`విడుదలః పార్ట్ 1` మూవీ స్పెషల్‌ షో రివ్యూః అల్లు అరవింద్‌కి మరో `కాంతార` అవుతుందా?

First Published | Apr 11, 2023, 5:54 PM IST

`అసురన్‌` వంటి జాతీయ అవార్డు చిత్రాలను రూపొందించిన దర్శకుడు వెట్రిమారన్‌ నుంచి వచ్చిన మరో సినిమా  `విడుదలై`. రెండు పార్ట్ లుగా ఈ సినిమాని తెరకెక్కించగా, మొదటి పార్ట్ ఇప్పటికే తమిళంలో  విడుదలై పెద్ద హిట్‌ అయ్యింది. ఇది తెలుగులో `విడుదలః పార్ట్ 1` పేరుతో ఈ నెల 15న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా స్పెషల్‌ ప్రీమియర్‌ షో ప్రదర్శించారు. సినిమా ఎలా ఉందనేది రివ్యూ చూద్దాం.

`ఆడుకాలం`, `వాడచెన్నై`, `విసరణై`, `అసురన్‌` వంటి జాతీయ అవార్డు చిత్రాలను రూపొందించిన దర్శకుడు వెట్రిమారన్‌. సహజత్వమైన, రా అండ్‌ రస్టిక్‌ సినిమాలను, రియలిస్టిక్‌ కంటెంట్‌తో చేస్తూ ఆకట్టుకుంటున్నారు. రియలిస్టిక్‌ కథకి కమర్షియాలిటీని జోడించి అటు ఆర్ట్ ఫిల్మ్ కాకుండా, ఇటు కమర్షియల్‌ చిత్రాలు కాకుండా బ్యాలెన్స్ చేస్తూ సినిమాలు తెరకెక్కిస్తూ దర్శకుడుగా రాణిస్తున్నారు. కోలీవుడ్‌లో తనకంటూ ఓ సెపరేట్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. ఆయన రూపొందించిన `అసురన్‌` సినిమాని తెలుగులో వెంకటేష్‌ `నారప్ప`గా రీమేక్‌ చేశారు. ఇక్కడ పెద్దగా ఆడలేదు. కానీ తమిళనాట సంచలన విజయం సాధించింది. జాతీయ అవార్డుని అందుకుంది. దర్శకుడు వెట్రి మారన్‌ నుంచి వచ్చిన మరో రా ఫిల్మ్ `విడుదలై`. రెండు పార్ట్ లుగా ఈ సినిమాని తెరకెక్కించిగా, మొదటి పార్ట్ ఇప్పటికే తమిళంలో మార్చి 31న విడుదలై పెద్ద హిట్‌ అయ్యింది. తెలుగులో `విడుదలః పార్ట్ 1` పేరుతో ఈ నెల 15న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా స్పెషల్‌ ప్రీమియర్‌ షో ప్రదర్శించారు. మరి సినిమా ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం. 
 

కథః 

తమిళనాడు, కర్నాటక బార్డర్‌లో ప్రజాదళం(పీపుల్స్ ఆర్మీ) ప్రభావం చాలా ఉంటుంది. ప్రజల హక్కులను కాపాడటం కోసం పనిచేస్తుంటుంది. మైనింగ్‌ పేరుతో అటవి ప్రాంతాల్లోని సహజ వనరులను కొల్లగొట్టే ప్రభుత్వం, కార్పొరేట్‌ కంపెనీలకు వ్యతిరేకంగా పనిచేస్తుంటుంది. దాన్ని పోలీసులు, ప్రభుత్వం తీవ్రవాద సంస్థగా పరిగణిస్తుంటారు. ఈ క్రమంలో పోలీసులకు, ప్రజాదళం మధ్య వార్‌ జరుగుతుంటుంది. అయితే బార్డర్‌ ఏరియాలో మాస్టర్‌ అలియాస్‌ పేరుమాల్‌(విజయ్‌ సేతుపతి) నాయకత్వంలోని ప్రజాదళం ఓ రైలుని బ్లాస్ట్ చేస్తుంది. దీంతో దీనికి ప్రతీకారంతో ప్రభుత్వం పోలీసులు, `ఆపరేషన్‌ ఘోస్ట్` పేరుతో పెరుమాల్‌ని, ఆయన టీమ్‌ సభ్యులను పట్టుకునేందుకు ఆపరేషన్‌ చేపడుతుంది. అదే సమయంలో ముతువేల్‌ ప్రాంతంలోని పోలీస్‌ క్యాంప్‌కి కుమరేషన్‌( కమెడియన్‌ సూరి) డ్రైవర్‌గా బదిలీపై వస్తాడు. అక్కడ పరిస్థితులన్నీ అతనికి కొత్త. పైగా చాలా నిజాయితీ గల అమాయకుడు. ఆపదలో ఉన్న ఓ బామ్మని కాపాడే క్రమంలో పై అధికారి ఆదేశాలను అతిక్రమించాడనే నెపంతో డబుల్‌ డ్యూటీలు చేస్తుంటాడు. అయితే ఆ బామ్మ మనవరాలు పాప(భవాని శ్రీ) కుమరేషన్‌ని ఇష్టపడుతుంది. అలా ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది.

