విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు గా బిరుదాంకితుడైన దివంగత నందమూరి తారక రామరావు (NTR) తెలుగు చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్నారు. 400 చిత్రాల్లో నటించారు. వెండితెరపై ఎన్నో పాత్రలు పోషించి లక్షలాదికి స్ఫూర్తిగా నిలిచారు. వెండితెరకే పరిమితం కాకుండా రాజకీయ నాయకుడిగానూ రికార్డు క్రియేట్ చేశారు. 1982లో అన్నగారు తెలుగుదేశం పార్టీ (టీడీపీ)ని స్థాపించారు. ఏకంగా మూడు సార్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. మహోన్నత నటుడిగానే కాకుండా విజయవంతమైన రాజకీయ నాయకుడిగానూ చెరగని ముద్ర వేశారు.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) చిత్ర పరిశ్రమలో క్రియేట్ చేసిన రికార్డుల గురించి తెలిసిందే. ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీగా సినిమాలు తీస్తూ బ్లాక్ బాస్టర్లు అందుకుంటున్నారు. లక్షలాదిగా అభిమానులను సాధించుకున్న చిరుకూడా ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. రాజకీయ నాయకుడిగా మారి సేవలందించారు. 2008లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఏపీలో ‘ప్రజారాజ్యం’ పేరుతో రాజకీయ పార్టీని ప్రారంభించారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో చిరంజీవి తిరుపతి నుండి రాష్ట్ర అసెంబ్లీ సభ్యునిగా ఎన్నికయ్యారు.
డైలాగ్ కింగ్, కలెక్షన్ కింగ్, నటప్రపూర్ణ మోహన్ బాబు (Mohan Babu) దాదాపు 500లకు పైగా ఫీచర్ ఫిల్మ్స్ ల్లో నటించారు. రాజకీయ నాయకుడిగా మారి ఆయన కూడా ప్రజా సేవ చేశారు. మోహన్ బాబు 1982లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 1995లో ఏపీ నుంచి పార్లమెంట్ సభ్యునిగా రాజ్యసభకు నామినేషన్ అందుకున్నారు. వైఎస్పార్ పార్టీ 2019లో రీఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత బీజేపీ కూడా ఆహ్వానించినట్టు సమాచారం. ఏదేమైనా ప్రస్తుతం యాక్టివ్ పాలిటిక్స్ లో లేకపోవడం గమనార్హం.
రెబల్ స్టార్, దివంగత కృష్ణం రాజు (Krishnam raju) కూడా రాజకీయ నాయకుడిగా సేవలందించారు. బీజేపీ నుంచి 1998లో కాకినాడ లోక్ సభ స్థానం నుంచి భారీ మెజార్టీతో ఎన్నికయ్యారు. ప్రజా ఆశీర్వాదంతో పార్లమెంట్ కు వెళ్లారు. ఆ తర్వాత మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆయా శాఖలు మినిస్టర్ గా సేవలు అందించారు.
సూపర్ స్టార్, దివంగత కృష్ణ (Supert Star Krishna) సైతంప్రజాసేవ కోసం రాజకీయ నాయకుడిగా మారారు. నటుడిగానే ఉండిపోక.. పొలిటిషన్ గా మారి ప్రజలకు సేవ చేశారు. రాజీవ్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1989 ఎన్నికల్లో ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. టీడీపీ అధికార ఎంపీ బొల్లా బుల్లిరామయ్యపై 71 వేల ఓట్ల తేడాతో గెలిచి ఘన విజయం సాధించారు. పేదలకు తనవంతుగా సాయం చేశారు.
సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు (Kota Srinivas) 90వ దశకంలో రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1999 నుంచి 2004 మధ్య ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. భారతీయ జనతా పార్టీ సభ్యుడిగా కోట శ్రీనివాసరావు ఎన్నికై ప్రజాసేవ చేశారు.
టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఏపీలో ప్రస్తుతం యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నారు. 2014లో రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి ప్రజా సేవకు పూనుకున్నారు. ప్రస్తుతం ఏపీలో అధికారం సొంతం చేసుకునేందుకు టీడీపీతో కలిసి పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అటు పాలిటిక్స్, ఇటు సినిమాలతో బిజీగా ఉన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా నిలిచారు.
టాలీవుడ్ సీనియర్ నటుడు బాబు మోహన్ (Babu Mohan) 1998 ఉప ఎన్నికల్లో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు మెదక్ జిల్లాలోని ఆందోల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రిగానూ పనిచేశారు. 2014లో తెలంగాణ రాష్ట్ర సమితిలో టీఆర్ఎస్ నుంచి సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మళ్లీ గెలుపొందారు. 2018లో బీజేపీలో చేరారు. అక్టోబరు 28, 2023న నుంచి రాజీనామా చేశారు.