Super Machi Review: `సూపర్‌ మచ్చి` సినిమా రివ్యూ.. రేటింగ్‌

First Published | Jan 14, 2022, 8:09 AM IST

చిరంజీవి అల్లుడు కళ్యాణ్‌ దేవ్‌ రెండో చిత్రం `సూపర్‌ మచ్చి`. పులి వాసు దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా నేడు(జనవరి 14న) విడుదలైంది. సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 
 

చిరంజీవి అల్లుడు కళ్యాణ్‌ దేవ్‌ రెండో చిత్రం `సూపర్‌ మచ్చి`.  `విజేత`తో ఆకట్టుకున్న ఆయన ఇప్పుడు రెండో ప్రయత్నంగా `సూపర్‌మచ్చి` సినిమా చేశాడు. పులి వాసు దర్శకత్వం వహించి ఈ చిత్రంలో రచితా రామ్‌ కథానాయికగా నటిస్తుంది. థమన్‌ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని రిజ్వాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రిజ్వాన్‌ నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమా విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూ(Super Machi Review)లో తెలుసుకుందాం. 

కథః 
రాజు(కళ్యాణ్‌ దేవ్‌) ఎలాంటి బరువు బాధ్యతులు లేని జల్సారాయుడు. బార్‌లో పాటలు పాడుతూ ఎంజాయ్‌ చేస్తుంటాడు. రాజు అంటే పిచ్చి మీనాక్షి(రచిత రామ్‌)కి. ఆమె సాఫ్ట్ వేర్‌. మీనాక్షి అంటూ రాజుకి ఇష్టం లేదు. దీంతో ఆమె తిరస్కరిస్తాడు. మీనాక్షి వెంటపడుతుంటే తట్టుకోలేక ఓ రోజు తనతో గడిపితే పెళ్లి చేసుకుంటానని అంటాడు రాజు. రాజు అంటే మీనాక్షి ఎందుకంత ఇష్టం. మీనాక్షి ఇష్టం  ఉన్నా లేనట్టుగా రాజు ఎందుకు నటిస్తున్నాడు? రాజు కోసం మాజీ ప్రియుడిని మీనాక్షి ఎందుకు వదులుకుంది? మీనాక్షి తండ్రి(రాజేంద్రప్రసాద్‌  చివరి కోరికేంటి? వీరి లవ్‌ స్టోరీ ఏ తీరం చేరిందనేది సినిమా. 

Super Machi Review.


విశ్లేషణః 
లవ్‌, రొమాన్స్, ఎమోషన్స్ మేళవించిన చిత్రమిది. రాజు, మీనాక్షిల  వన్‌సైడ్‌ లవ్‌  ట్రాక్‌తో సినిమా సాగుతుంది. సరదా సరదాగా రన్‌ అవుతుంటుంది. రాజు పేరెంట్స్ ప్రగతి, నరేష్‌ల మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు ఫీల్‌గుడ్‌గా ఉంటాయి. మీనాక్షి పిచ్చి ప్రేమ ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేస్తుంది. అయితే రాజుని మీనాక్షి ఎందుకు అంత పిచ్చిగా ప్రేమిస్తుందనేది సస్పెన్స్ గా సాగుతూ క్యూరియాసిటీని రేకెత్తిస్తుంది. ఇంటర్వెల్‌కి ముందు వచ్చే  ఎమోషన్స్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.

సెకండాఫ్‌లో రాజు, మీనాక్షి ప్రేమ కథలు సరికొత్త టర్న్  తీసుకుంటాయి. రాజు మరో అమ్మాయిని ప్రేమించడం, మీనాక్షి కూడా మరో అబ్బాయిని ప్రేమించడం వంటి సన్నివేశాలు కథలో మరింత ఆసక్తిని రేకెత్తిస్తాయి. అదే సమయంలో మీనాక్షి, ఆమె తండ్రి మధ్య వచ్చే సన్నివేశాలు కథను ఇంట్రెస్టింగ్ ట్విస్ట్‌ను క్రియేట్ చేస్తాయి. మరణానికి ముందు తండ్రి కోరిన కోరిక కోసం ప్రాణంగా ప్రేమించే యువకుడిని ప్రేమను త్యాగం చేసి రాజు కోసం సర్వం అర్పించడానికి సిద్దమైందనే పాయింట్ అందరిని కదిలిస్తుంది. మొత్తంగా ఓ డిఫరెంట్‌  ఎక్స్ పీరియెన్స్ ని ఇస్తుంది. 

