ఇంకొక రోజులో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. నూతన సంవత్సరం అంటే కొత్త విషయాలే గుర్తుకు వస్తాయి. కొత్త సంకల్పాలు, కొత్త అలవాట్లు, ఇలా జీవితాన్ని మార్చుకోవడానికి కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి నూతన సంవత్సరం మంచి అవకాశం. పాజిటివ్ ఆలోచనలతో జీవితంలో మంచి ఫలితాలు పొందొచ్చు. కొత్త విషయాలు ప్రారంభించడానికి అనువైన నూతన సంవత్సరంలో ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
నూతన సంవత్సరంలో సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించడం, మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామం, యోగా వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను అలవాటు చేసుకోవాలి. ఏ అలవాట్లను ఎలా పాటిస్తే జీవితంలో మార్పులు తీసుకురావచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
2025 ఆరోగ్య చిట్కాలు
స్క్రీన్ టైమ్ తగ్గించడం:
మీరు మొబైల్, కంప్యూటర్ వంటివి ఎక్కువ సమయం వినోదం కోసం వాడుతుంటే దాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి. స్క్రీన్ టైమ్ ఎక్కువైతే ఉపయోగకరమైన పనులకు సమయం దొరకదు. రాత్రి పడుకోవడానికి కనీసం 30 నిమిషాల ముందు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో సమయం గడపడాన్ని తగ్గించండి. ఇలా చేయడం వల్ల మీ ఒత్తిడి తగ్గుతుంది. ఏకాగ్రత లోపించదు. మంచి నిద్ర సొంతమవుతుంది.
ఆహారపు అలవాట్లు:
మీరు బయట తినేవారైతే ఇంట్లో వండిన ఆహారం తినడానికి ప్రయత్నించండి. ఫాస్ట్ ఫుడ్ తినడం తగ్గించి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. మంచి ఆహారపు అలవాట్లు మీ శరీరాన్ని, మనసును ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. ఆరోగ్యవంతులు సంతోషంగా ఉంటారు. కాబట్టి ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్‌లకు దూరంగా ఉండండి.
ఒత్తిడి తగ్గించుకోవడానికి!
ఒత్తిడి లేని జీవితం గడపడం చాలా ముఖ్యం. మీ ఒత్తిడిని తగ్గించుకోవడానికి కొత్త అలవాట్లను అలవర్చుకోండి. మీ జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి, మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రతిరోజూ యోగా, ధ్యానం చేయండి. ఇప్పటి నుంచైనా డైరీ రాసే అలవాటు చేసుకోండి. ఈరోజు చేసిన తప్పులను రేపు మళ్లీ చేయకుండా చూసుకోండి.
స్నేహితులను కలవడం:
మిమ్మల్ని ప్రేమించే స్నేహితులను మీ చుట్టూ ఉంచుకోండి. సంవత్సరానికి ఒకసారి స్నేహితులను కలిసే బదులు తరచుగా కలిసి మాట్లాడటం అలవాటు చేసుకోండి.
నిద్ర:
మంచి నిద్ర మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. బాగా నిద్రపోయేవారికి ఒత్తిడి తక్కువగా ఉంటుంది. వారు సంతోషంగా ఉంటారు. ఉత్సాహంగా ఉండటానికి రాత్రి బాగా నిద్రపోవడం అవసరం. కాబట్టి స్క్రీన్ టైమ్ తగ్గించి త్వరగా పడుకోవడం మంచిది. ఈ అలవాటును నూతన సంవత్సరం నుండి ప్రారంభించండి. కచ్చితంగా మీ జీవితంలో మార్పు వస్తుంది.