కుప్పం 'కేజీఎఫ్': సుధీర్ బాబు 'హరోం హర' రివ్యూ

First Published Jun 14, 2024, 1:46 PM IST

సినిమా ఎలా ఉంది? సుధీర్ బాబు ఈ సినిమాతో ఆడియన్స్ ను మెప్పించాడా? అనేది ఈ రివ్యూలో చూద్దాం.

Harom Hara


సుధీర్ బాబు సినిమా అంటే పెద్దగా మార్కెట్ లేని పరిస్దితి క్రియేట్ అయ్యిపోయింది. అయితే ఈ చిత్రం ట్రైలర్, టీజర్ వచ్చాక బజ్ క్రియేట్ అవటం మొదలైంది. సుధీర్ బాబు ఈ సారి హిట్ కొట్టబోతున్నాడేమో అని ఆశ కలిగించింది. దానికి తోడు సుధీర్ బాబు కూడా ఎన్నడూ లేని విధంగా ప్రమోషన్స్ లో ఈ సినిమా పై చాలా కాన్ఫిడెంట్ చూపించాడు. ఓ కొత్త తరహా సినిమా చూడబోతున్నామని హామీ ఇచ్చాడు. ఇంతకీ ఈ సినిమా సుధీర్ బాబు చెప్పినట్లు కొత్తగా ఉందా..అసలు కథేంటి...ఈ సినిమాతో అయినా సుధీర్ బాబు హిట్ ట్రాక్ లోకి ప్రవేశిస్తాడా చూద్దాం. 

Sudheer Babus Harom Hara


కథేంటి

కుప్పం నేపధ్యంలో ఎనభైల్లో జరిగే కథ ఇది. అప్పట్లో ఆ ప్రాతాన్ని మకుటం లేని మహారాజుల్లా  తిమ్మారెడ్డి , అతని సోదరుడు బసవ(రవి కాలె), కొడుకు శరత్ రెడ్డి(అర్జున్ గౌడ) పాలిస్తూంటారు. వాళ్లు ఏం చెప్తే అది జరగాలి. వాళ్లు చెప్పిందే న్యాయం, చట్టం. జనం చివరకు తలెత్తి వాళ్లను చూడాలన్నా చిచ్చు పోసుకుంటూకుంటూంరు. అలా నలిగిపోతున్న వారిని కష్టాలను బయిటపడేయటానికి ఓ సేవియర్ కావాలి. అందుకోసం ఎదురుచుస్తున్నట్లున్నట్లుగా ఉంటుంది సిట్యువేషన్. ఇంతకీ ఆ సేవియర్ ఎవరూ అంటే... సుబ్రహ్మణ్యం(సుధీర్ బాబు) .

Sudheer Babus Harom Hara film


అక్కడికి కుప్పం పాలిటెక్నిక్ కాలేజీలో మెకానికల్ ల్యాబ్ అసిస్టెంట్ గా పని చేయటానికి  సుబ్రహ్మణ్యం(సుధీర్ బాబు) వస్తాడు. ఒకరోజు శరత్ రెడ్డి మనిషితో గొడవ అయ్యి కాలేజీ నుంచి సస్పెండ్ అవుతాడు. ఉద్యోగం లేక  ఆర్థికంగా  ఇబ్బంది పడుతూంటాడు. ఇంటికి వెళ్లిపోదామంటే తండ్రి శివారెడ్డి (వి జయప్రకాశ్) అప్పులు పాలై ఉంటారు.  అప్పులు ఇచ్చినోళ్లు అంతా ఇంటి మీద పడుతూంటారు. వాళ్లకు మూడు నెలల్లో బాకీ తీరుస్తానని వాళ్లకు మాట ఇచ్చి మరీ  కుప్పం వస్తాడు. 

Sudheer Babus Harom Hara


అప్పుడు తన ప్రెండ్ ఆల్రెడీ  సస్పెండెడ్ కానిస్టేబుల్ పళని స్వామి(సునీల్) దగ్గర ఒక తుపాకీ చూస్తాడు. ఆ తుపాకీతో పాటు ఒక బ్లూ ప్రింట్ కూడా ఉండటం గమనిస్తాడు. అంతే అక్కడ నుంచి తన లైఫ్ మార్చుకుంటాడు. పళని స్వామి (సునీల్)తో కలిసి అక్రమంగా తుపాకీలు తయారు చేసి అమ్మడం మొదలు పెడతారు. ఆ బిజినెస్ లో భారీగా సంపాదించే సుబ్రమణ్యంకి శత్రువులు తయారుఅవుతారు. ఈ క్రమంలో తమ్మి రెడ్డి కొడుకు శరత్ రెడ్డి (అర్జున్ గౌడ) మనుషులతో స్నేహం ఏర్పడుతుంది. కానీ.. ఒక రోజు తన తండ్రిని చంపబోయిన శరత్ రెడ్డిని సుబ్రమణ్యం కొడతాడు.అసలు శరత్ రెడ్డికి, సుబ్రమణ్యం తండ్రికి మధ్య గొడవలేంటి..చివరకి  సుబ్రహ్మణ్యం పరిస్దితి ఏమైంది.  ఆ ఊరువారు ఆశించినట్లుగా అతను వాళ్లకు సేవియర్ గా మారాడా...   ఈ సినిమాకి హరోం హర అనే టైటిల్ ఎందుకు పెట్టారు? లాంటి విషయాలు మాత్రం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

