సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణంరాజు ఇద్దరూ మంచి స్నేహితులు. అందులో ఎలాంటి సందేహం లేదు. అప్పట్లో కృష్ణ వదిలేసిన చాలా చిత్రాలు ఇతర హీరోలకు ఉపయోగపడ్డాయి అనే టాక్ ఉంది. సూపర్ స్టార్ కృష్ణ ఏం చెప్పినా నిర్మాతలు తప్పకుండా పాటించేవారు. ఎందుకంటే కృష్ణ నిర్మాతల బాగోగులు ఆలోచించే ఏ నిర్ణయం అయినా తీసుకుంటారు.
సినిమా ఫ్లాప్ అయితే కృష్ణ తన రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఒక చిత్రం విషయంలో కృష్ణకి, నిర్మాత వడ్డే రమేష్ కి విభేదాలు వచ్చాయి. దాసరి నారాయణరావు దర్శకత్వంలో కృష్ణ హీరోగా .. నిర్మాత వడ్డే రమేష్ ఒక చిత్రాన్ని ప్రారంభించారు. రెండు మూడు రోజుల్లో షూటింగ్ ప్రారంభం అవుతుంది అనగా.. తన డేట్స్ ని మరో నిర్మాతకి కూడా అడ్జెస్ట్ చేయాలని కృష్ణ రమేష్ ని కోరారు.
అప్పట్లో కృష్ణ ఒకేసారి మల్టిపుల్ ఫిలిమ్స్ చేసేవారు. డేట్స్ ని మరొకరికి ఇవ్వడం కుదరదు అని నిర్మాత రమేష్ చెప్పారట. దీనితో కృష్ణ రేపు షూటింగ్ మొదలవుతుంది అనగా ఈ సినిమా నేను చేయను అని తప్పుకున్నారు. దీనితో చేసేది లేక నిర్మాత, దాసరి ఇద్దరూ కలసి అదే చిత్రానికి కృష్ణంరాజుని హీరోగా ఫైనల్ చేశారు. కొన్ని రోజుల తర్వాత షూటింగ్ మొదలైంది.
ఆ చిత్రమే కటకటాల రుద్రయ్య. కృష్ణంరాజు కెరీర్ ని మలుపుతిప్పిన చిత్రాల్లో ఇది కూడా ఒకటి. ఈ మూవీ కృష్ణ చేసి ఎలా ఉండేదో కానీ.. కృష్ణంరాజు బాడీ లాంగ్వేజ్ కి ఇది పర్ఫెక్ట్ మూవీ. జయసుధ, జయచిత్ర హీరోయిన్లుగా నటించారు. 16 లక్షల బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రం 65 లక్షల పైగా వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించింది.
కృష్ణంరాజు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. అంతటి అద్భుతమైన చిత్రాన్ని కృష్ణ చిన్న ఇగో క్లాష్ వల్ల వదులుకున్నారు. ఈ చిత్రం కృష్ణంరాజు కెరీర్ కి బాగా ఉపయోగపడింది.