JVR: బాలల 'దాన వీర శూర కర్ణ' చిత్ర నిర్మాత మృతి.. టికెట్ బుకింగ్ క్లర్క్ నుంచి ప్రొడ్యూసర్ వరకు ప్రయాణం

Published : Oct 29, 2026, 07:42 AM IST

తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ నిర్మాత చలసాని వెంకటేశ్వరరావు కన్నుమూశారు. సినిమా హాలు ఉద్యోగి నుంచి నిర్మాతగా ఎదిగిన ఆయన పలు చిత్రాలను నిర్మించారు. నందమూరి జానకిరామ్ తనయుడు మాస్టర్ ఎన్టీఆర్ తో బాలల దాన వీర శూర కర్ణ చిత్రాన్ని కూడా తెరకెక్కించారు.

PREV
14
సినీ పరిశ్రమలో విషాదం

తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ నిర్మాత చలసాని వెంకటేశ్వరరావు బుధవారం రాత్రి వయోధిక సమస్యలతో తుదిశ్వాస విడిచారు. జేవీఆర్‌, జగపతి వెంకటేశ్వరరావు పేర్లతోనూ ఆయనకు గుర్తింపు ఉంది. ఆయన మరణవార్తతో సినీ వర్గాల్లో విషాదం నెలకొంది. నిర్మాతగా తెలుగు సినిమాకు సేవలందించిన ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

24
జగపతి మూవీ క్రియేషన్స్‌పై సినిమాలు

చలసాని వెంకటేశ్వరరావు జగపతి మూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై పలు చిత్రాలను నిర్మించారు. 1990లో తమ్మారెడ్డి భరద్వాజ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘నేటి దౌర్జన్యం’ ఆయన నిర్మించిన చిత్రాల్లో ఒకటి. ఇందులో వినోద్ కుమార్ కథానాయకుడిగా నటించారు. 1992లో బి. విఠలాచార్య దర్శకత్వంలో తెరకెక్కిన భక్తిరస చిత్రం ‘కరుణించిన కనకదుర్గ’ను కూడా నిర్మించారు. ఇందులో యమున కథానాయికగా కనిపించారు.

34
పౌరాణిక చిత్రంపైనా ముద్ర

2015లో విడుదలైన ‘దాన వీర శూర కర్ణ’ చిత్ర నిర్మాణంలోనూ జేవీఆర్‌ భాగస్వామిగా ఉన్నారు. బాలరాజుతో కలిసి ఈ సినిమాను నిర్మించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టారు. నందమూరి జానకీరామ్‌ తనయుడు మాస్టర్ ఎన్టీఆర్‌ శ్రీకృష్ణుడి పాత్రలో నటించిన ఈ పౌరాణిక చిత్రాన్ని బాల నటులతో రూపొందించారు. విభిన్నమైన కథాంశాలతో సినిమాలు తెరకెక్కించాలనే ఆసక్తి ఆయన సినీ ప్రయాణంలో కనిపిస్తుంది.

44
సినిమా హాలు ఉద్యోగి నుంచి నిర్మాతగా

జేవీఆర్‌ ప్రయాణం సినిమా హాల్లో బుకింగ్ క్లర్క్‌గా ప్రారంభమైంది. ఆ తర్వాత సినిమా హాలుకు యజమానిగా ఎదిగి, పంపిణీ రంగంలోనూ గుర్తింపు సంపాదించారు. విజయవాడలోని గాంధీనగర్‌లో జగపతి పేరుతో హోటల్ వ్యాపారాన్ని కూడా నిర్వహించారు. జగపతి ఆర్ట్స్ సంస్థలో చిన్న ఉద్యోగిగా మొదలైన ఆయన ప్రయాణం డిస్ట్రిబ్యూటర్‌, ఎగ్జిబిటర్‌, నిర్మాత స్థాయికి చేరింది. అయితే నిర్మాతగా కొనసాగిన సమయంలో ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొన్న ఆయన, జీవితపు చివరి రోజుల్లో విజయవాడలో వృద్ధాశ్రమాన్ని నిర్వహించారు. ఆయన మృతితో తెలుగు సినీ పరిశ్రమలో ఒక సీనియర్ నిర్మాతను కోల్పోయినట్లయింది.

Read more Photos on
click me!

Recommended Stories