అయితే దర్శకుడ పులి వాసు కథ బాగుంది. కానీ తెరపై ఆవిష్కరించడంలో తడబాటు కనిపిస్తుంది. లవ్‌, రొమాంటిక్‌, ఎమోషనల్‌ మూవీ. కానీ  ఆ ఎమోషన్స్ ఆశించిన స్థాయిలో క్యారీ కాలేకపోయాయి.  తండ్రి (రాజేంద్రప్రసాద్), కూతుళ్ల (రచిత రామ్) మధ్య సన్నివేశాలను మరింత ఎమోషనల్‌గా రక్తికట్టించేలా చేస్తే సినిమా  ఫలితం వేరేలా  ఉండేది. దీంతో చాలా వరకు సన్నివేశాల రొటీన్‌గా అనిపిస్తాయి. బలమైన పాయింట్‌లోని, ఎమోషన్స్ లోని ఫీల్‌  స్థాయిని తగ్గించాయి. అయితే క్లైమాక్స్ మాత్రం కాస్త ఊరటనిస్తుంది. 

నటీనటులుః 
అల్లరి చిల్లరిగా, బాధ్యతకుండా తిరిగే రాజు పాత్రలో కళ్యాణ్‌ దేవ్‌ బాగానే ఒదిగిపోయాడు. ప్రేమికుడిగా ఆయన చూపించిన వేరియేషన్స్ ఆకట్టుకుంటాయి. మొదటి సినిమాతో పోల్చితే దీంట్లో నటుడిగా ఆయన అనుభవం కనిపిస్తుంది. పాత్రకి న్యాయం చేశాడని చెప్పొచ్చు. ఫైట్స్ సీన్స్ లో అదరగొట్టాడు. మీనాక్షి పాత్రలో నటించిన రచిత రామ్‌ సినిమాకి పెద్ద అసెట్‌.  ఆమె పాత్ర చుట్టూతే  సినిమా సాగుతుంది. అందం, అభినయంతో మాయ చేసింది. రాజేంద్రప్రసాద్‌, ప్రగతి, నరేష్‌ నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వాళ్లు ప్రూవ్డ్ యాక్టర్స్. తమ పాత్రలను పండించారు. 

సాంకేతికంగాః 
ఇటీవల వరుస హిట్లతో దూసుకుపోతున్న మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌ తన స్థాయి మ్యూజిక్‌ ఇందులో కనిపించదు. అదే పెద్ద మైనస్‌. పాటలు ఆకట్టుకునేలా ఉంటే  ఫలితం ఆకట్టుకునేలా ఉండేది. శ్యామ్‌ కే నాయుడు కెమెరా వర్క్ కనువిందుగా ఉంటుంది. మార్తాండ్‌ వెంకటేష్‌ ఎడిటింగ్‌ పరంగా మరింత కేర్‌ తీసుకోవాల్సిందే. నిర్మాత రిజ్వాన్‌ నిర్మాణ విలువలు  సినిమాకి అసెట్‌. బాగా రిచ్‌గా తీశారు. సినిమాపై ఉన్న ప్యాషన్‌ని చాటుకున్నారు. దర్శకుడు పులి వాసు కథని,  దాన్ని అంతే బాగా తెరపై ఆవిష్కరించడంలో మరింత కేర్‌ తీసుకోవాల్సిందే. అశ్లీలత, డబుల్‌ మీనింగ్‌  డైలాగ్‌లులేకుండా క్లీన్‌ ఫ్యామిలీ  ఎంటర్‌టైనర్‌ని తెరకెక్కించే ప్రయత్నం చేశారు. కానీ ఎమోషన్స్ ని తెరపై ఆవిష్కరించడంలో, ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఆవిష్కరించడంలో కాస్త తడబాటు కనిపిస్తుంది. అదే సమయంలో మధ్య మధ్యలో వచ్చే ట్విస్ట్ లు సర్‌ప్రైజింగ్‌గా ఉంటాయి.
 

ఫైనల్‌గాః  మొత్తంగా `సూపర్‌ మచ్చి` సంక్రాంతికి మంచి టైమ్‌ పాస్‌ మూవీ అని చెప్పొచ్చు.

రేటింగ్‌-2.5

నటీనటులు: కల్యాణ్ దేవ్, రచిత రామ్, వీకే నరేష్, పోసాని కృష్ణ మురళి, రాజేంద్ర ప్రసాద్, ప్రగతి, మహేష్ ఆచంట తదితరులు.
 రచన, దర్శకత్వం: పులివాసు.
నిర్మాత: రిజ్వాన్ (రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌)
 సినిమాటోగ్రఫి: శ్యామ్ కే నాయుడు
 ఎడిటింగ్: మార్తాండ్ కే వెంకటేష్
ఆర్ట్: బ్రహ్మ కడలి
 మ్యూజిక్: ఎస్ థమన్.

Latest Videos

click me!