Weekend : శని, ఆదివారాలు కాదు.. ఈ దేశాల్లో వీకెండ్ సెలవులు ఎప్పుడో తెలుసా?

Published : Oct 24, 2026, 10:15 AM IST

భారతదేశంలో శని, ఆదివారాలు వీకెండ్. కానీ కొన్ని దేశాల్లో వారంలోని ఇతర రోజుల్లో సెలవులు ఉంటాయి. ఇలా మూడు రోజుల వీకెండ్‌తో పాటు ప్రపంచ దేశాల ప్రత్యేక సెలవు విధానాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
ఈ దేశాల్లో వీకెండ్ ఎప్పుడో తెలుసా?

Weekend Holidays : వారమంతా ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువులతో బిజీగా గడిపే చాలామంది వీకెండ్ కోసం ఎదురుచూస్తుంటారు. శనివారం, ఆదివారం (వారాంతం) సెలవుల్లో కుటుంబంతో గడపాలని, స్నేహితులతో బయటకు వెళ్లాలని లేదా ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలని ప్లాన్ చేసుకుంటారు. మన దేశంలో సాధారణంగా ఈ రెండు రోజులను వారాంతపు సెలవులుగా పరిగణిస్తారు.

అయితే ప్రపంచంలోని అన్ని దేశాల్లో వీకెండ్ విధానం ఒకేేలా ఉండదు. కొన్ని దేశాల్లో శుక్ర, శనివారాలు వీకెండ్ కాగా, మరికొన్ని దేశాల్లో ఒక్కరోజే వారాంతపు సెలవు ఉంటుంది. మతపరమైన సంప్రదాయాలు, స్థానిక సంస్కృతి, ప్రభుత్వ విధానాలు, వ్యాపార అవసరాలను బట్టి ఈ సెలవుల విధానం మారుతూ ఉంటుంది. మరి ఏయే దేశాల్లో వీకెండ్ ఎప్పుడు ఉంటుందో తెలుసుకుందాం.

25
వీకెండ్ అంటే ఏమిటి?

వీకెండ్ (Weekend) అంటే వారాంతం. సాధారణంగా ఒక పని వారం ముగిసిన తర్వాత వచ్చే విశ్రాంతి రోజులను ఈ పేరుతో పిలుస్తారు. భారత్‌తో పాటు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి అనేక దేశాల్లో శనివారం, ఆదివారం వారాంతపు సెలవులుగా అమల్లో ఉన్నాయి.

వీకెండ్ సెలవుల ప్రధాన ఉద్దేశం ఉద్యోగులు, కార్మికులకు విశ్రాంతి కల్పించడం, కుటుంబంతో గడిపేందుకు సమయం ఇవ్వడం, వ్యక్తిగత అవసరాలు తీర్చుకునే అవకాశం కల్పించడం. అయితే ఈ సెలవులు ఏ రోజుల్లో ఉండాలనే విషయంలో ప్రపంచ దేశాలు ఒకే విధానాన్ని అనుసరించడం లేదు.

35
శుక్ర, శనివారాలు వీకెండ్‌గా పాటించే దేశాలివే...

సౌదీ అరేబియా, ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమన్ వంటి పలు గల్ఫ్ దేశాల్లో శుక్ర, శనివారాలు వారాంతపు సెలవులుగా పాటిస్తారు. ఇస్లాంలో శుక్రవారానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది... ఆ రోజు జరిగే జుమ్మా (సామూహిక ప్రార్థన) లో పాల్గొనేందుకు వీలుగా ఈ విధానం అమలు చేస్తున్నారు.

అయితే ఈ దేశాలన్నింటిలోనూ ఒకే విధమైన సెలవుల విధానం శాశ్వతంగా కొనసాగిందని చెప్పలేం. కాలానుగుణంగా ప్రభుత్వాలు పని వారాన్ని మార్చాయి. ఉదాహరణకు సౌదీ అరేబియా 2013లో గురు, శుక్రవారాల సెలవుల విధానం నుంచి శుక్ర, శనివారాల విధానానికి మారింది. వ్యాపార లావాదేవీలు, అంతర్జాతీయ మార్కెట్లతో సమన్వయం వంటి అంశాలు కూడా ఇలాంటి మార్పులకు కారణమయ్యాయి.

