Costly tea: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీ ఆకులు లేదా పొడి గురించి మీకు తెలుసా? సామాన్యులు కలలో కూడా దీన్ని కొని తాగలేరు. అంబానీ వంటి బిలియనీర్లు మాత్రమే దీన్ని కొనగలరు. ఒక కిలో టీ పొడి ఏకంగా పది కోట్ల రూపాయలు.
టీ తాగనిదే మన దేశంలో ఎంతో మందికి తెల్లవారదు. మనం తాగే టీ పొడి కిలో అయిదు వందల రూపాయల కన్నా ఎక్కువ ఉండదు. కానీ ప్రపంచంలో అత్యంత ఖరీదైన టీ పొడి ఒకటుంది. దాన్ని కేవలం బిలియనీర్లు మాత్రమే కొని తాగగలరు. ఈ టీ పొడి చైనాలో తయారవుతుంది. దీని పేరు డా హాంగ్ పావో. చైనాలోని ఫుజియాన్ ప్రాంతంలో ఉన్న వుయి కొండల్లో మాత్రమే ఈ అరుదైన టీ చెట్లు పెరుగుతాయి. ఈ కొండల్లోని వాతావరణం, నేల స్వభావం వల్ల ఈ ఆకులకు ప్రత్యేకమైన రుచి, మంచి సువాసన వస్తాయి. ఇవి సాధారణ టీ ఆకుల కంటే ఎంతో భిన్నంగా, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనవంతులు, టీ ప్రియులు దీనిని కొనడానికి ఎంతో ఆసక్తి చూపిస్తారు.
23
టీ పొడి ప్రత్యేకత ఏంటి?
ఈ టీ పొడికి ఇంత విలువ రావడం వెనుక ఒక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. పూర్వం చైనాను పరిపాలించిన మింగ్ రాజవంశం కాలంలో ఒక చక్రవర్తి తల్లి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఎందరో వైద్యులు చికిత్స చేసినా ఆమె ఆరోగ్యం కుదుటపడలేదు. చివరికి వుయి కొండల్లో దొరికే ఈ ప్రత్యేక టీ ఆకులతో తయారుచేసిన కషాయాన్ని ఆమెకు తాగించారు. ఆశ్చర్యకరంగా ఆమె వ్యాధి పూర్తిగా నయమై ఆరోగ్యంగా మారారు. దీంతో ఎంతో సంతోషించిన చక్రవర్తి, ఆ టీ చెట్లకు కృతజ్ఞతగా ఎర్రటి రాజ వస్త్రాలను కప్పించి గౌరవించారు. అప్పటి నుంచి ఈ టీకి డా హాంగ్ పావో అనే పేరు స్థిరపడింది. చైనీస్ భాషలో దీనికి పెద్ద ఎర్రటి వస్త్రం అని అర్థం.
33
ఆరు చెట్లు మాత్రమే ఉన్నాయి
ప్రస్తుతం ఈ అసలైన పురాతన తల్లి చెట్లు ప్రపంచంలో కేవలం ఆరు మాత్రమే మిగిలి ఉన్నాయి. వీటి వయసు వందల సంవత్సరాల కంటే ఎక్కువే. వీటికి ఉన్న చారిత్రక ప్రాధాన్యత, అరుదైన గుణాల వల్ల చైనా ప్రభుత్వం వీటిని ఎంతో జాగ్రత్తగా కాపాడుతోంది. 2006వ సంవత్సరంలో ఈ అసలైన చెట్ల నుంచి ఆకులను కోయడాన్ని ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. అంతకుముందు సేకరించిన కొద్దిపాటి పాత నిల్వలు మాత్రమే ఇప్పుడు వేలంలో కోట్ల రూపాయలకు అమ్ముడవుతున్నాయి. కేవలం ఒక గ్రాము టీ పొడి కొనాలన్నా లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇంతటి అరుదైన లక్షణాలు ఉండటం వల్లే దీనిని లిక్విడ్ గోల్డ్ అని కూడా పిలుస్తుంటారు.