
కామాక్షి కూడా తన భర్తను తీసుకొని ఈ కాంటెస్ట్ కి వస్తుంది. కానీ, ఇక్కడికి రావడం ఇష్టం లేని ఆమె భర్త విసుక్కుంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ప్రభావతి, సత్యం కూడా వస్తారు. ‘ ఇక్కడికి అందరూ వయసులో ఉన్న వాళ్లే వస్తున్నారు.. మనం గెలుస్తామంటావా?’ అని సత్యం అంటే...వయసుతో సంబంధం లేదు.. ఎవరు హుషారుగా పాల్గొన్నారు అనేదే ముఖ్యం అని మోటివేట్ చేస్తుంది. వీళ్లు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే.. కామాక్షి, ఆమె భర్త కనిపిస్తారు. కామాక్షి తప్పించుకోవాలని చూస్తే.. ప్రభావతి మిమ్మల్ని చూసేసాం అనడంతో.. ఆగి మాట్లాడుతుంది. ఇద్దరూ కాసేపు సరదాగా మాట్లాడుకుంటారు. ఇక... లోపలికి వెళ్తుంటే వాళ్లని రవి, శ్రుతి చూసేస్తారు. పనిలో పనిగా శ్రుతి పంచ్ లు వేస్తుంది. తర్వాత.. సంతకాలు చేసి లోపలికి వెళతారు. అప్పుడే మనోజ్, రోహిణీ కూడా వచ్చారు అని శ్రుతి చెబుతుంది.
ఇక... మనోజ్, రోహిణీ వెళ్లి కూర్చోగానే.. ప్రభావతి అండ్ కో కూడా వెళ్లి కూర్చొంటారు. ప్రభావతి కొడుకును చూసి.. ‘ అరేయ్ మనోజ్... ఇక్కడికి వస్తున్నాను అని చెప్పలేదు’ అని అంటే.. ‘ నువ్వు మాత్రం చెప్పావా.. గుడికి వెళ్తున్నాను అని చెప్పావు.. నాన్నను తీసుకొని వచ్చావు’ అని మనోజ్ సెటైర్ వేస్తాడు. ‘ అంతా లక్ష మహిమ అని సత్యం అంటాడు.మరి కాసేపటికే బాలు, మీనా కూడా వచ్చేస్తారు. రావడమే లోపలికి వెళ్లకుండా.. రవికి ఫోన్ చేస్తాడు. లోపలికి రమ్మని రవి చెబితే.. మీనా, బాలు లోపలికి వస్తూ ఉంటారు. వీళ్ల జంటను చూసి.. చాలా చూడ ముచ్చటగా ఉన్నారు అంటూ కొందరు మాట్లాడుకోవడం బాలు విని మురిసిపోతాడు. మీనా చేతిని పట్టుకొని మరీ నడుస్తాడు. మీనా మాత్రం సిగ్గుపడుతూ ఉంటుంది. తర్వాత వీళ్లు కూడా సంతకాలు చేసి లోపలికి వెళతారు.
వీళ్లు లోపలికి వెళ్తుండగానే ప్రభావతి,సత్యం కనపడతారు. ఓ లక్షావతి వచ్చింది అన్నమాట అని బాలు అంటే.. లక్షలు మింగిన మీ అన్నయ్య కూడా వచ్చాడు అని మీనా అంటుంది. ‘ లక్షలకు వీళ్లకు రుణాను బంధం ఉంది మీనా.. అందుకే.. ఆ పేరు ఎక్కడుంటే అక్కడ వీళ్లు వాలిపోతూ ఉంటారు. అయినా.. వీళ్లు టిప్ టాప్ గా రెడీ అయ్యి షాప్ కి వెళ్తున్నాం అన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఇక్కడికి వచ్చారు అన్నమాట.. చెబుతా వీళ్ల సంగతి’ అని బాలు వెళ్లి.... వాళ్ల ముందు చప్పట్లు కొడతాడు. వెళ్లి వాళ్ల మధ్యలో కూర్చొంటాడు ‘ కామాక్షి అత్త, లక్షావతి.. ఇట్లు లక్షలు మింగినోడు.. అందరూ వచ్చారు గా’ అని బాలు అంటే.. ఈ పోటీ కోసం పాతికవేలు ఖర్చు పెట్టా అని కామాక్షి గర్వంగా చెబుతుంది. ‘ బ్యాంకులో వేసుకుంటే వడ్డీ అయినా వచ్చేది కదా అత్త’ అని బాలు అంటే... ‘ వాళ్ల ఇష్టం రా నీకు ఎందుకు?’ అని ప్రభావతి అంటుంది. ‘ నీ దగ్గరికే వస్తున్నాను అమ్మా అని బాలు అంటుండగా .. ఇది మన ఇల్లు కాదు అని మీనా ఆపుతుంది. కానీ, బాలు ఆగడు.. వాళ్ల అమ్మ మీద కౌంటర్లు వేస్తూనే ఉంటాడు. పనిలో పనిగా మనోజ్, రోహిణీల పై కూడా పంచ్ లు వేస్తాడు. మీనా ఆపాలని చూసినా బాలు ఆగడు. దీంతో.. రోహిణీ హర్ట్ అవుతుంది.
