Sunil Chhetri: ఛెత్రి రికార్డ్ గోల్.. మెస్సీకి రెండడుగుల దూరంలో..

First Published | Jun 15, 2022, 6:34 PM IST

Sunil Chhetri: ఇండియా ఫుట్బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ మ్యాచులలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో టాప్-5కు చేరాడు. 
 

భారత ఫుట్బాల్ దిగ్గజం సునీల్ ఛెత్రి అరుదైన ఘనత సాధించాడు. ఆసియా కప్ లో భాగంగా బుధవారం హాంకాంగ్ తో  జరిగిన మ్యాచ్ లో గోల్ కొట్టడం ద్వారా అంతర్జాతీయ కెరీర్ లో అత్యధిక గోల్స్ కొట్టిన  నాలుగో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. 
 

హాంకాంగ్ తో మ్యాచ్ లో ఆట 45వ నిమిషంలో గోల్ కొట్టిన ఛెత్రి.. అంతర్జాతీయ స్థాయిలో 84వ గోల్ నమోదు చేశాడు. దీంతో అతడు.. హంగేరి ఫుట్బాల్ దిగ్గజ ఆటగాడు ఫెరెన్క్ పుస్కాస్ (84 గోల్స్) ను సమం చేశాడు. 


అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాళ్ల జాబితాను పరిశీలిస్తే.. పోర్చుగల్  సాకర్ దిగ్గజం  క్రిస్టియానో రొనాల్డో 117 గోల్స్ తో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు.

ఆ తర్వాత ఇరాన్  మాజీ ఆటగాడు అలీ దాయి (109 గోల్స్),  మలేషియాకు చెందిన మొఖ్తర్ దహరి (89 గోల్స్) రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.  అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లియోనల్ మెస్సీ.. 86 గోల్స్ తో ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. 

మెస్సీ తర్వాత ఛెత్రి, ఫుస్కాస్ లు.. 84 గోల్స్ తో ఐదో స్థానంలో నిలిచారు. కాగా మరో రెండు గోల్స్ కొడితే ఛెత్రి.. మెస్సీతో సమానంగా నిలుస్తాడు. ఇదిలాఉండగా.. ప్రస్తుతం టాప్-5లో ఉన్నవారిలో రొనాల్డో, మెస్సీ, ఛెత్రి తప్ప మిగిలిన ఇద్దరు మాజీ ఆటగాళ్లే. ఆ రకంగా చూస్తే  ఛెత్రి టాప్-3 లో ఉన్నట్టే లెక్క.  

Sunil Chhetri

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఆసియా కప్ గ్రూప్-డి క్వాలిఫయర్స్ లో భాగంగా హాంకాంగ్ తో ముగిసిన మ్యాచ్ లో  భారత జట్టు ప్రత్యర్థిని మట్టికరిపించింది.  ఆట రెండో నిమిషంలోనే అన్వర్ అలీ తొలి గోల్ సాధించగా.. 45వ నిమిషంలో ఛెత్రి, 85వ నిమిషంలో మన్వీర్ సింగ్ చేశారు. 
 

చివరగా ఇషాన్ పండిట్ గోల్ సాధించి భారత జట్టును 4-0 ఆధిక్యంలో నిలిపాడు. ఫలితంగా భారత జట్టు ఆసియా కప్ 2023 టోర్నీకి అర్హత సాధించినట్టైంది.

Latest Videos

click me!