూడా మణికరణ్ ప్రత్యేకతల్లో ఒకటి కావడం గమనార్హం.
మణికరణ్‌లో ప్రసిద్ధ మణికరణ్ సాహిబ్ గురుద్వారా ఉంది. ఇక్కడి సహజ వేడి నీటి ఊటలను లంగర్‌లో ఆహారం తయారు చేయడానికి ఉపయోగిస్తారు. భారత ప్రభుత్వ పర్యాటక వెబ్‌సైట్ కూడా గురుద్వారాలోని లంగర్ కోసం ప్రధానంగా అన్నం వంటి ఆహారాన్ని ఈ సహజ హాట్ స్ప్రింగ్స్ సహాయంతో తయారు చేస్తారని పేర్కొంది. ఇదే ప్రాంతంలో హిందూ ఆలయాలు కూడా ఉన్నాయి. అందుకే మణికరణ్ హిందువులు, సిక్కులు ఇద్దరికీ ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రదేశంగా గుర్తింపు పొందింది.
ఒకే చోట చల్లటి నది.. మరిగేంత వేడి నీరు..
మణికరణ్‌ను ప్రత్యేకంగా నిలబెట్టేది ఇదే. ఒకవైపు మంచు పర్వతాల మధ్య పార్వతి నది ప్రవహిస్తుంటే.. మరోవైపు భూమి నుంచి అత్యంత వేడి నీరు బయటకు వస్తుంది. ఆ నీటితోనే బియ్యం ఉడికించి అన్నం తయారు చేయడం చూసినప్పుడు ఇది నిజంగా ప్రకృతి అద్భుతంలా అనిపిస్తుంది. అయితే ఇక్కడి వేడి నీటి ఊటల్లో నేరుగా చేతులు పెట్టడం లేదా స్వయంగా వండేందుకు ప్రయత్నించడం ప్రమాదకరం. అధికారిక సమాచారం ప్రకారం నీరు చాలా వేడిగా ఉంటుంది.