Sudheer Babus Harom Haras trailer out

విశ్లేషణ:

ట్రెండ్ ని ఫాలో అయ్యేవాళ్లు కొందరు ఉంటారు. ట్రెండ్ ని సెట్ చేసే వాళ్లు మరికొందరు ఉంటారు. ట్రెండ్ తో సంభందం లేకుండా తమ పని తాము చేసుకుంటూ వెళ్లేవాళ్లు మరో బ్యాచ్. అయితే ఈ డైరక్టర్ ట్రెండ్ లో ఉంటే ట్రెండింగ్ లో ఉంటామని నమ్మినట్లున్నట్లున్నాడు. ప్రస్తుతం మార్కెట్ లో దుమ్ము రేపుతున్న కేజీఎఫ్, పుష్ప లా ఓ కథ చేసుకుని ముందుకు వచ్చాడు. అయితే సుధీర్ బాబుతో అంతకు మించి ఆప్షన్ కూడా లేదు. గత కొన్నేళ్లుగా మెల్లి మెల్లిగా  ఫ్యామిలీ డ్రామా సినిమాలు మెల్లిగా ఓటిటిలకు ,టీవీలకు షిప్ట్ అయ్యిపోయాయి. దాంతో  పనిగట్టుకుని వెళ్లి పెద్ద తెరపై చూడాలంటే చిన్న తెరపై ఈ సినిమా చూడలేము అనుకున్న సినిమా అయ్యిండాలి. దాంతో భారీ తనం,యాక్షన్ చిన్న సినిమాలకు కూడా తప్పటం లేదు. 

Sudheer Babu Harom Hara


మీడియం స్దాయి హీరోలు కూడా భారీ యాక్షన్ ని తెరపై చూడకపోతే పట్టించుకోవటం లేదు. ఆ విషయం సుధీర్ బాబు ఇన్నాళ్లకు అర్దం చేసుకుని చేసిన సినిమా ఇది. హంట్ లు, మాయా మశ్చీంద్రలు మాడు పగల కొట్టిన తర్వాత విలన్స్ వీపు పగలకొట్టకపోతే, గన్ పట్టుకుని గాండ్రించకపోతే రాణించలేమని క్లారిటీ వచ్చింది. అందుకు దర్శకుడు  జ్ఞాన సాగర్ ద్వారక తన టెక్నికల్ టీమ్ తో సహకరించాడు. సుధీర్ బాబుకు యాక్షన్ సీన్స్ కొత్త కాదు కాబట్టి అదరకొట్టాడు. అందుకు కేజీఎఫ్ టెంప్లేట్ ని ఎంచుకున్నారు. ఒక సామాన్యుడు..అసమాన్యంగా క్రైమ్ సామ్రాజ్యంలో ఎదిగటం కాన్సెప్టుగా అనుకున్నారు. అందుకోసం కేజీఎఫ్,పుష్ప ల స్క్రీన్ ప్లే దగ్గర  పెట్టుకుని కథ చేసుకున్నారు. అయితే ఇలాంటి సినిమాకు అవసరమైనంత బలంగా  విలన్ క్యారక్టర్ ని డిజైన్ చేయలేదు. 

