
ఈ సంక్రాంతికి ఐదు సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో ప్రభాస్ నటించిన `ది రాజాసాబ్`, చిరంజీవి, వెంకటేష్ కలిసి నటించిన `మన శంకర వర ప్రసాద్ గారు`, రవితేజ హీరోగా వచ్చిన `భర్త మహాశయులకు విజ్ఞప్తి`, నవీన్ పొలిశెట్టి `అనగనగా ఒక రాజు`, శర్వానంద్ నటించిన `నారీ నారీ నడుమ మురారి` చిత్రాలు విడుదలయ్యాయి. మరి వీటిలో ఏది హిట్, ఏది ఫట్. ఏ మూవీ సంక్రాంతి విన్నర్? ఏ మూవీ డిజాస్టర్. ఓవరాల్‌గా ఏ సినిమాకి ఎంత కలక్షన్లు వచ్చాయి. ఏది బ్రేక్ ఈవెన్ దాటిందనేది సంక్రాంతి సినిమాల కలెక్షన్లలో చూద్దాం.
సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన మొదటి మూవీ ప్రభాస్ నటించిన `ది రాజాసాబ్`. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. సంజయ్ దత్ కీలక పాత్రలో నటించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. ఈ మూవీకి ప్రారంభం నుంచే నెగటివ్ టాక్ వచ్చింది. దీంతో అది కలెక్షన్లపై పడింది. ఇది 11 రోజులు రూ.205కోట్ల గ్రాస్‌ని వసూలు చేసింది. రూ.120కోట్ల మేరకు షేర్ వచ్చింది. ఈ సినిమా హిట్ కావాలంటే ఇంకా రూ.90కోట్ల షేర్ రావాలి. అది ఇప్పుడు సాధ్యం కాదు. దీంతో ఇది అతిపెద్ద డిజాస్టర్‌గా నిలవబోతుందని చెప్పొచ్చు.
ఆ తర్వాత జనవరి 12న చిరంజీవి నటించిన `మన శంకర వర ప్రసాద్ గారు` మూవీ విడుదలయ్యింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటించింది. వెంకటేష్ స్పెషల్ రోల్ చేశారు. సుస్మిత కొణిదెల, సాహు గారపాటి నిర్మించారు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. 8 రోజుల్లోనే ఏకంగా రూ.300కోట్లు వసూలు చేసింది. ఇప్పటికే ఇది బ్రేక్ ఈవెన్ అయ్యిందని సమాచారం. ఓరకంగా ఇది సంక్రాంతి విన్నర్‌గా నిలవబోతుందని చెప్పొచ్చు.
జనవరి 13న రవితేజ నటించిన `భర్త మహాశయులకు విజ్ఞప్తి` మూవీ విడుదలయ్యింది. కిశోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ మూవీకి మిశ్రమ స్పందన లభిస్తోంది. అయితే కలెక్షన్ల పరంగా డీసెంట్‌గానే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మూవీకి ఏడు రోజుల్లో సుమారు రూ.17కోట్లు వచ్చాయి. అంటే పది కోట్ల వరకు షేర్ సాధించింది. ఇంకా పది కోట్ల షేర్ వస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మూవీకి నష్టాలు తప్పవు.
జనవరి 14న నవీన్ పొలిశెట్టి నటించిన `అనగనగా ఒక రాజు` మూవీ విడుదలైంది. ఇది ఇప్పటికే వంద కోట్లు దాటింది. చిరంజీవి మూవీ తర్వాత అత్యంత విజయవంతంగా రన్ అవుతున్న మూవీ ఇదే కావడం విశేషం. ఇందులో మీనాక్షి చౌదరీ హీరోయిన్‌గా నటించగా, మారి దర్శకత్వం వహించారు. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ మూవీ వంద కోట్లకుపైగా వసూలు చేసిందని టీమ్ ప్రకటించింది. కానీ రూ.70-80కోట్ల వరకు వచ్చాయని సమాచారం. ఇప్పటికే సుమారు రూ.40కోట్ల షేర్ వచ్చిందని తెలుస్తోంది. రూ.28కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో విడుదలైన ఈ మూవీ ఇప్పుడు బ్రేక్ ఈవెన్ దాటుకుని లాభాల్లో వెళ్తోంది.
ఇక సంక్రాంతికి చివరగా విడుదలైన మూవీ `నారీ నారీ నడుమ మురారి`. శర్వానంద్ హీరోగా నటించిన ఈ చిత్రానికి రామ్ అబ్బరాజు దర్శకుడు. అనిల్ సుంకర నిర్మాత. ఈ మూవీకి ప్రారంభం నుంచి హిట్ టాక్ తెచ్చుకుంది. హిలేరియస్‌గా ఆకట్టుకుంటోంది. వసూళ్ల పరంగానూ మెప్పిస్తుంది. థియేటర్లు తక్కువగా ఉండటం వల్ల కలెక్షన్లు తగ్గాయి. కానీ మూవీ మాత్రం అదిరిపోయింది. అయినప్పటికీ సంక్రాంతి పోటీలో వచ్చిన ఈ చిత్రానికి ఇప్పటి వరకు రూ.21కోట్లు వచ్చాయి. పది కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో విడుదలైన ఈ మూవీ ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయ్యింది. ఇక సోమవారం నుంచే లాభాల్లోకి వెళ్లింది. ఇలా ఈ సంక్రాంతికి చిరంజీవి మూవీ టాప్‌లో ఉండగా, ఆ తర్వాత `అనగనగా ఒక రాజు`, `నారీ నారీ నడుమ మురారి` తర్వాత స్థానాల్లో ఉన్నాయి. రవితేజ మూవీ కొద్దిపాటి నష్టాలతో క్లోజ్ కాబోతుంది. ప్రభాస్ మూవీ భారీ డిజాస్టర్‌గా నిలవబోతుంది.