బాలీవుడ్ మీటూ ఉద్యమం మొదలు పెట్టిన హాట్ బ్యూటీ తనుశ్రీ దత్తాని ఎవరూ మరచిపోలేరు. ధైర్యంగా ముందుకు వచ్చి ప్రముఖ నటుడు నానా పటేకర్ తోపాటు పలువురు బాలీవుడ్ ప్రముఖుల లైంగిక వేధింపులని బయట పెట్టింది.
తనుశ్రీ మొదలు పెట్టిన ఈ ఉద్యమం బాలీవుడ్ ని షేక్ చేసిందనే చెప్పాలి. తనుశ్రీ కామెంట్స్ తర్వాత చాలా మంది హీరోయిన్లు తమకు జరిగిన లైంగిక వేధింపుల సంఘటనలని బయటపెట్టారు. దీనితో తనుశ్రీ దత్తా నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ అయింది. తనుశ్రీ దత్తా ఆరోపణలతో కొందరు దర్శకులు, నటులు సినిమా అవకాశాలు కోల్పోయారు అంటే ఆ ప్రభావం ఎలాంటిదో ఊహించుకోవచ్చు.
తనుశ్రీ దత్తా ఈ ఉద్యమం మొదలు పెట్టినప్పటి నుంచి ఆమెకు వేధింపులు ఎక్కువయ్యాయి. ఆ వేధింపులకు తనుశ్రీ భయపడడం లేదు. తనపైన బాలీవుడ్ మాఫియా వేధింపులు ఇంకా కొనసాగుతున్నాయి అంటూ తనుశ్రీ దత్తా సంచలన పోస్ట్ పెట్టింది. మీటూ ఉద్యమంలో ముందుగా తనుశ్రీ దత్తా ఆరోపణలు చేసింది ప్రముఖ నటుడు నానా పటేకర్ పైనే.
తనుశ్రీ దత్తా తాజాగా ఇంస్టాగ్రామ్ పోస్ట్ లో.. నాకు ఏమైనా జరిగితే అందుకు కారణం మీటూ నిందితుడు నానా పటేకర్. అతడితోపాటు అతడి అనుచరులు, లాయర్లు, బాలీవుడ్ మాఫియాలో ఉన్న స్నేహితులు కారణం అవుతారు. బాలీవుడ్ మాఫియా అంటే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతిలో తరచుగా మీడియాలో పేర్లు వినిపించిన వారే. వారిలో క్రిమినల్ లాయర్ కూడా ఉన్నారు.
నా విషయంలో చట్టం, న్యాయం విఫలం అయ్యాయి. కానీ ఈ గొప్ప దేశంలో ప్రజలు విఫలం అవుతారని అనుకోను. వారి సినిమాలు చూడడం ఆపేయండి. నాకేమైనా జరిగితే తరిమి కొట్టండి. నన్ను ఇంకా వేధిస్తూనే ఉన్నారు. వారి జీవితంలో ప్రశాంతత దూరం చేయండి అంటూ అభిమానులని ఉద్దేశించి తనుశ్రీ సంచలన పోస్ట్ పెట్టింది.
తనుశ్రీ దత్తా తెలుగులో నటించిన ఏకైక చిత్రం వీరభద్ర. ఈ మూవీలో తనుశ్రీ బాలయ్యతో ఆడి పాడింది. ఆ చిత్రం నిరాశపరచడంతో తనుశ్రీ టాలీవుడ్ కు దూరమైంది. ఆమె బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తున్నప్పుడు నానా పటేకర్ అనేకసార్లు లైంగికంగా వేధించాడని ఆరోపించింది. ఈ ఆరోపణలతోనే మీటూ ఉద్యమం మొదలైంది.