
సమంత ప్రధాన పాత్రలో నటించిన మైథలాజికల్ మూవీ `శాకుంతలం`. సమంత ఫస్ట్ టైమ్ పురాణాల నేపథ్య కథతో రాబోతుంది. ఇందులో ఆమె శకుంతలగా కనిపించబోతుంది. దేవ్ మోహన్ దుష్యంతుడిగా నటించారు. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. వరుస పరాజయాల అనంతరం ఆయన్నుంచి వస్తోన్న సినిమా ఇది. గుణాటీమ్ వర్క్స్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకాలపై నీలిమా గుణ, దిల్‌రాజు నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. సినిమాని ఇప్పటికే పెయిడ్ ప్రీమియర్ షో వేశారు. దీనికి వస్తోన్న స్పందన ఎలా ఉందనేది తెలుసుకుందాం.
సమంత అనేక స్ట్రగుల్స్ అనంతరం, వాటిని దాటుకుని, అన్నింటిని ధైర్యంగా ఎదుర్కొని నిలబడింది. తాను పవర్‌ఫుల్ ఉమెన్ అని నిరూపించుకుంది. సరిగ్గా `శాకుంతలం` చిత్రంలోనూ శకుంతల పాత్ర కూడా అలాంటి స్ట్రగుల్సే పడబోతుంది. అలా సినిమాకి, సమంతకి మంచి కనెక్షన్ ఉందని చెప్పొచ్చు. అయితే సినిమా ప్రధానంగా దుష్యంత్, శకుంతల మధ్య ప్రేమ కథ, ఎమోషన్స్, స్ట్రగుల్స్ ప్రధానంగా సాగుతుందట. తాజాగా దర్శకుడు గుణశేఖర్ ఈ విషయాన్ని తెలిపారు. శృంగార కోణం కాకుండా ఆమె పడే బాధలు, సంఘర్షణ వంటి భావోద్వేగాల సమాహారంగా ఈ సినిమాని తెరకెక్కించినట్టు తెలిపారు. సమంత చేయకపోతే ఈ సినిమాని చేసేవాడిని కాదు అని కూడా ఆయన చెప్పడం విశేషం. మరి ప్రీమియర్స్ షో చూసిన ఆడియెన్స్ కి సినిమా నచ్చిందా? గత చిత్రాల విమర్శలను అధిగమించి దర్శకుడు గుణశేఖర్ ఈ సినిమాతో హిట్ కొడతాడా? సమంత మెప్పిస్తుందా? అనేది చూద్దాం.
`శాకుంతలం` చిత్రానికి చాలా వరకు మిక్స్ డ్ టాక్ వస్తుంది. సినిమా ఓ భావోద్వేగాల సమాహారంగా ఉందని అంటున్నారు. సమంత అద్భుతంగా చేసిందని, ఆమె పడే బాధలను దర్శకుడు బాగా చూపించాడని అంటున్నారు. సమంత, దేవ్ మోహన్ నటన బాగుందట. మైథలాజికల్ మూవీ కావడంతో సంగీత దర్శకుడు మణిశర్మ మంచి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారని అంటున్నారు. అల్లు అర్హ పాత్ర సర్‌ప్రైజింగ్‌గా ఉంటుందని, ఆమె చెప్పే తెలుగు డైలాగ్‌లు ముచ్చటగా ఉంటాయట.
కానీ చాలా వరకు నెగటివ్ టాక్ వినిపిస్తుంది. సినిమా చాలా స్లోగా ఉంటుందట. విజువల్ ఆహో, ఓహో అనే స్థాయిలో ఏం లేదని, `అవతార్` లాంటి సినిమాలను చూసిన వారికి ఇవి గొప్పగా అనిపించవని అంటున్నారు. ఇక కథనం చాలా స్లోగా ఉందట. సీరియల్ సాగినట్టుగా ఉంటుందని, హిందీ సీరియల్స్ చూసిన వారికి ఇది పెద్దగా ఎక్కదని, మరీ క్లాసీ స్టయిల్‌లో సినిమా సాగడంతో బోర్ ఫీలింగ్ తెప్పిస్తుందని అంటున్నారు. సినిమాలో చాలా పాత్రలుండటంతో ఎవరికీ సరైన ప్రాధాన్యత దక్కలేదంటున్నారు. అవి కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేస్తాయట. చాలా సీన్స్ రొటీన్‌గానే అనిపించాయని చెబుతున్నారు. మైథలాజికల్ మూవీ అయినా, రెగ్యూలర్ ఫ్యామిలీ డ్రామాల్లోని సీన్లని తలపించాయని అంటున్నారు. ఎంచుకున్న ఫ్లాట్ మాత్రం కొత్తది గానీ, సీన్లు మాత్రం రొటీన్‌గానే ఉన్నాయని చెబుతున్నారు. విజువల్ వండర్, కళాఖండం అనేంత స్థాయి లేదని, వినోదానికి ఆస్కారం లేదంటున్నారు. మరి వాస్తవంగా సినిమా ఎలా ఉందనేది తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.
ఇదిలా ఉంటే ఈ సినిమాని వరుసగా ప్రీమియర్స్ వేయాలనుకున్నారు. `రైటర్ పద్మభూషణ్`, `రంగమార్తాండ` సినిమాల తరహాలోనే చాలా చోట్ల ప్రీమియర్స్ ప్రదర్శించాలనుకున్నారు. కానీ కేవలం ఒక్క షోనే వేసి ఆపేశారు. ప్రీమియర్స్ కి వచ్చిన నెగటివ్ టాక్ కారణంగానే ఆపేశారని తెలుస్తుంది. దీనిపై దర్శకుడు స్పందిస్తూ, టెక్నీకల్ గా కొన్ని మిస్టేక్స్ కనిపించాయని వాటిని సరిచేయడం కోసం షోలు ఆపేశామని చెప్పారు గుణశేఖర్. రేపు ప్రీమియర్స్ ప్రదర్శిస్తామని చెప్పారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాకి ఎంత చేసినా హైప్ రావడం లేదు. సమంత తప్ప పెద్ద కాస్టింగ్ లేకపోవడంతో రీచ్ లేదు. దీంతో మరో రూపంలో సినిమాకి ప్రమోషన్ చేసే పనిలో పడ్డారు నిర్మాత దిల్ రాజు. హిందుత్వాన్ని ఎత్తుకోబోతున్నాడట. హిందూ భావాజాలంతో రాజకీయాలు చేస్తూ మనుగడ సాధిస్తున్న బీజేపీ పార్టీ తో ఈ సినిమాకి ప్రమోషన్స్ తెప్పించే ప్లాన్ చేస్తున్నారట. అందులో భాగంగా ఈ సాయంత్రం ఢిల్లీలో కొందరు బీజేపీ మంత్రులు, ఎంపీలకు ప్రత్యేకంగా సినిమాని చూపిస్తున్నారు. ఇది వారికి కనెక్ట్ అయితే హిందుత్వం బేస్డ్ గా ఈ చిత్రానికి ఆదరణ దక్కుతుందనే ఆశాభావంతో దిల్‌రాజు ఉన్నారని సమాచారం. మరి దిల్‌రాజు ఎత్తుగడలు పనిచేస్తాయా? గుణశేఖర్ ఈ చిత్రంతో బయటపడతాడా? సమంత తన సత్తాని చాటుతుందా? అనేది చూడాలి. కంటెంట్ బాగాలేకపోతే ఏం చేసినా ప్రయోజనం ఉండదనేది జగమెరిగిన సత్యం. కంటెంట్ ఉంటే ఎవరెన్ని చెప్పినా ఆగదనేది వాస్తవం.