చరిత్ర పరంగా పరిశీలిస్తే శంభాల అనే పేరుతో ఉన్న నగరం లేదా రాజ్యం ఉందని నిర్ధారించే ఎలాంటి పురావస్తు ఆధారాలు ఇప్పటివరకు లేవు. భారత చరిత్రలో ఉన్న నగరాలు, రాజ్యాల గురించి శాసనాలు, నాణేలు, పురావస్తు అవశేషాలు లభిస్తాయి. కానీ శంభాల విషయంలో ఎలాంటి స్పష్టమైన ఆధారాలు కనిపించలేదు. అయితే కొన్ని గ్రామాలు, ప్రాంతాలకు శంభాల, శంబల్, శంబలపూర్ వంటి పేర్లు ఉన్నాయి. ఇవన్నీ శంభాల నుంచి పుట్టినవే అని భావిస్తారు. ఒడిశాలోని శంబల్పూర్, ఉత్తర భారతంలోని కొన్ని ప్రాంతాలకు కూడా ఈ నగరం పేరు ఉంది. అయితే వీటితో పురాణాల్లో చెప్పిన శంభాలతో నేరుగా సంబంధం ఉందని చెప్పలేమని స్పష్టం చేస్తున్నారు.
మొత్తంగా చూస్తే శంభాల నగరం భారత చరిత్రలో ఉన్నట్టు ఎక్కడా ఆధారాలు లేవు. భారత పురాణాలు, బౌద్ధ సాహిత్యం శంభాలను ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా మాత్రమే చూపిస్తున్నాయి. శంభాల అనేది మనకు ధర్మం, న్యాయం, శాంతి విలువలను గుర్తు చేసే ఒక ప్రతీక నగరం. అందుకే శంభాల నగరం చరిత్రలో కనిపించకపోయినా, భారతీయ సాంస్కృతిక భావజాలంలో అది ఇప్పటికీ జీవించే ఉంటుంది.