ఇజ్రాయెల్‌లో సబ్బాత్ సంప్రదాయం

ఇజ్రాయెల్‌లో యూదుల మత సంప్రదాయమైన సబ్బాత్ (Sabbath)కు ప్రత్యేక స్థానం ఉంది. ఇది శుక్రవారం సూర్యాస్తమయం నుంచి శనివారం సూర్యాస్తమయం వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో మతాచారాలను పాటించడం, విశ్రాంతి తీసుకోవడం, కుటుంబంతో గడపడం వంటి వాటికి ప్రాధాన్యం ఇస్తారు. అందువల్ల ఇజ్రాయెల్‌లో శుక్ర, శనివారం వీకెండ్ ఉంటుంది... ఆదివారమే కొత్త వారం ప్రారంభం అవుతుంది.

45
షార్జాలో మూడు రోజుల వీకెండ్

వీకెండ్ విషయంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన ప్రాంతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ (UAE)లోని షార్జా. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు శుక్రవారం, శనివారం, ఆదివారం మూడు రోజుల వారాంతపు సెలవులు ఉంటాయి. 2022 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ విధానం ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు సోమవారం నుంచి గురువారం వరకు నాలుగు రోజులే పనిచేస్తారు.

అయితే ఈ విధానం షార్జా ప్రభుత్వ సంస్థలకు సంబంధించినది. యూఏఈలోని అన్ని ప్రాంతాల్లోనూ ఇదే విధంగా మూడు రోజుల సెలవులు ఉండవు. దేశంలోని ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగులకు శనివారం, ఆదివారం సెలవులు ఉండగా, శుక్రవారం మధ్యాహ్నం వరకు మాత్రమే పని ఉంటుంది. ప్రైవేట్ సంస్థల విధానాలు కూడా భిన్నంగా ఉండవచ్చు.

బ్రూనైలో శుక్ర, ఆదివారం సెలవులు

బ్రూనైలో వారాంతం సెలవుల విధానం కొంత భిన్నంగా ఉంటుంది. ఇక్కడ సాధారణంగా శుక్రవారం, ఆదివారం సెలవు రోజులు కాగా, శనివారం పని దినంగా ఉంటుంది. అంటే రెండు సెలవుల మధ్యలో ఒక పని రోజు వస్తుంది.

శుక్రవారం ముస్లింల సామూహిక ప్రార్థనలకు ప్రాధాన్యం ఇవ్వడం ఈ విధానం వెనుక ఉన్న ముఖ్యమైన కారణాల్లో ఒకటి. అయితే ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థల పని వేళల్లో కొన్ని తేడాలు ఉండవచ్చు.

ఆఫ్ఘనిస్తాన్‌లో శుక్ర, శనివారాలు సెలవులు

ఆఫ్ఘనిస్తాన్‌లో సాధారణంగా శుక్రవారం, శనివారం వారాంతపు సెలవులుగా పాటిస్తారు. ఆదివారం నుంచి గురువారం వరకు పని వారంగా ఉంటుంది. శుక్రవారం మతపరమైన ప్రార్థనలకు ప్రాధాన్యం ఉండటంతో ఈ విధానం అమల్లో ఉంది. గతంలో ఈ దేశంలో గురు, శుక్రవారాలు సెలవులుగా ఉండేది... దీన్ని శుక్ర, శనివారంకు మార్చారు.

ఇరాన్‌లో ఒక్కరోజే వీకెండ్

చాలా దేశాల్లో రెండు రోజుల వారాంతపు సెలవులు ఉండగా, ఇరాన్‌లో కేవలం శుక్రవారం ఒక్కరోజే వీకెండ్ సెలవు ఉంటుంది. ఒక్కరోజు సెలవు ఉండటంతో మిగతా రోజుల్లో పని చేయాల్సిన సమయం కాస్త తక్కువగా ఉంటుంది... వర్కింగ్ టైమ్ తక్కువన్నమాట. అందుకే అక్కడి ఉద్యోగులు తమ వ్యక్తిగత పనులు, కుటుంబ అవసరాలకు సమయం దొరుకుతుంది.

