
పోలీసులు ఐశ్వర్యను, లక్కీని పోలీస్ స్టేషన్‍కు తీసుకెళ్తారు. నిన్ను కిడ్నాప్ చేయడానికి తీసుకెళ్లారా అని ఐశ్వర్యను అడిగితే...తాగిన మత్తులో ఉన్న ఐశ్వర్య అవును కిడ్నాప్ చేయడానికే తీసుకెళ్లాడని చెబుతుంది. ఇంతలో రాజు వచ్చి లక్కీ తన ఫ్రెండే అని చెప్పి ఐడీ కార్డు చూపిస్తాడు. ఏం జరగలేదు కాబట్టి మీరు వెళ్లొచ్చని ఎస్సై చెప్తారు. కానీ బైక్ ఇక్కడ ఉంచి రేపు కోర్టులో ఫైన్ కట్టి తీసుకెళ్లండని చెబుతారు. డ్రంక్ అండ్ డ్రైవ్‍లో బైక్ దొరికింది కాబట్టి...వదిలే ప్రసక్తి లేదని లేదంటే...రాత్రంతా స్టేషన్‍లో ఉండి బైక్ తీసుకెళ్లండని ఎస్సై అంటారు.
ఇంతలో స్వాతి, ఇందు...పోలీస్ స్టేషన్ వస్తారు. స్టేషన్‍లో ఐశ్వర్య నానా రచ్చ చేస్తుంది. తాగిన మైకంలో తనను కిడ్నాప్ చేయాలంటూ గొడవ చేస్తుంది. స్వాతి, ఇందును చూసి ఎస్సై ఈ అమ్మాయి మీ అమ్మాయేనా అని అడుగుతారు. అవును అంటారు. పక్కనే ఉన్న నందు...ఈ అమ్మాయి పబ్‍లో నానా రచ్చ చేసిందని అంటుంది. మనకెందుకు గొడవ నువ్వు ఇక్కడి నుంచి వెళ్లని వాళ్ల బాబాయ్ కానిస్టేబుల్ చెప్తాడు. ఐశ్వర్య ఐడీ కార్డు చూపిస్తుంది ఇందు.
స్వాతి, ఇందు...ఐశ్వర్యను కారు దగ్గరకు తీసుకెళ్తారు. మత్తులో ఉన్న ఐశ్వర్య ఇందును తిడుతుంది. నువ్వు నువ్వంటే నాకు చిరాకంటూ ఇందును తోసేస్తుంది. పక్కనే ఉన్న నందు వచ్చి ఇందును పట్టుకుంటుంది. డబ్బులున్నాయని కదా తాగడం, రోడ్డు ఉంది కదా పడిపోవడం...మీరు చూస్తే డీసెంట్‍గా ఉన్నారు, ఇలాంటి దాంతో మీకు ఫ్రెండ్ షిప్ ఏంటని నందు అంటుంది. మీరెవరో కానీ చాలా ఇంటెలిజెంట్‍లా కనిపిస్తున్నారు, చూడగానే అన్నీ కరెక్ట్ గా చెప్పేస్తున్నారని స్వాతి అంటే...నేనంతే కళ్లను చూసి నిజాన్ని, మనిషిని చూసి క్యారెక్టర్‍ను చెప్పేస్తానని నందు అంటుంది. నందు చేసిన సాయానికి థ్యాంక్స్ చెప్తుంది ఇందు. తెలియని వాళ్ల గురించి ఇలా జడ్జ్ చేయడం కరెక్టు కాదని ఇందు అంటే...మరీ ఇంత మంచితనమా అని నందు అంటుంది. ఇది మంచితనం కాదు మానవత్వం, మనిషిని మనిషిలా చూడాలని ఇందు అంటుంది. ఇప్పుడున్న సమాజంలో మంచితనం, మానవత్వం రెండూ పనికిరావని నందు అని అక్కడినుంచి వెళ్లిపోతుంది.