ప్రజాదళం చేసిన దాడిలో పోలీసులు మరణిస్తారు. దీంతో ప్రతీకార చర్యలు చేపడుతుంటారు పోలీసులు. అ క్రమంలో ఊరి మనుషులను అరెస్ట్ చేసి చిత్ర హింసలు పెడుతుంటారు. ఆడవారిపై హత్యాచారాలు, బట్టలు లేకుండా చేసి వారిపై అగాహిత్యాలకు పాల్పడి చంపేస్తుంటారు. త్వరలోనే మైనింగ్‌ కోసం కంపెనీలు రాబోతున్న నేపథ్యంలో ప్రజాదళం అనుకూలమైన వారు, పెరుమాల్‌ బంధువులు అక్కడి ఊర్లో ఉన్నారని తెలిసి పోలీసులు కూంబింగ్‌ చేపడుతుంటారు. ఊరి ప్రజలను అరెస్ట్ చేసి చిత్ర హింసలు పెడుతుంటారు. ఆడవాళ్ళని వివస్త్రలను చేసి దారుణంగా కొడుతుంటారు. అందులో తన ప్రియురాలు కూడా ఉంటుంది. ఆమెని సేవ్‌ చేసేందుకు కుమరేషన్‌ ఏం చేశాడు? పెరుమాల్‌ని గురించి తనకు తెలిసిన సమాచారం ఏంటి? అనేది మిగిలిన కథ. 

Latest Videos


విశ్లేషణః 

వెట్రిమారన్‌.. సినిమాలు సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటాయి. రా, రస్టిక్‌ సినిమాలకు కేరాఫ్‌. ఇప్పుడు తన స్టయిల్‌లోనే `విడుదల` చిత్రాన్ని రూపొందించారు. తొలి భాగం పెరుమాల్‌ని పట్టుకునేందుకు పోలీసులు చేపట్టే చర్యలు, ఈ క్రమంలో చోటు చేసుకున్న సంఘటనల నేపథ్యంలో సాగుతుంది. సినిమా తొలి భాగం సూరి పాత్రని ఎస్టాబ్లిష్‌ చేయడానికే ప్రయారిటీ ఇచ్చాడు దర్శకుడు వెట్రిమారన్‌. ఆయన పోలీస్‌ క్యాంప్‌లో చేరడం, పై అధికారి ఆదేశాలు అతిక్రమించినందుకు ఫనిష్‌మెంట్లు, మరోవైపు గూడెం అమ్మాయితో ప్రేమని ప్రధానంగా చూపించారు. మధ్య మధ్యలో పెరుమాల్‌ టీమ్‌ని కనిపెట్టేందుకు పోలీసులు చేపట్టే చర్యలు, పై అధికారుల చర్చలు చూపించారు. సినిమా ప్రారంభంలో ట్రైన్‌ యాక్సిడెంట్‌ సీన్‌ని చాలా డిటెయిలింగ్‌గా చూపించేందుకు చాలా సమయం తీసుకున్నారు. ప్రయాణికుల మరణాలు, గాయపడిన వారి అర్తనాదాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. అయితే ప్రతిదీ డిటెయిలింగ్‌లోకి వెళ్లడం, సూరి పాత్రని ఎస్టాబ్లిష్‌ చేసేందుకు ఎక్కువ సమయం తీసుకోవడంతో మొదటి భాగం చాలా స్లోగా సాగుతుంది. 
 

