ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత వారి ఏటీఎం కార్డు, నెట్ బ్యాంకింగ్ వంటివి ఉపయోగించి బ్యాంక్ అకౌంట్ లోంచి డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చా…? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ ఏం చెబుతున్నాయి?
వయసు మీదపడి ఇంట్లోని పెద్దవాళ్లు లేదంటే అనారోగ్యం లేదా ప్రమాదాల బారినపడి కుటుంబసభ్యులు ఎవరైనా చనిపోతే వారి బ్యాంక్ అకౌంట్లోని డబ్బులు కుటుంబసభ్యులు తీసుకుంటారు. బ్యాంకులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఏటిఎం లేదా ఇంటర్నెట్ బ్యాకింగ్ ఉపయోగించి అకౌంట్లోని డబ్బులన్ని విత్ డ్రా చేసుకుంటారు. ఇలా చేయడం లీగలా లేక ఇల్లీగలా? ఈ డౌట్ చాలామందికి ఉంటుంది. దీన్ని ఇప్పుడు నివృత్తి చేసుకుందాం.
24
బ్యాంకింగ్ రూల్స్ ఏం చెబుతున్నాయి?
ఇంట్లోని పెద్దవాళ్లు తమ ఏటీఎం కార్డు, పిన్ నంబర్‌ను కుటుంబ సభ్యులతో పంచుకోవడం సాధారణమే. వాళ్లు బతికున్నంత వరకు ఇది పెద్ద సమస్య కాదు. కానీ ఖాతాదారుడు చనిపోయాక కూడా అదే కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ వాడితే తెలియని చట్టపరమైన చిక్కులు వస్తాయి.
బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం… ఒక వ్యక్తి చనిపోగానే వారి బ్యాంక్ అకౌంట్ పై హక్కులు మారిపోతాయి. వారి ఏటీఎం కార్డు, నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ వాడటం చట్టపరంగా తప్పు అవుతుంది. ఎందుకంటే ఆ ఖాతాలోని డబ్బు కేవలం ఒక్కరికి కాకుండా, చట్టపరమైన వారసులు అందరికీ చెందింది.
34
నామినీ తీసుకోవచ్చా..?
చాలామంది చేసే పొరపాటు 'నేను నామినీ కాబట్టి డబ్బులు తీసుకోవచ్చు' అని అనుకోవడం. కానీ నామినీగా ఉన్నంత మాత్రాన సరిపోదు. ముందుగా బ్యాంకు అధికారులకు ఖాతాదారుడి మరణవార్త తెలిపి అవసరమైన పత్రాలు సమర్పించాలి. ఈ ప్రక్రియ పాటించకుండా ఏటీఎం నుంచి డబ్బు తీస్తే అది చట్టరిత్యా నేరం… దీనిపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే అది మోసం కిందకు వస్తుంది.
ఇలాంటి నిబంధనల వెనుక ఉన్న ఉద్దేశం చనిపోయిన వ్యక్తి డబ్బును సురక్షితంగా ఉంచడమే. ఒకే కుటుంబంలో చాలామంది చట్టపరమైన వారసులు ఉండొచ్చు. వారి హక్కులకు భంగం కలగకుండా ఉండేందుకే బ్యాంకులు మరణ ధృవీకరణ పత్రం, నామినీ వివరాలు, ఇతర పత్రాలను పరిశీలించాకే డబ్బును విడుదల చేస్తాయి. ఇది భవిష్యత్తులో కుటుంబ కలహాలను, చట్టపరమైన సమస్యలను నివారిస్తుంది.
కుటుంబంలో ఎవరైనా చనిపోతే బ్యాంక్ అధికారులకు సమాచారం ఇవ్వకుండా ఎట్టి పరిస్థితుల్లో వారి ఏటీఎం లేదా యూపీఐ వాడొద్దు. ముందుగా బ్యాంకుకు రాతపూర్వకంగా సమాచారం ఇచ్చి క్లెయిమ్ ఫారమ్, ఇతర పత్రాలు సమర్పించాలి. సరైన పద్ధతి పాటిస్తే, డబ్బు సురక్షితంగా అందుతుంది, అనవసరమైన చట్టపరమైన చిక్కులు కూడా రావు.