పాటల దిగ్గజం సిరివెన్నెల సీతారామశాస్త్రి (Sirivennela Seetharama Sastry Dead) (66)కన్నుమూశారు. గత వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్ప పొందుతూ మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. కొన్ని రోజులుగా న్యూమోనియాతో బాధపడుతున్న సిరివెన్నెల ఈ నెల 24నే ఆసుపత్రిలో చేరారు. మంగళవారం ఆరోగ్యం విషమించడంతో సిరివెన్నెల తుదిశ్వాస విడిచారు.
సిరివెన్నెల తన కెరీర్ లో 3 వేలకు పైగా పాటలు రాశారు. కానీ ఎప్పుడూ ఆయన విలువలు వదిలిపెట్టలేదు. సిరివెన్నెల పాటల్లో ఒక్క చెడు మాటనైనా కనిపెట్టడం కష్టం. సిరివెన్నెల ఆహ్లాదభరితమైన పాటలు, ప్రేమ పాటలు.. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని సమాజాన్ని అంటూ సమాజాన్ని ఆలోచింపజేసే పాటలు ఎన్నో రాశారు. సిరివెన్నెల తన కెరీర్ లో 11 సార్లు నంది అవార్డు అందుకున్నారు. ఆయన ఎంతటి ప్రతిభాశాలో దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు.
శ్రుతిలయలు, స్వర్ణ కమలం, గాయం, శుభలగ్నం, సింధూరం, చక్రం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి ఎన్నో చిత్రాలకు సిరివెన్నెల నంది అవార్డులు సొంతం చేసుకున్నారు. రుద్రవీణ చిత్రంలోని 'నమ్మకు నమ్మకు ఈ రేయిని' సాంగ్ ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది. కానీ ఆ పాటలో అంతే లోతైన భావం దాగుంది.
సిరి వెన్నెల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా పాటకు నేనెప్పుడూ రేటు నిర్ణయించుకోలేదు. ఇండస్ట్రీలో చాలా త్వరగా సెటిల్ అయ్యా. కానీ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి చాలా సమయం పట్టింది. రెండు నందుల తర్వాత కూడా నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఎందుకంటే నా పాటకు నేనెప్పుడూ రేటు అడగలేదు. ఇచ్చినంత తీసుకున్నాను అని చెప్పారు.
నా పాటలో మూడు కండిషన్స్ ఉంటాయి. స్త్రీలని కించపరిచే విధంగా రాయను.. సమాజానికి చెడు సందేశం వెళ్లే పాటలు రాయను.. యువత కిర్రెక్కిలా, పెడద్రోవ పట్టే పాటలు కూడా రాయను అని చెప్పారు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో దూసుకుపోతున్న పాటల రచయితలలో రామజోగయ్య శాస్త్రి ఒకరు. రామజోగయ్య.. సిరివెన్నెలని తన గురువుగా భావిస్తారు. ఒక సందర్భంలో సిరివెన్నెల తనని మందలించారని రామజోగయ్య శాస్త్రి స్వయంగా తెలిపారు.
Pawan Kalyan 'పంజా' చిత్రం కోసం రామజోగయ్య శాస్త్రి 'వైరా వెయ్ రా చై వెయ్ రా' అనే సాంగ్ రాశారు. ఆ పాటలో శృంగారభరితమైన లిరిక్స్ ఉంటాయి. హాట్ హాట్ గా యువతని టార్గెట్ చేస్తూ చిత్రీకరించిన పాట అది. అలాంటి పాట రాయాల్సిన అవసరం ఏంటని సిరివెన్నెల రామజోగయ్యని మందలించారట. నేను ఆ సాంగ్ కోసం రెండు వెర్షన్స్ రాశాను గురువుగారు.. కానీ దర్శకుడు ఈ వెర్షన్ ని ఎంచుకున్నారు. ఇంకో వెర్షన్ లో ఇంత ఘాటుగా పదాలు ఉండవు అని రామజోగయ్య సిరివెన్నెల చెప్పారట.
దీనికి సిరివెన్నెల బదులిస్తూ.. దర్శకుడికి ఏం కావాలో తీసుకునే హక్కు ఉంది. కానీ ఏమి ఇవ్వాలో.. ఎలాంటి పాట ఇవ్వాలో నీచేతుల్లో ఉంది.. ఇకపై ఇలాంటి సాంగ్స్ రాయకు అని సిరివెన్నెల తనకు వార్నింగ్ ఇచ్చినట్లు రామజోగయ్య తెలిపారు.