Mahesh Babu: ఇంత జరిగాక... ఇకనైనా మహేష్ మారతాడా?

First Published May 17, 2022, 10:57 AM IST

పరిశ్రమలో మహేష్ బాబుకి వివాదరహితుడిగా పేరుంది. అలాంటి మహేష్ నటించిన సర్కారు వారి పాట మూవీపై సోషల్ మీడియాలో జరిగిన దుష్ప్రచారం పరిశ్రమలో హాట్ టాపిక్ మారింది. ఓ వర్గం ఈ సినిమాను దెబ్బతీయాలని పనిగట్టుకొని పని చేస్తుంది.

Mahesh babu - Sarkaru Vaari paata


పరిశ్రమ అంటే ఏ ఒక్క హీరో కాదు, కుటుంబం కాదు. అభిమానుల మధ్య ఫ్యాన్ వార్స్ సర్వసాధారణం. అయితే ఈ ఫ్యాన్ వార్స్ హద్దులు దాటడం ఎవరికీ శ్రేయస్కరం కాదు. ఇవాళ మనం ఒకరి చేసింది రేపు మరొకరు మనకి చేస్తారు. కర్మ సిద్ధాంతం వెంటాడుతుంది. అందరి హీరోల సినిమాలు ఆడితేనే పరిశ్రమ ఎదుగుతుంది. 
 

సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) మూవీ ప్రీమియర్ షో పడిన ఐదు నిమిషాలకే నెగిటివ్ ప్రచారం మొదలుపెట్టారు. ఈ కార్యం కోసమే ఓ వర్గం అర్ధరాత్రి నుండే మేలుకొని ఉంది. నాన్ స్టాప్ గా సినిమాపై వందల, వేల నెగిటివ్ ట్వీట్స్ పుట్టుకొచ్చాయి. ఆ మూవీ ఓపెనింగ్స్ దెబ్బతీయాలనే ఉద్దేశంతో సీరియస్ గా పనిచేశారు. 
 

ఈ నెగిటివ్ టాక్ ప్రభావం సినిమాపై అంతగా చూపలేదు. అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా జరిగిన నేపథ్యంలో పెద్ద డామేజ్ నుండి సినిమా బయటపడింది. అయితే సెకండ్ డే వసూళ్లు దెబ్బతిన్నాయి. అందులోనూ వర్కింగ్ డే శుక్రవారం కావడంతో కలెక్షన్స్ లో డ్రాప్ కనిపించింది. మౌత్ టాక్ పాజిటివ్ గా ఉండడంతో వసూళ్లు మూడో రోజు పుంజుకున్నాయి. 
 

శని, ఆదివారాలు సర్కారు వారి పాటకు కలిసొచ్చాయి. వీకెండ్ ముగిసే నాటికి సర్కారు వారి పాట 75% రికవరీకి దగ్గరైంది. నెగిటివ్ టాక్ ప్రచారం ప్రణాళిక పనిచేయలేదని భావించి... వెంటనే కలెక్షన్స్ ఫేక్ అనే ప్రచారం మొదలుపెట్టారు. సర్కారు వారి పాట మూవీ వసూళ్ల పోస్టర్స్ పై మీమ్స్, ట్రోల్స్ వదులుతున్నారు. 

ఈ మూవీపై నెగిటివ్ ప్రచారం ఏ స్థాయిలో ఉందంటే.. చివరికి చిత్ర నిర్మాతలు దీనిపై స్పందించి, సోషల్ మీడియాలో ట్వీట్ వేసేంతగా ఉంది. సర్కారు వారి పాట డిజాస్టర్, ప్లాప్ అని నిరూపించడం కోసం శతవిధాలా, శక్తియుక్తులన్నీ ప్రయోగిస్తున్నారు. అయితే ఈ నెగిటివ్ ప్రచారం నష్టం కలిగిస్తుందనేది నిజం.. కానీ పూర్తి స్థాయిలో కాదు. మహేష్ లాంటి సూపర్ స్టార్ సినిమాను సోషల్ మీడియా ప్రచారంతో డిజాస్టర్ గా మలచాలనుకోవడం అవివేకమే.


మహేష్ మూవీపై ఓ వర్గం ఇంత కక్ష కట్టడం ఒక ఎత్తైతే... ఈ సినిమా గురించి ఒక్క హీరో కూడా స్పందించలేదు. సినిమాని ఉద్దేశిస్తూ ఒక్కరూ ట్వీట్ చేయలేదు. వ్యవస్థలో వేళ్లూనుకుపోయిన ఓ సామాజిక సమస్యపై తెరకెక్కిన సర్కారు వారి పాట గురించి, ఒక్కరూ మాట్లాడకపోవడం దారుణం. 


అదే సమయంలో చిత్ర ఫలితంతో, హీరోలతో సంబంధం లేకుండా మహేష్ (Mahesh Babu) టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలకు ప్రచారం కల్పిస్తారు. ఈ మధ్య కాలంలో విడుదలైన భీమ్లా నాయక్, ఆర్ ఆర్ ఆర్ తో పాటు పలు హీరోల చిత్రాలను పొగుడుతూ ఆయన ట్వీట్స్ వేశారు. సర్కారు వారి పాట సినిమా విషయంలో టాలీవుడ్ హీరోలు తీరు నేపథ్యంలో, ఇకపై ఇతర చిత్రాలను పొగుడుతూ ట్వీట్స్ వేసే సాంప్రదాయానికి ఆయన స్వస్తి పలికే అవకాశం కలదు. 

click me!