
కార్తీక దీపం 2 సీరియల్ శుక్రవారం ఎపిసోడ్ లో జరిగిన అవమానాలను గుర్తు చేసుకుంటూ రగిలిపోతుంది జ్యోత్స్న. ఇంతలో అక్కడికి వచ్చిన పారు భోజనం చేద్దాం రా అని పిలుస్తుంది. నేను రాను నువ్వు వెళ్లు గ్రానీ అంటుంది జ్యోత్స్న. ఇంకా ఎందుకు అదే ఆలోచిస్తున్నావు. జరిగిందేదో జరిగింది మర్చిపో అంటుంది పారు. ఏం మర్చిపోవాలి అని పారుపై విరుచుకుపడుతుంది జ్యోత్స్న. అందరిముందు నన్ను ఒక ఫూల్ ని చేశారు. ఒక పనిమనిషి ముందు నాకు విలువ లేకుండా చేశారు. నేను ఏది మర్చిపోను. అందరిని ఇంతకు ఇంత అనుభవించేలా చేస్తాను అంటుంది జ్యోత్స్న.
మన కర్మ కాకపోతే రెండు పెళ్లిళ్లు చేసుకున్నవాడు సీఈఓ ఏంటి?అంటుంది పారు. ఈ మాట అక్కడే ఎందుకు అనలేదు అంటుంది జ్యోత్స్న. నువ్వు అన్నావు కదా ఏమన్నారు అంటుంది పారు. నీ ముందే కదా ఛీ అన్నారు అంటుంది జ్యోత్స్న. నన్ను కూడా అలాగే అనేవారు అంటుంది పారు. అయినా నువ్వు దీపను ఎందుకు పొడవలేదు అంటుంది జ్యోత్స్న. అది సీఈఓగా ఉంటే పొడుద్దామనే అనుకున్నా.. కానీ అది కూడా పెద్ద ట్విస్ట్ ఇచ్చింది అంటుంది పారు.
ఇవన్నీ జరగడానికి కారణం బావే అంటుంది జ్యోత్స్న. కాదు నీ చేతకానితనం అంటుంది పారు. కంపెనీని నీ చేతుల్లో పెడితే నాశనం చేశావు. నష్టాలు తెచ్చావు. పైగా తప్పు చేశాననే బాధ కూడా లేదు నీకు అంటుంది పారిజాతం. నేను చేసిన తప్పును సరిదిద్దుకునేలోపే నన్ను బయటకు పంపించారు. వీటికి కారణమైన బావ, దీపలను నేను ప్రశాంతంగా ఉండనివ్వను అంటుంది జ్యోత్స్న.
మరోవైపు నేను ఏమన్నానని అలుగుతున్నావు బావ? అత్తయ్యను బాధపెట్టకు అనడం కూడా తప్పేనా అంటుంది దీప. అమ్మానాన్నల మధ్య ఏం జరిగింది? ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చిందనే సంగతి పక్కన పెడితే తల్లిదండ్రులు కలిసి ఉండాలని పిల్లలు కోరుకుంటారా? లేదా? అని అడుగుతాడు కార్తీక్. మీ అమ్మానాన్నలు విడిపోయినప్పుడు నువ్వు ఎంత బాధపడ్డావు. మరి మా అమ్మానాన్న గురించి కూడా నేను అలాగే అనుకుంటా కదా అంటాడు కార్తీక్. మాస్టారు సరిదిద్దుకోలేని తప్పే చేశాడు. కానీ మా అమ్మ ఆయన్ని క్షమిస్తుందో లేదో తెలియదు అంటాడు. వాళ్లు దూరంగా ఉన్నా ఒకరి గురించి ఒకరు తలుచుకుంటూనే ఉంటారని దీపతో అంటాడు కార్తీక్.