ఇంటికి వస్తారు స్వాతి, ఇందు, ఐశ్వర్య. కారు దిగాక మళ్లీ ఐశ్వర్య...ఇందును తిడుతుంది. పోలీస్ స్టేషన్‍లో ఉంటే నిన్ను తీసుకొచ్చామని స్వాతి అంటుంది. పోలీస్ స్టేషన్‍కు ఎందుకు వెళ్లాం. ఇందు ఏమన్నా తప్పు చేసిందా? అయినా దీనికి అలవాటే తప్పులు చేయడం అని ఐశ్వర్య అంటుంది. కోపంతో స్వాతి...ఐశ్యర్యను తోసేస్తుంది. ఇంట్లోకి తీసుకొస్తుండగా రేఖ, భ్రమరాంబ ఇంట్లోనే ఉంటారు. ఇందు ఇంట్లోనే లేదు, దాన్ని కాపాడటానికి ముసలినాన్నమ్మ మన ముందు బోలెడు నాటకాలు ఆడిందని భ్రమరాంబ అంటుంది. ఇంత రాత్రిపూట ఎక్కడికెళ్లావ్, ఎవరిని కలవడానికి వెళ్లావని రేఖ నిలదీస్తుంది. నేను పెట్టిన కండిషన్‍ను బ్రేక్ చేసి నా కళ్లు గప్పి బయటికెళ్లావన్నమాట. ఇంతధైర్యం ఎలా వచ్చింది, ఎవరు చెప్తే వెళ్లావని రేఖ కోప్పడుతుంది.
అపర్ణ కలుగజేసుకుని రేఖపై ఫైర్ అవుతుంది. ఏంటీ నా మనవరాలిని దొంగను నిలబెట్టి మాట్లాడుతున్నావని అడుగుతుంది. చెడు తిరుగుళ్లు తిరుగుతుంది, అర్థరాత్రులు తాగి తందనాలు ఆడుతుంది నీ మేనకోడలు. నిలదీయాల్సింది, నిందించాల్సింది ఆ ఐశ్వర్యను. చేతనైతే దాన్ని దారిలో పెట్టు, అంతేగానీ ఏ తప్పు చేయని నా మనవరాలిని నిందిస్తే ఊరుకోనని అపర్ణ అంటుంది. ఏ తప్పు చేయకపోతే నీ మనవరాలు అర్థరాత్రి బయటకు ఎందుకు వెళ్తుంది. అది కప్పిపుచ్చాల్సిన అవసరం నీకేంటని రేఖ అడుగుతుంది. ఇందాక అడిగితే పడుకుందని చెప్పావ్, ఇప్పుడెలా బయటకు వచ్చిందని రేఖ అంటుంది. నావెనుక ఏం నడుపుతున్నారని నిలదీస్తుంది.
ఇంతలో ఇందు వచ్చి నేను ఏం తప్పు చేయలేదు అంటుంది. నా మాటను లెక్కచేయకుండా ఎందుకు బయటకు వెళ్లావు, నా మాటంటే లెక్కలేదా, ఆరోజు ఎవరు తప్పు చేసినా నీదే బాధ్యత అన్నావ్ కదా, ఇంకోక్కసారి అలా జరిగితే శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నా అన్నావ్ గా, ఇప్పుడు నువ్వు, మీ నాన్నమ్మ తప్పు చేశారు కాబట్టి చాలా పెద్ద శిక్ష వేస్తా అంటుంది రేఖ. అంతకన్నా ముందు నా వెనుక మీరేం చేస్తున్నారో తెలియాలని అంటుంది. అప్పుడు స్వాతి...ఇందు బయటకు వెళ్లడానికి నేనే కారణం అంటుంది. ఇందును వెనకేసురావడానికి స్వాతి అబద్ధం చెప్తుందని భ్రమరాంబ అంటుంది.నేను అబద్ధం చెప్పడం లేదు నిజమే చెప్తున్నా అంటుంది. ఐశ్వర్య పబ్ నుంచి బయటకు వచ్చి ఎవరో బైక్ ఎక్కింది, పోలీసులు అరెస్టు చేయడం నా ఫ్రెండ్ చూసి ఫోన్ చేసి చెప్పాడు. కావాలంటే నా ఫ్రెండ్‍కు ఫోన్ చేసి తెలుసుకోండి, లేదంటే పబ్ లో ఎంట్రీ బుక్ ఉంటుందిగా...అక్కడికి ఫోన్ చేసి తెలుసుకోండి.
మన ఇంటి పరువు పోకూడదని ఇందు అక్కని తీసుకెళ్లా అని స్వాతి అంటుంది. ఈ విషయం నాకు చెప్పొచ్చుగా అని రేఖ అంటుంది. మీరంటే భయం ఆంటీ అందుకే చెప్పలేకపోయా అంటుంది స్వాతి. మీరు అందరిని తిడుతుంటారు. కోపంగా ఉంటారు, అప్పుడు మీతో ఏమని చెప్తాను, మీ దగ్గరకు రావాలంటేనే భయం, అందుకే చెప్పలేకపోయా అని అంది స్వాతి. నిద్రొస్తుందని రూంలోకి వెళ్లిపోతుంది స్వాతి. ఇందు కూడా ఐశ్యర్యను పడుకోబెట్టడానికి రూంలోకి తీసుకెళ్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.