
Guppedantha Manasu 27th march Episode: మహేంద్ర.. మనుతో మాట్లాడుతూ ఉంటాడు. ఓ తండ్రి స్థానంలో నిలపడి అడుగుతున్నానని..నీకు, అనుపమకు మధ్య ఉన్న గొడవ ఏంటి అని అడుగుతాడు. ఆగొడవ తీరిపోతే... మీరు సంతోషంగా ఉండొచ్చుకదా అని అంటాడు. కానీ.. తనకు కూడా తన పేరెంట్స్ తో కలిసి ఉండాలనే కోరిక ఉందని.. కానీ అది ఈ జన్మలో జరిగేది కాదు అని మను ఆవేదన వ్యక్తం చేస్తాడు. అనుపమ చాలా మంచిది, నవ్వు కూడా చాలా మంచోడివి.. మీ ఇద్దరి మధ్య సమస్య ఏంటో నాకు అర్థం కావడం లేదు అని మహేంద్ర అంటాడు. అసలు అనుపమ నిన్ను అమ్మ అని ఎందుకు పిలవొద్దు అన్నదో చెప్పమని మహేంద్ర మరీ మరీ అడగడంతో.. మను చెప్పడం మొదలుపెడతాడు.
కేవలం ఒక్క ప్రశ్న. ఒకే ప్రశ్న తనను 25ఏళ్లుగా ఇబ్బంది పెడుతోందని, ఆ ప్రశ్నే మా ఇద్దరి మధ్య అడ్డుగోడగా నిలిచిందని, అదే మా బంధాన్ని దూరం చేసిందని, ఆ ప్రశ్నకు సమాధానం చెప్పమని తల్లిని అడిగినందుకే.. తనని కూడా అమ్మ అని పిలవొద్దు అని చెప్పింది అని చెబుతాడు. ఏంటా ప్రశ్న అని మహేంద్ర అడగగా.. అది మాత్రం అడగొద్దు అని.. బాధగా మను అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
ఇక.. ఇంట్లో వసుధార వర్క్ చేసుకుంటూ ఉంటుంది. అనుపమ లేచి వాళ్ల దగ్గరకు వస్తుంది. రెస్ట్ తీసుకోకుండా ఎందుకు వచ్చావ్ అని ఏంజెల్ అడుగుతుంది, ఊరికే కాసేపు కూర్చుందామని వచ్చాను అని అనుపమ అంటుంది. తర్వాత మహేంద్ర రాలేదా అని అనుపమ అడుగుతుంది. మీరు మను రాలేదా అని అడుగుతారు అనుకున్నాను అని వసుధార అంటుంది. మను ఎందుకు వస్తాడు అని అనుపమ సీరియస్ అవుతుంది. ఇక.. వసుధార.. బంధం, అనుబంధం అని భారీ డైలాగులు కొడుతుంది. మీరు రావద్దు అని పైకి చెబుతున్నా.. మను వస్తే బాగుండు అనే కోరుకుంటున్నారు అని అంటుంది. కాదు అని అనుపమ అంటుంది.
ఇక, వసుధార, ఏంజెల్ ఇద్దరూ కలిసి.. మనుతో కలిసి ఉండమని మంచిగా చెబుతారు. కానీ అది కుదరని పని అని అనుపమ తేల్చి చెబుతుంది. కలిసి ఉంటాం అనే ఊహించుకో అత్తయ్య.. ఎంత బాగుంటుందో అని ఏంజెల్ చెబితే.. తాను ఆ స్టేజ్ ఎప్పుడో దాటి వచ్చానని, తాను అన్ని ఎమోషన్స్ చూసే వచ్చాను అని.. మీరు నాకు ఏమీ చెప్పక్కర్లేదు అని.. మళ్లీ లోపలికి వెళ్లి పడుకుంటుంది.
తాము అడిగిన ప్రశ్నలకు బదులు చెప్పడం ఇష్టంలేకే.. వెళ్లిపోయింది అని.. ఏంజెల్ అంటుంది. కావాలనే అత్తయ్య మన నుంచి తప్పించుకోవాలని, టాపిక్ డైవర్ట్ చేయాలని చూస్తోంది అని ఏంజెల్ అంటుంది. వసుధార అవును అని అంటుంది.
ఇక.. మను తన అసిస్టెంట్ తో కలిసి కారులో వెళ్తూ ఉంటాడు. ఒక చోట కారు ఆఫి.. మను కోసం అతని పీఏ కాఫీ తేవడానికి వెళతాడు. ఆ సమయంలో మను తన బాధ మొత్తం బయటపెడతాడు. అనుపమ ఫోటో పట్టుకొని.. తన ఆవేదన తెలియజేస్తాడు. నా తండ్రి ఎవరు అమ్మ..? మహేంద్ర సర్ అడుగుతున్నారు.. ఏం చెప్పాలి..? నీ తండ్రి ఎవరు అని ఎవరైనా అడిగినప్పుడు నేను ఎంత చిత్రవధ అనుభవించానో నీకు ఏం తెలుసు అమ్మా? నా ఈ జన్మకు నా తండ్రి ఎవరో నేను తెలుసుకోలేనా? నా కన్న తండ్రి ఒడిలో పడుకొని సేద తీరలేనా?. ఈ జన్మకు అడ్రస్ లేని వాడిలాగానే మిగిలిపోవాలా చెప్పు అమ్మా అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. అప్పుడే పీఏ వచ్చి కాఫీ ఇస్తాడు.
ఇక.. మహేంద్ర ఆవేశంగా అనుపమ దగ్గరకు వెళతాడు. ఏం చేస్తున్నావ్ అంటే పుస్తకం చదువుతున్నాను అని చెబుతుంది. ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నావ్ అని అడుగుతాడు. తనకు అలవాటే అని అనపమ చెబుతుంది. నీకు అలవాటే.. కానీ అభం శుభం తెలియని మను అక్కడ నరకం అనుభవిస్తున్నాడు....కేవలం ఒక్క ప్రశ్న అడిగినందుకే నువ్వు మనుని దూరం పెడుతున్నావని నాకు అర్థమైంది. ఆ ప్రశ్నే ఏంటో కూడా తనకు తెలుసు అని మహేంద్ర అంటాడు.
మను తన తండ్రి ఎవరు అనే కదా అడిగాడు.. నువ్వు దానికే కదా సమాధానం చెప్పలేదు అని నిలదీస్తాడు. మను కాదు.. నేను అడుగుతున్నాను.. మను తండ్రి ఎవరు అని మహేంద్ర నిలదీస్తాడు. ఆ ప్రశ్నకు తాను సమాధానం చెప్పలేను అని అనుపమ అంటుంది.
ఎందుకు చెప్పాల్సిందే.. నువ్వు నిజం చెప్పే వరకు తాను ఇక్కడి నుంచి కదలను అంటాడు. అప్పుడే వసుధార వచ్చి.. మామయ్య.. మేడమ్ ని ఇప్పుడు ఏమీ అడగొద్దు అని అంటుంది. ఎందుకు అని మహేంద్ర అడిగితే.. ఆల్రెడీ దేవయాణి వచ్చి.. ఇవే ప్రశ్నలతో అనుపమ మేడమ్ ని ఇబ్బంది పెట్టిందని.. ఇప్పుడు మీరు కూడా అవే ప్రశ్నలు వేయకండి అని చెబుతుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.