అమెరికాలో దొంగతనం చేసిన భారతీయ మహిళ ఘటనపై యూఎస్ అధికారులు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. చట్టాలు ఉల్లంఘిస్తే భవిష్యత్తులో వీసా రద్దు చేసే అవకాశం ఉందన్నారు.
అగ్రరాజ్యం అమెరికాలో చట్టాలు ఎంత కఠినంగా అమలు చేస్తున్నారో తెలిసిన విషయమే. ముఖ్యంగా నేరాల విషయంలో , విదేశీయుల విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తారు. తాజాగా ఇలినాయిస్ రాష్ట్రంలో చోటుచేసుకున్న ఒక ఘటన దానికి ఉదాహరణగా నిలిచింది.
భారతదేశానికి చెందిన ఓ మహిళ, పర్యాటక వీసాతో అమెరికా వెళ్లింది. అయితే ఆమె అక్రమంగా ఒక స్టోర్ నుంచి సుమారు 1,300 డాలర్ల విలువైన వస్తువులను దొంగలించడానికి ప్రయత్నించారు.
26
న్యాయపరంగా శిక్ష
స్థానిక స్టోర్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండటం గమనించిన సెక్యూరిటీ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమె వాహనాన్ని తనిఖీ చేయగా, దొంగిలించిన వస్తువులు అందులో బయటపడ్డాయి.ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు, బాడీక్యామ్ ద్వారా మొత్తం సంఘటనను వీడియోలో రికార్డు చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో ఆమె పోలీసులను వేడుకుంటూ.. వస్తువుల ధర చెల్లిస్తానని చెబుతుండగా, అధికారులు ఆమె చేసిన పనికి న్యాయపరంగా శిక్ష పడాల్సిందే అని తేల్చి చెప్పారు.
36
వీసా రద్దు
ఈ ఘటన నేపథ్యంలో అమెరికాలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. అమెరికాలో దాడులు, దొంగతనాలు, దోపిడీలకు పాల్పడితే చట్టపరంగా మాత్రమే కాకుండా వీసా రద్దు కావచ్చు, భవిష్యత్తులో అమెరికాలోకి ప్రవేశానికి అనర్హత రావచ్చు అనే హెచ్చరికను విడుదల చేసింది. అమెరికా చట్టాలను గౌరవించడం విదేశీయుల బాధ్యత అని, చట్టాన్ని ఉల్లంఘిస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు.
ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ.. భారత పౌరులు ఎక్కడ ఉన్నా అక్కడి చట్టాలను గౌరవించడం అవసరం అన్నారు. విదేశాలకు వెళ్లే వ్యక్తులు స్థానిక నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మన ప్రవర్తన దేశ ప్రతిష్టకు ప్రతిబింబమవుతుందని ఆయన అన్నారు.ఈ ఘటన ఒకసారి గుర్తు చేస్తున్న విషయం ఏమిటంటే.. అమెరికాలో ప్రస్తుతం ఇమ్మిగ్రేషన్ సంబంధిత నియమాలు కఠినంగా అమలు చేస్తున్నారు. ట్రంప్ పరిపాలన కాలం నుంచి మొదలైన ఈ కఠిన విధానాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. 2025 జనవరి నుండి ఇప్పటివరకు 1.42 లక్షల మందిని అమెరికా నుంచి బహిష్కరించిందని అధికార గణాంకాల ప్రకారం తెలుస్తోంది.
56
సోషల్ మీడియా ప్రొఫైల్స్
అంతేకాకుండా, వీసా దరఖాస్తులపై అమెరికా ప్రభుత్వం మరింత నిఖార్సైన పరిశీలన చేపడుతోంది. అభ్యర్థుల సోషల్ మీడియా ప్రొఫైల్స్ నుంచి క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ చెక్‌ల వరకు అన్ని కోణాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.వీటన్నింటినీ పరిశీలిస్తే, అమెరికాలో ఏ చిన్న నేరమైనా తీవ్రంగా పరిగణించబడుతోంది. ముఖ్యంగా విదేశీయులపై మరింత ఆంక్షలు విధిస్తూ, భవిష్యత్తులో కూడా అదే దేశంలోకి మళ్లీ ప్రవేశించేందుకు వీలుండకుండా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు.
66
ఇమిగ్రేషన్ ఫైల్‌పై చెడు రికార్డు
విదేశీ ప్రయాణాల్లో చట్టాలు ఎంత ముఖ్యమో, అవి ఎంతటివరకు మన భవిష్యత్తుపై ప్రభావం చూపగలవో మనం అర్థం చేసుకోవాలి. ఒక చిన్న తప్పు చేసినా.. అది పాస్‌పోర్ట్, వీసా, ఇమిగ్రేషన్ ఫైల్‌పై చెడు రికార్డుగా నిలిచే ప్రమాదం ఉంటుంది.భారతీయ పౌరులందరికీ ఈ సంఘటన గమనిక. ప్రయాణించే ముందు ఆ దేశ నిబంధనలు, నైతిక ప్రమాణాలు, న్యాయ వ్యవస్థను గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లభించిన అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందే కానీ, చట్టాలను ఉల్లంఘిస్తే దాని మూల్యం పెద్దదిగా ఉండే అవకాశం తప్పదు.