
ఏ హీరోకి అయినా అభిమానులే బలం. అందుకే వాళ్లను చాలా జాగ్రత్తగా చూసుకుంటూంటారు. ఎప్పటికప్పుడు తమ సినిమాలు అప్డేట్స్ ఇస్తూంటారు. సోషల్ మీడియాలో వారితో టచ్ లో ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో రకరకాల సమస్యలు ఎదురౌతాయి. వాటిని చాకచక్యంగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తూంటారు. అలా అభిమానులకు ప్రాణం పెట్టే హీరోలలో ఎన్టీఆర్ ఒకరు.
రీసెంట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమ సెలబ్రిటీలు తారక్‌కు పెద్ద ఎత్తున బర్త్‌డే విషెస్ చెప్పారు. అనేక మంది సినీ ప్రముఖుల జూనియర్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. తారక్ మంచి ఆరోగ్యంతో నిండు నూరేళ్ల ఆయుశ్శుతో జీవించాలని, మరిన్ని సక్సెస్‌లు అందుకోవాలని పలువురు పెద్దలు దీవించారు.
అలాగే తమ అభిమాన హీరో తారక్ జన్మదినం సందర్భంగా ఆయన ఫ్యాన్స్ పండగ వాతావరణం తీసుకొచ్చారు. ఎన్టీఆర్ బర్త్‌డే విషెస్‌తో సోషల్ మీడియా ఊగిపోయింది. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రాంలలో హ్యాపీ బర్త్‌డే ఎన్టీఆర్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది. అంతా బాగానే ఉంది. అయితే ఆయన ఫ్యాన్స్ కు క్షమాపణ చెప్తూ ఓ ట్వీట్ చేయటం చాలా మందిని ఆలోచనలో పడేసింది. ఈ క్షమాపణ ట్వీట్ వైరల్ అయ్యింది. దీనిపై డిస్కషన్స్ జరిగాయి. అసలేం జరిగింది. ఎందుకు ఎన్టీఆర్ ట్వీట్ చేసారు.
తన పుట్టిన రోజు సందర్భంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి ఓ లేఖ (NTR Letter To Fans) విడుదల చేశారు. ఆ లేఖలో తన అభిమానులకు క్షమాపణ చెప్పారు తారక్.
తాను ఇంట్లో లేకపోవడం వల్ల అభిమానులను కలవడం కుదరలేదని.. క్షమించాలని కోరారు. అభిమానుల ప్రేమకు తాను ఎప్పుడు కృతజ్ఞుడిని అని పేర్కొన్నారు. మీ రుణం ఎప్పుడు తీర్చుకోలేనంటూ లేఖలో తెలిపారు. తన పుట్టినరోజు సందర్భంగా ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
అందుకు కారణం... యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు కావడంతో అర్ధరాత్రి ఆయన అభిమానులు హల్ చల్ చేశారు. బర్త్‌డే విషేస్ చేప్పేందుకు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు హైదరాబాద్ కు తరలివచ్చారు. ఎన్టీఆర్ ఇంటి ముందు హంగామా చేశారు. అభిమానుల హడావుడితో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది.
ఎన్టీఆర్ ఇంటి ముందే కేక్ కట్ చేసి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా.. ‘జై ఎన్టీఆర్.. జై జై ఎన్టీఆర్’.. ‘హ్యాపీ బర్త్‌డే తారక్ అన్నా’ అంటూ ఫ్యాన్స్ నినాదాలు చేశారు. మరోవైపు తారక్ ఇంటినుండి బయటకు రావాలంటు పిలిచారు. అయినా ఆయన బయటకు రాకపోవడంతో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు.
ఈ క్రమంలో అదే రోడ్డు మీద రాకపోకలు జరపాల్సిన వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఎన్టీఆర్ నివాసం ఉండే జూబ్లీహిల్స్ లో ప్రాంతంలోనే మరింత మంది ప్రముఖులు కూడా నివసిస్తున్నారు. అయితే వారు తమ ఇళ్లకు కూడా వెళ్లేందుకు లేకుండా అభిమానులు అందరూ రోడ్డు బ్లాక్ చేయడమే కాక తప్పుకోమంటే తప్పుకోకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కొందరు అభిమానులు పోలీసులు వచ్చినా వెనక్కి తగ్గలేదు. పోలీసుల ముందే హడావిడి చేస్తూ టపాసులు కాలుస్తూ రచ్చ చేయడానికి ప్రయత్నించడంతో పోలీసులు చాలా మర్యాదగా ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్లిపోవాలని కోరారు. అయితే అభిమానులు ఖాళీ చేసి వెళ్లిపోవడానికి ఏ మాత్రం సిద్ధంగా లేకపోవడమే కాక పోలీసుల మీద రుబాబు చేసే ప్రయత్నం చేయడంతో పోలీసులు తమ లాఠీలకు పని చెప్పారని సమాచారం.
అలాగే రాత్రి అంతా కొందరిని పోలిస్ స్టేషన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఎవరి మీదా కేసులు పెట్టలేదు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చి అప్పుడు వారిని విడిచిపెట్టారు. ఈ విషయాలు ఎన్టీఆర్ కు తెలిసి బాధించాయి.
దాంతో ఎన్టీఆర్ వెంటనే స్పందించారు. అభిమానులకు క్షమాపణ చెప్తూ.. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు ఎన్టీఆర్. తాను బయటకు రాకపోవడానికి కారణాన్ని వివరిస్తూ భావోద్వేగ పోస్ట్ చేశారు. తాను ఇంట్లో లేకపోవడం వల్ల అభిమానులను కలవలేకపోయానని చెప్పాడు. తమను కలవలేకపోయినందుకు క్షమాపణ చెప్పారు తారక్. తనను అభిమానిస్తూ తన ఇంటికి వచ్చిన అభిమానులను కలలేకపోయినందుకు బాధగా ఉందని ఆవేదన చెందారు తారక్.
మరో ప్రక్క జూనియర్ బర్త్ డే సందర్భంగా ఆయన అభిమానులకు మంచి ట్రీట్ లభించింది. తారక్ లేటేస్ట్ మూవీస్ అప్‌డేట్స్ వచ్చాయి. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్టీఆర్30 (NTR30)తోపాటూ, కేజీఎఫ్‌తో హిట్ కొట్టిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఎన్టీఆర్ 31 (NTR31) సినిమాల ఫస్ట్‌లుక్స్ రిలీజ్ చేశారు. దీంతో ఫ్యాన్స్ ఆ మూవీ అప్‌డేట్స్‌ను రోజంతా వైరల్ చేశారు.
ఇదిలా ఉండగా త్వరలో ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్ర షూటింగ్ లో పాల్గొంటారు. ఈ సినిమా షూట్ పూర్తి అయ్యాక ప్రశాంత్ నీల్ సినిమా షూట్ లో పాల్గొనాల్సి ఉంది ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన నటించబోయే హీరోయిన్ విషయంలో ఇంకా సస్పెస్ కొనసాగుతోంది. పాన్ ఇండియా చిత్రం కావడంతో నార్త్ హీరోయిన్స్ ని పరిశీలిస్తున్నారు. ముందుగా అలియా భట్ పేరు వినిపించింది. కానీ ఈ చిత్రం నుంచి అలియా తప్పుకుంది. ఆ తర్వాత సాయి పల్లవి పేరు కూడా వినిపించింది. కానీ ఆమె కూడా ఖరారుకాలేదు.