Soundarya
చిత్ర పరిశ్రమలో సౌందర్య ఎన్నో ఘన విజయాలు సాధించారు. పిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు సౌందర్య వెళ్లిపోయారు. అయితే నటన విషయంలో సౌందర్య చాలా మంది హీరోయిన్లకు, నటులకు ఆదర్శంగా నిలిచారు. గ్లామర్ జోలికి వెళ్లకుండా ప్రేక్షకులని ఎలా మెప్పించవచ్చు, వాళ్ళ మనసులు ఎలా గెలుచుకోవచ్చు అనేదానికి సౌందర్య ఉదాహరణ.
Soundarya
ఎంతో మందికి అభిమాన నటి అయిన సౌందర్యకి కూడా ఇష్టమైన నటీనటులు ఉన్నారు. ఒక హీరోయిన్ విషయంలో సౌందర్యకి ఆసక్తికర సంఘటన ఎదురైంది. సౌందర్యకి ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు అని ప్రశ్నించగా సౌందర్య బదులిచ్చారు. టాలీవుడ్ లో ప్రస్తుతం ఒక అమ్మాయి నటన నాకు బాగా నచ్చుతోంది. ఆమె పేరు లయ అని సౌందర్య చెప్పారు.
లయ చాలా ప్రామిసింగ్ గా అనిపిస్తోంది అని సౌందర్య ప్రశంసలు కురిపించారు. అప్పటికి సౌందర్యతో లయకి అసలు పరిచయం లేదు. సౌందర్య ఇంటర్వ్యూ చూసిన లయ వెంటనే ఆమె ఇంటికి వెళ్లారట. ఏంటి ఇలా వచ్చారు అని సౌందర్య అడిగితే.. నా గురించి మీరు ఇంటర్వ్యూలో మాట్లాడారు. దానికి థ్యాంక్స్ చెబుదామని వచ్చాను అని లయ చెప్పిందట.
అయ్యో దానికి ఇంత దూరం రావాలా అని సౌందర్య అడిగారు. లేదు మేడం, మీ నోటి నుంచి నా పేరు వచ్చింది అంటే అది నాకు చాలా పెద్ద విషయం అని లయ చెప్పింది. అదే సమయంలో లయ పెళ్లి చేసుకుందాం కన్నడ రీమేక్ లో నటిస్తున్నారు. తెలుగులో వెంకటేష్, సౌందర్య నటించిన హిట్ చిత్రం అది. పెళ్లి చేసుకుందాం రీమేక్ గురించి కూడా సౌందర్య లయకి సలహాలు ఇచ్చారట.
నాలాగా ఇమిటేట్ చేయమన్నా, కాపీ చేయమన్నా చేయకు. నీ స్టైల్ లో నువ్వు చేయి, బావుంటుంది అని సౌందర్య సలహా ఇచ్చారట. సౌందర్యతో మాట్లాడిన ఆ క్షణాలు తన జీవితంలో మెమొరబుల్ అని లయ పేర్కొన్నారు.