మనోజ్ మాత్రం.. ‘ అయినా మీరేంటి?ఆడదామనే వచ్చారా?’అని అడిగితే.. ‘ లేదురా.. నువ్వు ఆడుతుంటే చప్పట్లు కొట్టడానికి వచ్చాను’ అని బాలు బదులిస్తాడు. ‘ అయినా వాళ్లు అడిగే ప్రశ్నలు మీకు అర్థం అవుతాయా’ అని ప్రభావతి అంటే... ‘ అర్థం కాకపోతే.. అర్థం అయ్యే వరకు మళ్లీ మళ్లీ అడుగుతాను. అయినా మీ లా నిమ్మకాయకు భయపడి రంగులు మార్చే మీరు కూడా నాతో మాట్లాడుతున్నారు’ అని బాలు అంటాడు. ‘ అయిపోయిందాని తవ్వకు.. అయినా చూద్దాం ఎవరు గెలుస్తారో ’ అని మనోజ్ ఛాలెంజ్ చేస్తాడు. ‘ చూడు నాన్న వాడు నన్ను టార్గెట్ చేస్తున్నాను’ అని మనోజ్ అంటే... ‘ నువ్వే నన్ను తక్కువ చేసి మాట్లాడింది’ అని బాలు అంటాడు. వీళ్లు గొడవ పడుతుండగానే.. రవి, శ్రుతి కూడా వచ్చి జాయిన్ అవుతారు.
ఈ లోగా ప్రోగ్రామ్ మొదలౌతుంది. ఈ పోటీలో మొత్తం ఐదు రౌండ్స్ ఉంటాయని, కొన్ని ప్రశ్నలతో పాటు.. కొన్ని గేమ్స్ ద్వారా విజేతను ప్రకటిస్తామని యాంకరమ్మ చెబుతుంది. తర్వాత.. ఈ కాంటెస్ట్ కి వచ్చిన జంటలను పరిచయం చేసే పనిలో యాంకర్ వస్తుంది. మనోజ్ ని అడిగిన ప్రశ్నలకు బాలు ఫన్నీగా సమాధానాలు చెబుతాడు. కామెడీగా ఉంటుంది. తమ ఫ్యామిలీలో ఎవరిని ప్రశ్నలు అడిగినా బాలునే ఆన్సర్స్ ఇస్తాడు. యాంకర్ ప్రభావతిని మీరు లక్ష్మీ దేవిలా ఉన్నారు అని పొగిడితే...అందుకే లక్షావతి అనే పేరు పెట్టాను అని బాలు సమాధానం చెబుతాడు. ప్రభావతి మాట్లాడే ప్రతి మాటలకు బాలు కౌంటర్ వేస్తూనే ఉంటాడు. మనోజ్, ప్రభావతులకు చుక్కలు చూపిస్తాడు.
ఇక.. బాలు వంతు వస్తుంది. ‘ అందరికీ నమస్కారం.. నా పేరు బాలు. నేను ఒక కారు డ్రైవర్ ని’ అని గర్వంగా చెప్పుకుంటాడు.కానీ ఎవరూ పెద్దగా చప్పట్లు కొట్టరు. మీనా తాను పూల వ్యాపారం చేస్తాను అని చెబుతుంది. ‘ పోయింది.. పరువు అంతా పోయింది’ అని మనోజ్ తక్కువ చేసి మాట్లాడతాడు. ‘ అందరి గురించి మాట్లాడేటప్పుడు చప్పట్లు కొట్టారు కానీ... మనం మాట్లాడేటప్పుడు ఎవరూ చప్పట్లు కొట్టలేదు’ అని బాలు ఫీల్ అవుతాడు. ‘ మనం ఏ తప్పు చేయలేదు కదా.. మనం వచ్చింది ఆడటానికి.. ఆట మీద దృష్టి పెడదాం’ అని మీనా చెబుతుంది.
ఆ తర్వాత ప్రోగ్రామ్ మొదలౌతుంది. భర్తకు ఏ విషయంలో భార్య ఎలా సహాయం చేయగలదు అనే కాంపిటీషన్ పెడతారు. ఒకరి తర్వాత మరొకరు పాల్గొంటూ ఉంటారు. రోహిణీ.. తన మేకప్ తో ఒక అబ్బాయిని అమ్మాయిలా అందంగా మారుస్తుంది. రోహిణీ టాలెంట్ కి మనోజ్ మురిసిపోతాడు. శ్రుతి తాను మిమిక్రీ చేయగలను అని చెప్పి, తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటుంది. ఆ సమయంలోనే తన అత్తపై పంచ్ లు వేస్తుంది. సేమ్ ప్రభావతి వాయిస్ ఇమిటేట్ చేస్తుంది. అది చూసి.. ప్రభావతి ముఖం మాడిపోతుంది. తదుపరి మీనా వంతు వస్తుంది. కళ్లు మూసుకొని పూల మాల కడతాను ని మీనా అంటుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.