రండి బాబు రండి.. రొనాల్డోకు వండిపెడితే నెలకు రూ. 4.5 లక్షలు..

First Published | Jan 21, 2023, 3:51 PM IST

Cristiano Ronaldo: సాకర్ దిగ్గజం  క్రిస్టియానో రొనాల్డో ప్రపంచంలో  ఉన్న చెఫ్ లకు బంపరాఫర్ ఇచ్చాడు.  తనకు నచ్చిన వంటలు వండిపెడితే  సదరు వంటగాళ్లకు ఆకర్షణీయమైన జీతమిస్తామనని  ప్రకటించాడు.. 

పోర్చుగల్  స్టార్,  ఆధునిక ఫుట్‌బాల్  దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో ఇంట వంటమనిషి   అవసరమయ్యాడట. కొద్దికాలం క్రితం నుంచే రొనాల్డో తన కుటుంబానికి వండిపెట్టేందుకు గాను   ఒక మాస్టర్ చెఫ్ కావాలని చాలాకాలం నుంచి వెతుకుతున్నా సరైన  పాకశాస్త్ర నిపుణుడు దొరకడం లేదని  రొనాల్డో తెగ బాధపడుతున్నాడట.. 

పోర్చుగల్ లోని క్వింటా డా లో రొనాల్డో  సుమారు రూ. 170 కోట్లతో అన్ని హంగులతో  ఓ  భవనాన్ని  కట్టిస్తున్నాడు.  2023 జూన్ వరకు ఆ ఇంటి నిర్మాణం పూర్తి కానుంది. రిటైర్మెంట్ తర్వాత తన పార్ట్నర్  జార్జినా రొడ్రిగెజ్,  నలుగురు పిల్లలతో కలిసి రొనాల్డో అక్కడే ఉండనున్నాడు. 


అయితే ఈ ఇంట్లో తనకు కావాల్సిన  వంటకాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా అన్ని వంటలు తెలిసిన  మాస్టర్ చెఫ్ కోసం రొనాల్డో చాలాకాలంగా వెతుకుతున్నాడు.  వంటమనిషికి   నెలకు సుమారు  4,500 పౌండ్లు (భారత కరెన్సీలో  సుమారు రూ. 4.5 లక్షలు) ఇస్తానని చెప్పినా ఎవరూ ముందుకు రావడం లేదట.  మరి జూన్ వరకైనా రొనాల్డోకు   సకల వంటలు తెలిసిన  చెఫ్ దొరుకుతాడో లేదో చూడాలి. 

ఇక   ఫిఫా  ప్రపంచకప్ లో క్వార్టర్స్ లోనే పోర్చుగల్ ఇంటిముఖం పట్టినా  రొనాల్డోకు ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు.  ఇప్పటికీ ఇన్‌స్టాగ్రామ్ లో అతడే కింగ్. అత్యధిక ఫాలోవర్లు కలిగిన  వ్యక్తిగా రొనాల్డో  అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 

రొనాల్డోకు ఉన్న క్రేజ్  దృష్ట్యా  అతడిని సౌదీ అరేబియాకు చెందిన అల్ నజర్   భారీగా వెచ్చించి  సొంతం చేసుకుంది.  రెండున్నరేండ్లకు గాను  సుమారు రూ. 3,500 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తున్నది. 

కొద్దికాలం క్రితమే సౌదీలో ల్యాండ్ అయి ప్రస్తుతం కుటుంబంతో పాటు అక్కడే ఉంటున్న రొనాల్డో.. జనవరి 22 నుంచి అల్ నజర్ తరఫున ఆడనున్నాడు. ఈ ఏడాది మే వరకూ  రొనాల్డో  సౌదీలోనే ఉంటాడు. ఆ తర్వాతే   పోర్చుగల్ కు వెళ్తాడు. అప్పటివరకు పోర్చుగల్ లో తన కొత్త ఇంటిని రెడీ చేసుకుని   చెఫ్ ను కూడా  రెడీ చేసుకోవాలని రొనాల్డో భావిస్తున్నాడట.. 

Latest Videos

click me!