Sudheer Babus Harom Hara

లోకేష్ కనకరాజ్ ని కొన్ని సీన్స్ లో డైరక్టర్ ఆవాహన చేసుకున్నాడు. మరీ ముఖ్యంగా ఇంట్రవెల్, క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్స్ లో. ఇక పుష్ప లో చిత్తూరు యాసను ఇక్కడికి తీసుకొచ్చారు. ఇలా సక్సెస్ ఫుల్ ఫార్ములాని అనుకరిస్తూ, అనుసరిస్తూ చాలా వరకూ సక్సెస్ అయ్యారు. అయితే యాక్షన్ ఎపిసోడ్స్ పై పెట్టిన శ్రద్ద సినిమాలో డ్రామా పై పెట్టలేదు. దాంతో సీన్స్ వస్తూంటాయి.వెళ్తూంటాయి. కానీ మనకేమీ అనిపించదు. అలాగే కావాలనే స్లో ఫేజ్ లో కథను నడిపారు. ఫస్టాఫ్ ఇంటర్వెల్ ఫైట్ దాకా పెద్దగా ఆసక్తిలేకుండా నడుస్తుంది. ఒక్క సారిగా ఇంటర్వెల్ ఫైట్ లో నిద్రలోకి జారుకోబోయే మనని లేపి కూర్చోపెట్టి సినిమాలో ఏదో విషయం ఉందే అనిపిస్తాడు. సెకండాఫ్ లో కూడా అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్ వస్తూంటాయి. హీరో తనను నమ్మిన విలేజ్ జనం కోసం కష్టపడుతూంటాడు. అయితే విలన్ వీక్ గా ఉండటంలో డ్రామాలో హై రాలేదు. అయితే ఓవరాల్ గా అలా నడిచిపోతుంది. 


ప్లస్ పాయింట్స్

సుధీర్ బాబు ఫెరఫెర్మెన్స్
ఇంట్రవెల్ బ్లాక్, సెకండాఫ్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్
టెక్నికల్ గా మంచి అవుట్ ఫుట్, ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ 
నిర్మాణ విలువలు
 

Harom Hara


మైనస్ పాయింట్స్

తెలిసిన టెంప్లేట్, స్లో నేరేషన్
డ్రామా లేకుండా ప్రెడెక్ట్ చేయగలిగేలా సీన్స్
విలన్ వీక్ గా ఉండటం
ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్
స్క్రీన్ ప్లే 

Harom Hara


టెక్నికల్ గా :

డైరక్టర్ మంచి టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తిలా ఉన్నారు. అన్ని డిపార్టమెంట్స్ నుంచి మాగ్జిమం అవుట్ ఫుట్ తీసుకున్నాడు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరకొట్టారు. ఆ యాక్షన్ సీన్స్ సింక్ అయ్యేలా బీజీఎం,కెమెరా వర్క్ ఫెరఫెక్ట్ గా ఉంది. ఎనభైల నాటి కుప్పం ను చూపటంలో కెమెరా డిపార్టమెంట్, ఆర్ట్ డిపార్టమెంట్, కాస్ట్యూమ్స్ బాగా కష్టపడ్డారు. డైరక్టర్ ప్రతీ ఫ్రేమ్ ని చెక్కేందుకు ప్రయత్నించారు. 
 

Harom Hara

 
నటీనటుల్లో ...

సుధీర్ బాబు చాలా కాలం తర్వాత సెటిల్డ్ గా చేసారు. హీరోయిన్ మాళవిక శర్మకు పెద్దగా సీన్స్ లేవు కానీ ఉన్నంతలో బాగా చేసింది. ఇక సినిమాలో చిత్తూరు యాసలో మాట్లాడుతూ అదరకొట్టింది సునీల్. అతనిది హైలెట్ క్యారక్టరైజేషన్.  మిగతా కీ రోల్స్ లో జయప్రకాశ్ సహా, రవి కాలే, అర్జున్ గౌడ వంటి వాళ్లు చేసుకుంటూ వెళ్లిపోయారు. 

Harom Hara

ఫైనల్ థాట్

సుధీర్ బాబు బాడీ లాంగ్వేజ్ కు, అతని బాడీ బిల్డింగ్ నైపుణ్యానికి ఇలాంటి సినిమాలే ఫెరఫెక్ట్. ఇదే కంటిన్యూ చేస్తే ..తెలుగులో యాక్షన్ సినిమాలు చూసే వారికి  మంచి ఆప్షన్ దొరికినట్లే.  

Rating: 2.75
---సూర్య ప్రకాష్ జోశ్యుల

Harom Hara

 
బ్యానర్  : శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్
నటీనటులు : సుధీర్ బాబు, మాళవిక శర్మ,సునీల్, జయప్రకాశ్, రవి కాలే, అర్జున్ గౌడ తదితరులు. 
సంగీతం  : చైతన్ భరద్వాజ్
డీవోపీ  :అరవింద్ విశ్వనాథన్
ఎడిటర్ :రవితేజ గిరిజాల
రచన, దర్శకత్వం :జ్ఞానసాగర్ ద్వారక
నిర్మాత  :సుమంత్ జి నాయుడు
విడుదల తేదీ : 14, జూన్ 2024

Latest Videos

click me!