ఆయనకు ఫోన్ చేయాలా వద్దా అనుకుంటుంది కాంచన. మరోవైపు శ్రీధర్ కూడా అలాగే ఆలోచిస్తాడు. కానీ కాల్ చేస్తాడు. నా ఫోన్ కోసం ఎదురు చూస్తున్నావా ని అడుగుతాడు శ్రీధర్. లేదు, నేనేందుకు ఎదురుచూస్తాను అంటుంది కాంచన. ఫోన్ కార్తీక్ కి ఇవ్వమంటారా? అంటుంది. నేను నీకోసమే చేశాను అంటాడు శ్రీధర్. నన్ను విష్ చేయాలని నీకు అనిపించలేదా? అంటాడు. నా విషెస్ తో మీకు ఏం అవసరం అంటుంది కాంచన.
నీకు అవసరం లేదేమో కానీ.. నేను ఎదురు చూస్తా కదా అంటాడు శ్రీధర్. మామయ్య కూడా నన్ను అర్థం చేసుకొని క్షమించారు. నువ్వు అలా ఎందుకు చేయలేవని అడుగుతాడు శ్రీధర్ . ఎందుకంటే నా తండ్రి కంటే ఎక్కువ నమ్మకం నేను నీ మీద పెట్టుకున్నా కాబట్టి అంటుంది కాంచన. నీ భర్త ఎవరు? అని అడుగుతాడు శ్రీధర్. దేవుడు నా తలరాతను సరిగ్గా రాయలేదు. అన్నీ ఉన్నాయి అమ్మ లేదు. పెళ్లి చేసుకున్నా కొడుకు పుట్టాడు. వాడ్ని ఎత్తుకొని తిరిగేందుకు కాళ్లు లేవు. ఇప్పుడు బొట్టు ఉంది కానీ భర్త లేడు అంటుంది కాంచన. శ్రీధర్ ఇంకేదో మాట్లాడబోతుండగా... సీఈఓ అయినందుకు మీకు నా శుభాకాంక్షలు అని ఫోన్ కట్ చేస్తుంది.
ఇదంతా పక్కనుంచి విన్న కార్తీక్ కాంచన దగ్గరకు వస్తాడు. నువ్వు ఇంకా పడుకోలేదా కార్తీక్ అంటుంది కాంచన. నువ్వు ఒంటరిగా లేవని చెప్పేందుకు నేను ఇక్కడే ఉన్నానమ్మా అంటాడు కార్తీక్. ఆయన ఏం మాట్లాడో తెలియదు. కానీ నువ్వు మాట్లాడింది అంతా విన్నాను అంటాడు కార్తీక్. భర్త చేతిలో ఘోరంగా ఓడిపోయిన ఆడదాన్ని నేను. ఆత్మాభిమానాన్ని నిలబెట్టే కొడుకు ఉన్నాడు కాబట్టి ఈ మాత్రం బతుకుతున్నాను అంటుంది కాంచన. నువ్వేం తప్పు చేయలేదు కదా అమ్మా అంటాడు కార్తీక్. భర్త చేసిన తప్పులకు కూడా భార్యనే నిందించే లోకం ఇది. నిన్ను చూసుకునే మొండి ధైర్యంతో బతుకుతున్నానని బోరున ఏడుస్తుంది కాంచన.
ఆ మనిషి తప్పు చేశాడు. సరిదిద్దుకోలేని తప్పు చేశాడు కానీ... మారాడు. నా కోసం రూ.10 కోట్లు కట్టేందుకు కూడా క్షణం ఆలోచించలేదు. ఆ మనిషిలో పశ్చాత్తాపం స్పష్టంగా కనపడుతోంది. ఆయన మళ్లీ మనతో కలవాలని కోరుకుంటున్నాడు. ఓ కొడుకుగా తల్లి, తండ్రి గురించి నేను ఆలోచిస్తా కదా అంటాడు కార్తీక్. ఆయన కోపం దీప మీద మాత్రమే. ఎప్పటికైనా అది పోవాల్సిందే. పోతుంది కూడా అంటాడు కార్తీక్. నీ కొడుకు నిన్ను ఎప్పుడూ ఓడిపోనివ్వడు అని కాంచనను దగ్గరకు తీసుకుంటాడు కార్తీక్. మీ నాన్న, నేను కలవాలని నువ్వు కోరుకుంటున్నావని నాకు అర్థమైంది. కానీ అది ఈ జన్మలో జరగదని కాంచన మనసులో అనుకుంటుంది. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.