మనం సాధారణంగా మాట్లాడేటప్పుడు లేదా ఏదైనా శబ్దం చేసినప్పుడు ఆ ధ్వని తరంగాలు గోడలకు తగిలి వెనక్కి (Echo) వస్తాయి. కానీ ఈ గదిలోకి వెళ్తే 99.99% శబ్దం పీల్చుకుంటుంది. అంటే అక్కడ ఎలాంటి 'ఎకో' లేదా ప్రతిధ్వని ఉండదు. మీరు అక్కడ ఎంత గట్టిగా అరిచినా ఆ శబ్దం గాలిలోనే మాయమైపోతుంది. మరి, ఈ గదిని ఎందుకు నిర్మించారు అనే అనుమానం మీకు రావచ్చు. విమానాలు, మొబైల్ మైక్రోఫోన్లు, స్పీకర్లు మెడికల్ పరికరాల శబ్ద నాణ్యతను అత్యంత ఖచ్చితత్వంతో టెస్టింగ్ చేయడం కోసం సైంటిస్టులు ఈ గదిని ఉపయోగిస్తారు.
ఈ గదిని ఎలా నిర్మించారు?
బయట ఉన్న ఎలాంటి ధ్వని, వైబ్రేషన్స్ లోపలికి రాకుండా దీనిని ఒక "రూమ్ ఇన్ ఎ రూమ్" (Room within a room) మోడల్లో నిర్మించారు. కాంక్రీట్, మందపాటి స్టీల్ గోడలతో బయటి గదిని కట్టారు. లోపలి గదిని బయటి గోడలకు తాకకుండా, భారీ ప్రకంపనలను పీల్చుకునే పెద్ద స్ప్రంగ్లపై గాలిలో తేలియాడేలా నిలబెట్టారు. గోడలు, సీలింగ్ ,నేలపై దాదాపు 3 అడుగుల పొడవున్న ఫైబర్గ్లాస్ ఆకారపు శోషకాలను (Wedges) అమర్చారు. నేల మీద నడిచే శబ్దం కూడా వినపడకుండా నేలపై నెట్ మాత్రమే ఉంటుంది.
మన గుండె చప్పుడు మాత్రమే వినపడుతుందా?
ఈ గదిలో బాహ్య శబ్దాలు ఏవీ లేకపోవడంతో, మన చెవులు లోపలి శబ్దాలపై దృష్టి పెడతాయి. మీ గుండె నార్మల్ గా కొట్టుకున్నా కూడా పెద్ద డ్రమ్స్ వాయించినట్లుగా మీ చెవులకు వినపడుతుంది. అంతేకాదు, నరాల్లో రక్తం ప్రవహించే శబ్దం,ఊపిరితిత్తులు గాలి పీల్చే శబ్దం కూడా స్పష్టంగా వినిపిస్తాయి. అంతెందుకు మీ కనురెప్పలు వేస్తే వచ్చే చిన్నపాటి శబ్దం కూడా మీ చెవులకు స్పష్టంగా తెలుస్తుంది.
ఈ గదిలో ఎవరూ ఎక్కువసేపు ఎందుకు ఉండలేరు?
సాధారణంగా ఎవరైనా ఈ గదిలో లైట్లు ఆపి కూర్చుంటే 45 నిమిషాలకు మించి ఉండలేరు. దీని వెనక కూడా కారణాలు ఉన్నాయి. మనం నిలబడటానికి లేదా నడవడానికి మన చెవులు, కళ్ళు పంపే శబ్ద ప్రతిధ్వనుల సమాచారం పైనే బ్రెయిన్ ఆధారపడుతుంది. ఈ గదిలో శబ్ద సంకేతాలు శూన్యమవ్వడంతో మనుషులకు మైకం వచ్చి నిలబడలేక కూలిపోతారు. శరీర అంతర్గత శబ్దాలు తీవ్రంగా వినబడటం వల్ల మెదడు కంగారుపడుతుంది. నిశ్శబ్దం ఎక్కువయ్యే కొద్దీ పిచ్చి పట్టినట్లు అనిపిస్తుంది, భయానక దృశ్యాలు లేదా శబ్దాలు ఉన్నట్లు భ్రమలు కలుగుతాయి. అందుకే, ఈ గదిలో ఎవరూ ఎక్కువసేపు ఉండలేరు.