నేపాల్‌లో వీకెండ్‌పై కొత్త మార్పు

మన పొరుగుదేశమైన నేపాల్‌లో గతంలో శనివారం ఒక్కరోజే అధికారిక వారాంతపు సెలవుగా ఉండేది. ఆదివారం సాధారణ పని దినంగా పరిగణించేవారు. అయితే 2026లో ఇంధన పొదుపు అవసరాల నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు శనివారం, ఆదివారం రెండు రోజుల సెలవుల విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు.

55
దేశాలను బట్టి వీకెండ్ ఎందుకు మారుతుంది?

ప్రపంచవ్యాప్తంగా వారాంతపు సెలవులు ఒకే విధంగా లేకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రధానంగా మతపరమైన ఆచారాలు, చారిత్రక సంప్రదాయాలు, ప్రభుత్వ నిర్ణయాలు, ఆర్థిక కార్యకలాపాలు ఈ విధానాలను ప్రభావితం చేస్తాయి.

మతపరమైన కారణాలు : ముస్లిం దేశాల్లో శుక్రవారం ప్రార్థనలకు, ఇజ్రాయెల్‌లో యూదుల సబ్బాత్ సంప్రదాయానికి ప్రాధాన్యం ఉంటుంది.

ఆర్థిక అవసరాలు : అంతర్జాతీయ వ్యాపార సంస్థలు, ఆర్థిక మార్కెట్లతో సమన్వయం కోసం కొన్ని దేశాలు పని వారాల్లో మార్పులు చేశాయి.

ప్రభుత్వ విధానాలు : ఉద్యోగుల విశ్రాంతి, పని గంటల నిర్వహణ, ఇంధన పొదుపు వంటి అంశాల ఆధారంగా ప్రభుత్వాలు సెలవుల విధానాలను మార్చవచ్చు.

స్థానిక సంప్రదాయాలు : కొన్ని దేశాల్లో చాలాకాలంగా కొనసాగుతున్న పని వారపు విధానాలు ఇప్పటికీ అమల్లో ఉన్నాయి.

వీకెండ్ వల్ల ప్రయోజనాలు ఏమిటి?

వారాంతపు సెలవులు ఉద్యోగులకు శారీరకంగా, మానసికంగా విశ్రాంతి తీసుకునే అవకాశాన్ని కల్పిస్తాయి. కుటుంబ సభ్యులతో సమయం గడపడం, పిల్లలతో బయటకు వెళ్లడం, వ్యక్తిగత పనులు పూర్తి చేసుకోవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం వంటి వాటికి ఈ రోజులు ఉపయోగపడతాయి.

అలాగే నిరంతర పని ఒత్తిడి నుంచి కొంత విరామం లభించడం వల్ల ఉద్యోగులు తిరిగి పనిలో చేరినప్పుడు ఉత్సాహంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అయితే విశ్రాంతి ఎంత ప్రయోజనకరంగా ఉంటుందనేది పని స్వభావం, పని గంటలు, వ్యక్తిగత పరిస్థితులపై కూడా ఆధారపడి ఉంటుంది.

మొత్తానికి మనకు శనివారం, ఆదివారం సాధారణ వీకెండ్ రోజులు. కానీ ప్రపంచంలోని కొన్ని దేశాల్లో శుక్ర, శనివారాలు సెలవులు కాగా, మరికొన్ని చోట్ల భిన్నమైన విధానాలు అమల్లో ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ సంస్థలు, విద్యాసంస్థలకు వేర్వేరు నియమాలు ఉండే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఏ దేశంలోనైనా వీకెండ్ గురించి తెలుసుకునేటప్పుడు ఆ దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న అధికారిక విధానాన్ని పరిశీలించడం ముఖ్యం.

Read more Photos on
click me!

Recommended Stories