ఇక రెండో భాగంలో గౌతమ్‌ మీనన్‌ పాత్ర ఎంటర్‌ అవుతుంది. ఆయన ఆపరేషన్‌ హెడ్‌గా సునీల్‌ మీనన్‌ అనే డీఎస్పీ పాత్రలో కనిపిస్తారు. ఆయన రాకతో కథలో వేగం పుంజుకుంటుంది. ఆయన పెరుమాల్‌ని పట్టుకునేందుకు చర్యలు వేగవంతం చేయడం. అక్కడి ప్రజలతో మాట్లాడి వారిలో మార్పు కోసం ప్రయత్నించడం, మరోవైపు ఆ ఊర్లకి రోడ్డు వేయించే క్రమంలో పోలీసులపై ప్రజాదళం టీమ్‌ దాడులు చేయడం, అక్కడి స్థానికులను పోలీసులు అరెస్ట్ చేసి చిత్ర హింసలు చేయడం, ఆడవాళ్లని బట్టల్లేకుండా కొట్టి హింసకు గురి చేసే సన్నివేశాలు ఎమోషనల్‌గా, ఒళ్లుగగుర్పొడిచేలా ఉంటాయి. సెకండాఫ్‌ కథనం కాస్త వేగం పెరగడంతో సినిమాపై ఆసక్తి పెరుగుతుంది. కానీ అది ఎంతసేపూ ఉండదు. మళ్లీ డీలా పడిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్ ఊపందుకుంటుందనుకుంటే అక్కడ కూడా ఆ కిక్‌ మిస్‌ అయ్యింది. ఆడవాళ్లపై పైశాచిక చర్యలు మనుసుని కదిలించేలా ఉంటాయి. ఆయా సీన్లని అంతే రాగా చూపించడం కూడా ఆశ్చర్యపరుస్తుంటాయి. 

క్లైమాక్స్ లో పెరుమాల్‌ టీమ్‌కి, పోలీసులకు మధ్య జరిగే కాల్పులు ఆసక్తిని రేకెత్తించినా, పోలీసులను సూరి పాత్ర లీడ్‌ చేయడం, ఈ క్రమంలో ఆయన పాత్రని డిజైన్‌ చేసిన తీరు సహజత్వానికి భిన్నంగా ఉంటుంది. అంతగా నప్పేలా ఉండవు. ముగింపు కూడా ఆశించిన స్థాయిలో లేదు. అయితే చివర్లో రెండో భాగంలో ఏం చూపించబోతున్నారో హింట్‌ ఇచ్చిన తీరు బాగుంది. అది సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్‌ చేస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే ఇది పూర్తి తమిళ నేచర్‌లో ఉంటుంది. సినిమా ఆసాంతం అలాగే సాగుతుంది. అదితమిళ ఆడియెన్స్ కి కనెక్ట్ అవుతుంది కాబట్టి అక్కడ పెద్ద హిట్‌ అయ్యింది. మరి తెలుగులో అది ఎంత వరకు కనెక్ట్ అవుతుందనేది ప్రశ్న. అల్లు అరవింద్‌ విడుదల చేసిన `కాంతార` సినిమాలో కన్నడలోని స్థానిక కల్చర్‌ని చూపించారు, కానీ పాయింట్‌ మాత్రం యూనివర్సల్‌. అది ఇక్కడి ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యింది. కానీ అన్ని సినిమాలు `కాంతార`లు కాలేవు. దానితో కంపేర్‌ చేస్తే `విడుదల` అందుకు పూర్తి భిన్నమైన సినిమా. అయితే సినిమాలో ప్రజాదళానికి, పోలీసులకు జరిగే దాడులు, ఆ ఘటనలు, తెలంగాణలో నక్సల్స్ కి, పోలీసులకు మధ్య జరిగే ఘర్షణలు గుర్తుకు వస్తుంటాయి. ఆ రకంగా ఈ సినిమా ఎంతో కొంత ఆకట్టుకోవచ్చు. 
 

నటీనటులుః 
పోలీస్‌ క్యాంప్‌ డ్రైవర్ కుమారేషన్‌ పాత్రలో సూరి అద్భుతంగా చేశాడు. ఇంకా చెప్పాలంటే కమెడియన్‌గా, కీలక పాత్రలతో మెప్పించే సూరి.. ఇందులో మెయిన్‌ లీడ్‌గా నటించి, సినిమాని తన భుజాలపై మోయడం విశేషం. ఇన్నోసెంట్‌ నటనతో వాహ్‌ అనిపించాడు. ఆయన ప్రియురాలు పాప గా భవానీ శ్రీ చాలా బాగా చేసింది. సహజమైన నటనతో మెప్పించింది. పేరుమాల్‌గా విజయ్‌ సేతుపతి కనిపించాడు. ఆయనకు ఇందులో సీన్లు చాలా తక్కువ. చివర్లో కనిపిస్తాడు. సహజంగా కనిపించి మెప్పించాడు. డీఎస్పీగా గౌతమ్‌ మీనన్‌ ఆకట్టుకున్నారు. క్యాంప్‌ ఆఫీసర్‌ ఓసీగా చేతన్‌ నటన గుర్తిండిపోయేలా ఉంటుంది. రాజీవ్‌ మీనన్‌తోపాటు ఇతర పాత్రధారులు ఉన్నంతలో మెప్పించారు.

టెక్నీషియన్ల పనితీరుః

దర్శకుడి వెట్రి మారన్‌ ఆల్‌రెడీ దర్శకుడిగా తానేంటో చూపించారు. ఆయన సినిమాల స్టయిల్‌ ఎలా ఉంటుందనేది ఆడియెన్స్ లో ఓ ముద్ర పడింది.  కథకి ప్రయారిటీ ఇచ్చే దర్శకుడు వెట్రిమారన్‌. పాత్రలో అందుకు సపోర్ట్ గానే ఉంటాయిగానీ, వాటికి ప్రయారిటీ ఇవ్వరు. `విడుదల` సినిమాని కూడా తన స్టయిల్‌లోనే తెరకెక్కించాడు. అందుకే ఇది తమిళంలో సూపర్‌ హిట్‌ అయ్యింది. అయితే ఆయన మేకింగ్ కాస్త స్లోగా సాగుతుంది. తమిళ ఛాయలు, నెటివిటీ ఎక్కువగా ఉంటుంది. అది తెలుగు ఆడియెన్స్ వేగాన్ని కోరుకుంటారు. ఆ ప్రకారంగా చూస్తే ఇది తెలుగు ఆడియెన్స్ ని అంతగా ఆకట్టుకోకపోవచ్చు. కానీ ఇప్పటికే ఆయన సినిమాలు చూసి ఇంప్రెస్‌ అయిన వారికి `విడుదల` సినిమా ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు. దర్శకుడిగా ఆయన కథని డీల్‌ చేసిన విధానం, సహజత్వంగా తెరకెక్కించిన విధానం మాత్రం సూపర్బ్. విజయ్‌ సేతుపతి, గౌతమ్‌ మీనన్‌, సూరి వంటి స్టార్‌ కాస్టింగ్‌ని ఆయన పాత్రలుగానూ చూపించారుగానీ, వారి ఇమేజ్‌ కోసం ఎక్కడా ప్రయత్నించలేదు. దర్శకుడిగా వెట్రీమారన్‌ మరోసారి తన సత్తాని చాటారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆర్‌ వేల్‌రాజ్‌ కెమెరా వర్క్ మరో అసెట్‌. ఇళయరాజా సంగీతం బిగ్గెస్ట్ అసెట్‌. బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్ అద్భుతంగా చేశారు. తెలుగు ఎడిటర్‌ మాత్రం కొంత కత్తెరకి పని చెప్పాల్సింది. అల్లు అరవింద్‌ తెలుగులో రిలీజ్‌ కోసం ప్రొడక్షన్‌ పరంగా చాలా కేర్‌ తీసుకున్నారని సినిమా చూస్తుంటే అర్థమవుతుంది. 
 

ఫైనల్‌గాః  అన్ని సినిమాలు `కాంతార`లు కాలేవు. 

రేటింగ్‌ః 2.75

నటీనటులు: సూరి, విజయ్ సేతుపతి, భవానీ స్రే, గౌతమ్ వాసుదేవన్ మీనన్, రాజీవ్ మీనన్, చేతన్, ఇలవరసు, బాలాజీ శక్తివేల్ తదితరులు. 

దర్శకత్వం: వెట్రిమారన్ స్క్రీన్ ప్లే: వెట్రిమారన్, బీ జెయమోహన్

నిర్మాత: ఎల్‌రెడ్ కుమార్, 

సినిమాటోగ్రఫి: ఆర్ వెల్‌రాజ్,

మ్యూజిక్: ఇళయరాజా.
 

click me!