మెగా హీరో వరుణ్ తేజ్ ప్రయోగాలకు పెట్టింది పేరు. కెరీర్ బిగినింగ్ నుండి ఆయన పలు కొత్త తరహా సబ్జక్ట్స్ ట్రై చేశారు. అయితే కొన్నాళ్లుగా ఆయనకు వరుస పరాజయాలు ఎదురవుతున్నాయి. గత రెండు చిత్రాలు గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ డిజాస్టర్స్ గా నిలిచాయి. కనీస ఆదరణ ఆ చిత్రాలకు దక్కలేదు. ఈ క్రమంలో వరుణ్ తేజ్ మార్కెట్ దెబ్బతింది. ఆ ప్రభావం లేటెస్ట్ మూవీ మట్కా పై పడింది. మట్కా అడ్వాన్స్ బుకింగ్స్ దారుణంగా ఉన్నాయి.
హిట్ టాక్ తెచ్చుకుంటే కానీ మట్కా చిత్రానికి వసూళ్లు దక్కే పరిస్థితి లేదు. నవంబర్ 14న మట్కా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేశారు. పలాస ఫేమ్ కరుణ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మీనాక్షి చౌదరి హీరోయిన్. అజయ్ ఘోష్, రవి శంకర్, నోరా ఫతేహి ఇతర కీలక రోల్స్ చేశారు. మట్కా చిత్రానికి జీవి ప్రకాష్ సంగీతం అందించారు. విజేందర్ రెడ్డి తీగల, రజని తల్లూరి నిర్మించారు.
మట్కా మూవీ రతన్ ఖేత్రీ అనే గ్యాంగ్ స్టర్ జీవితం ఆధారంగా తెరకెక్కించారు. అణగారిన వర్గానికి చెందిన రతన్ ఖేత్రీ మట్కా అనే ఇల్లీగల్ దందా ద్వారా గ్యాంగ్ స్టర్ గా ఎలా ఎదిగాడు అనేది కథ. రతన్ పాత్రను మట్కా వాసుగా వరుణ్ తేజ్ పోషించాడు. మట్కా ఆడియన్స్ అభిప్రాయంలో యావరేజ్ మూవీ. పీరియాడిక్ సెటప్ బాగుంది. సెట్స్, ఆర్ట్ వర్క్ అప్పటి పరిస్థితులకు అద్దం పట్టేలా ఉన్నాయి.
నిర్మాణ విలువలు, విజువల్స్ మెప్పించే అంశాలు. ముఖ్యంగా వరుణ్ నటన, గెటప్స్, క్యారెక్టరైజేషన్ బాగుంది. జీవి ప్రకాష్ మ్యూజిక్ పర్లేదు. ఇతర నటులు తమ పరిధి మేర మెప్పించే ప్రయత్నం చేశారు. అయితే కథలో కొత్తదనం లేదు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించినప్పటికీ కేజిఎఫ్, పుష్ప వంటి పీరియాడిక్ క్రైమ్ డ్రామాల ప్రభావం కనిపిస్తుంది. ఆ చిత్రాలను తలపిస్తుంది.
దర్శకుడు రాసుకున్న స్క్రీన్ ప్లే, సన్నివేశాలు ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదని సోషల్ మీడియా కామెంట్స్ చూస్తే అర్థం అవుతుంది. మీనాక్షి చౌదరి పాత్ర సైతం ఇందులో పరిమితంగా ఉంది. యావరేజ్ ఫస్ట్ హాఫ్ కి కొనసాగింపుగా వచ్చే సెకండ్ హాఫ్ సైతం సోసోగానే సాగుతుంది. మట్కా వాసు పాత్రకు ఆడియన్స్ ఎమోషనల్ గా కనెక్ట్ కాలేదని చెప్పొచ్చు.
మొత్తంగా మట్కా చిత్రానికి ప్రాధమికంగా యావరేజ్ టాక్ అందుతుంది. మూవీ ఫలితం తెలియాలంటే పూర్తి రివ్యూ రావాలి. మరోవైపు పోటీగా విడుదలైన కంగువా సైతం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. సూర్య నటించిన భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ కంగువా ప్రేక్షకులను పూర్తి స్థాయిలో మెప్పించలేదు. సోషల్ మీడియాలో ఆడియన్స్ నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారు.
ఇది మట్కా చిత్రానికి కొంత కలిసొచ్చే అంశం. అడ్వాన్స్ బుకింగ్స్ చాలా పూర్ గా ఉన్న నేపథ్యంలో మట్కా చిత్రం బ్రేక్ ఈవెన్ కి చేరుకోవాలంటే పాజిటివ్ రివ్యూలు తప్పనిసరి. కంటెంట్ ఉంటే ఆడియన్స్ ఆదరిస్తారు. అందుకు దీపావళికి విడుదలైన క, లక్కీ భాస్కర్, అమరన్ చిత్రాల ఫలితాలే నిదర్శనం. మరి వరుణ్ తేజ్ సినిమాకు ఆడియన్స్ ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి..