తెలుగు చిత్ర పరిశ్రమలో 4 దశాబ్దాల పైగా సేవలు అందిస్తున్న మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కనుంది. చిరంజీవి కి హౌస్ ఆఫ్ కామన్స్ - యు.కె పార్లమెంట్ లో గౌరవ సత్కారంజరగనుంది. ప్రపంచ స్థాయిలో మెగాస్టార్ కి దక్కబోతున్న అరుదైన గౌరవం ఇది. నాలుగు దశాబ్దాలుగా సినిమాల ద్వారా కళారంగానికి, సమాజానికి చేసిన సేవలకుగానూ, యుకె కి చెందిన అధికార లేబర్ పార్టీ పార్లమెంట్ మెంబర్ నవేందు మిశ్రా చిరంజీవి ని మార్చి 19న సన్మానించనున్నారు. సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్ మన్ సహా ఇతర పార్లమెంట్ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. అదే వేదికపై బ్రిడ్జ్ ఇండియా సంస్థ, సినిమా, ప్రజాసేవ.. దాతృత్వానికి చిరంజీవి చేసిన కృషిని గుర్తించి కల్చరల్ లీడర్షిప్ ద్వారా ప్రజాసేవలో ఎక్సలెన్స్ కోసం 'జీవిత సాఫల్య పురస్కారం’ ప్రదానం చేయనున్నారు.